అతితో ఓడారు.. టీమ్ఇండియా కుర్రాళ్ల చెవి మెలిపెట్టనున్న బీసీసీఐ
లీగ్ దశలో 90 పరుగుల తేడాతో ఓడించిన పాకిస్థాన్ చేతిలో ఫైనల్లో 191 పరుగుల తేడాతో ఓడిపోవడం ఏమిటి..? అంత అతి విశ్వాసం ఎందుకు..?;
లీగ్ దశలో 90 పరుగుల తేడాతో ఓడించిన పాకిస్థాన్ చేతిలో ఫైనల్లో 191 పరుగుల తేడాతో ఓడిపోవడం ఏమిటి..? అంత అతి విశ్వాసం ఎందుకు..?
బ్యాటింగ్ కు పూర్తిగా అనుకూలిస్తున్న పిచ్ పై కీలకమైన ఫైనల్లో టాస్ గెలిచి బౌలింగ్ ఎందుకు ఎంచుకున్నారు...? అత్యంత భారీ టార్గెట్ ముందు ఉండగా.. ఆ షాట్లేమిటి.?? అంటూ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అండర్ -19 కుర్రాళ్లపై మండిపడుతోంది. తాజాగా ముగిసిన ఆసియా కప్ అండర్ 19 టోర్నీలో అన్ని మ్యాచ్ లను గెలిచి.. ఎదురే లేదన్నట్లుగా కనిపించిన టీమ్ ఇండియా ఫైనల్లో మాత్రం దారుణంగా ఓడింది. భారత పరుషుల సీనియర్స్ జట్టు పదేపదే పాకిస్థాన్ ను ఓడించిన ఆసియాకప్ లో కుర్రాళ్లు కూడా అదే ఫలితం తెస్తారని భావిస్తే.. ఒట్టి చేతులతో ఇంటికి వచ్చారు. అంతేకాదు.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్, ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీఏ)చైర్మన్ అయిన మొహిసిన్ నఖ్వీకి అనవసరంగా చాన్స్ ఇచ్చారు. ఆదివారం ఫైనల్లో తమ జట్టు గెలిచాక నఖ్వీ మొహం వెలిగిపోయింది. అతడే పాక్ జట్టుకు టైటిల్ అందించాడు. సెప్టెంబరులో జరిగిన సీనియర్స్ సియాకప్ టీ20 టోర్నీలో టీమ్ ఇండియా.. నఖ్వీ నుంచి ట్రోఫీ తీసుకోవడానికి నిరాకరించింది. దీంతో అతడు ట్రోఫీని ఎత్తుకెళ్లిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా ముగిసిన అండర్ 19 ఫైనల్ విషయానికి వస్తే.. దుబాయ్ లో జరిగిన ఈ మ్యాచ్ లో పాక్ మొదట 347 పరుగులు చేసింది. కుర్ర టీమ్ ఇండియా 156 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ ఆయుష్ మాత్రేతో పాటు కుర్ర సంచలనం వైభవ్ సూర్యవంశీ విఫలం కావడంతో అతి భారీ టార్గెట్ ఛేదించడం కష్టమైంది. ఏకంగా 191 పరుగుల వ్యత్యాసంతో పరాజయం పాలైంది.
ఎందుకిలా ఓడారు..?
అసలు మనకు పోటీనే కాని పాకిస్థాన్ చేతిలో ఓడిపోవడంతో బీసీసీఐ ఆగ్రహానికి గురైంది. బోర్డు అపెక్స్ కౌన్సిల్ సభ్యులు సోమవారం సమావేశం అయ్యారు. అండర్ 19 జట్టు ప్రదర్శనపై చర్చించారు. జట్టు ప్రదర్శనపై సమీక్షించాలని నిర్ణయించారు. పైగా ఈ జట్టుకు ప్రధాన కోచ్ ఎవరో కాదు... పాకిస్థాన్ పై 1998 ఇండిపెండెన్స్ కప్ ఫైనల్‌లో అత్యంత ఉత్కంఠ మధ్య బౌండరీ కొట్టి టైటిల్ అందించిన హృషికేశ్ కనిత్కర్. అలాంటి స్ఫూర్తిదాయక ఆటగాడు కోచ్ గా ఉండగా యువ జట్టు ఫైనల్లో ఓడడంతో బీసీసీఐ రంగంలోకి దిగింది.
అండర్ 19 కెప్టెన్ ఔట్...
బీసీసీఐ ఆగ్రహానికి మరో కారణం కూడా ఉంది. వచ్చే నెలలో అండర్ 19 ప్రపంచ కప్ (2026) ఉంది. దీంట్లో భారత్ హాట్ ఫేవరెట్. కానీ, ఆసియా కప్ ఫైనల్లో ఓటమి షాక్ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే అండర్ 19 ప్రపంచ కప్ కెప్టెన్సీ నుంచి ఆయుష్ మాత్రేను తప్పించే చాన్సుందని భావిస్తున్నారు. కనిత్కర్, మాత్రేలతో బీసీసీఐ సభ్యులు మాట్లాడి ఆసియాకప్ టైటిల్ చేజారడానికి గల కారణాలను సమీక్షించనున్నారు. ప్రపంచ కప్ ప్రారంభానికి ముందు లోపాలను దిద్దుకోవాలని సూచించనుంది.