కాబూల్.. గుబుల్..! బుల్లెట్ ప్రూఫ్ కారులో క్రికెట‌ర్ ర‌షీద్ ఖాన్

ఎప్పుడు ఎవ‌రు దాడి చేస్తారో తెలియ‌దు..! ఎక్క‌డ ఎలాంటి బాంబు పేలుతుందో చెప్ప‌లేం..! పేద‌రికం.. కొంద‌రి వ‌ద్దే డ‌బ్బు..! ఇలాంటి స‌మాజంలో భ‌ద్ర‌త చాలా క‌ష్ట‌మే..! అదే ప్ర‌ముఖులైతే ఇంకా క‌ష్టం అని చెప్పాలి.;

Update: 2025-12-23 09:30 GMT

ఎప్పుడు ఎవ‌రు దాడి చేస్తారో తెలియ‌దు..! ఎక్క‌డ ఎలాంటి బాంబు పేలుతుందో చెప్ప‌లేం..! పేద‌రికం.. కొంద‌రి వ‌ద్దే డ‌బ్బు..! ఇలాంటి స‌మాజంలో భ‌ద్ర‌త చాలా క‌ష్ట‌మే..! అదే ప్ర‌ముఖులైతే ఇంకా క‌ష్టం అని చెప్పాలి. అచ్చంగా ఈ ప‌రిస్థితి అఫ్ఘానిస్థాన్ రాజ‌ధాని కాబూల్ లో ఉందంటున్నారు ఆ దేశ స్టార్ క్రికెట‌ర్ ర‌షీద్ ఖాన్. ఈ మిస్ట‌రీ స్పిన్న‌ర్ ప‌దేళ్లుగా అంత‌ర్జాతీయ ప్ర‌పంచానికి ప‌రిచ‌య‌స్తుడు. మ‌రీ ముఖ్యంగా మ‌న హైద‌రాబాద్ ప్ర‌జ‌ల‌కు ద‌గ్గ‌రివాడు. త‌న కెరీర్ 2016లో ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్) స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ ద్వారానే మొద‌లైంది. మూడేళ్ల కింద‌ట గుజ‌రాత్ టైటాన్స్ కు మారినా.. ర‌షీద్ ఖాన్ ఇప్ప‌టికీ హైద‌రాబాద్ జ‌ట్టుపై, న‌గ‌రంపై త‌న ప్ర‌త్యేక అభిమానాన్ని చాటుతుంటాడు. వ‌చ్చే ఏడాది సీజ‌న్ కు సిద్ధం అవుతున్న అత‌డు తాజాగా ఇంగ్లండ్ స్టార్ క్రికెట‌ర్, కామెంటేట‌ర్ గా మారిన కెవిన్ పీట‌ర్స‌న్ తో ఇంట‌ర్వ్యూలో మాట్లాడాడు. మాట‌ల సంద‌ర్భంగా త‌మ దేశంలో ఎలాంటి ప‌రిస్థితులు ఉంటాయ‌నేది ర‌షీద్ ఖాన్ వివ‌రించాడు. వాస్త‌వానికి నాలుగేళ్ల కింద‌టే అఫ్ఘానిస్థాన్ తాలిబ‌న్ల వ‌శ‌మైంది. వారి పాల‌న‌, ప్ర‌భుత్వంపై మొద‌ట్లో అనేక అనుమానాలు ఉన్నా అఫ్ఘాన్ ప్ర‌శాంతంగానే ఉంది. ప్ర‌జాస్వామ్య ప్ర‌భుత్వం కాదు కాబ‌ట్టి చాలా దేశాలు గుర్తించ‌లేదు. ఇక ఇటీవ‌ల పాకిస్థాన్ తో అఫ్ఘాన్ ప్ర‌భుత్వానికి శ‌త్రుత్వం పెరిగింది. అదే భార‌త్ కు తాలిబ‌న్ల‌ను ద‌గ్గ‌ర చేసింది. భార‌త్ కూడా వారిప‌ట్ల త‌న వైఖ‌రి మార్చుకుంది. అటు తాలిబ‌న్లు కూడా భార‌త్ ప‌ట్ల త‌మ వైఖ‌రి మార్చుకున్నారు. ఈ ఇరు దేశాలు ప్ర‌స్తుతం స్నేహ‌సంబంధాల‌తో ఉంటున్నాయి.

అంత‌ర్జాతీయ మ్యాచ్ లు లేని కాబూల్

కాబూల్ అంటే చారిత్ర‌క న‌గ‌రం. కానీ, అంత‌ర్యుద్ధాల కార‌ణంగా అఫ్ఘాన్ అత‌లాకుత‌లం కావ‌డంతో కాబూల్ కు ఉన్న చ‌రిత్ర చెదిరిపోయింది. క్రికెట్ లో బ‌లంగా ఎదుగుతున్న అఫ్ఘానిస్థాన్ లో క‌నీసం ఒక్క అంత‌ర్జాతీయ మ్యాచ్ కూడా నిర్వ‌హించ‌లేని ప‌రిస్థితి.. కాబూల్ లో మోస్త‌రు వ‌స‌తుల‌తో స్టేడియం ఉన్న‌ప్ప‌టికీ భ‌ద్ర‌తా కార‌ణాల రీత్యాఅక్క‌డ మ్యాచ్ లు ఆడ‌డం క‌ష్ట‌మే. ఆఖ‌రికి జింబాబ్వే రాజ‌ధాని హ‌రారేలోనూ అంత‌ర్జాతీయ మ్యాచ్ లు జ‌రుగుతుండ‌గా.. కాబూల్ లో మాత్రం ఆ అవ‌కాశం లేకుండా పోతోంది.

ర‌షీద్ కే కాదు చాలామందికి బుల్లెట్ ప్రూఫ్ కార్లు

ఇక ర‌షీద్ ఖాన్ తో పీట‌ర్స‌న్ ఇంట‌ర్వ్యూ విష‌యానికి వ‌స్తే.. అఫ్ఘానిస్థాన్ లో నీ జీవితం ఏమిటి? వీధుల్లో స్వేచ్ఛ‌గా తిర‌గ‌గ‌లావా? అని పీట‌ర్స‌న్ ప్ర‌శ్నించాడు. దీనికి స‌మాధానంగా నో అని చెప్పాడు ర‌షీద్ ఖాన్. వెళ్తేగిళ్తే బుల్లెట్ ప్రూఫ్ కారులోనే వెళ్లాల్సి ఉంటుంద‌ని, క‌నీసం సాధార‌ణ కారులోనూ ప్ర‌యాణించ‌లేన‌ని చెప్పాడు. దీనికి నీకు బుల్లెట్ ప్రూఫ్ కారుందా? అంటూ పీట‌ర్స‌న్ నోరెళ్లబెట్టాడు. నీకు బుల్లెట్ ప్రూఫ్ కారెందుకు? అని ప్ర‌శ్నించ‌గా.. భ‌ద్ర‌త రీత్యా త‌ప్ప‌నిస‌రి అని ర‌షీద్ చెప్పాడు. ఎవ‌రో షూట్ చేస్తారని కాదు కానీ.. రాంగ్ ప్లేస్ లో రాంగ్ టైమ్ లో ఏమైనా జ‌రిగే ప్ర‌మాదం ఉండొచ్చ‌ని బ‌దులిచ్చాడు. బుల్లెట్ ప్రూఫ్ కారు అయితే భ‌ద్రంగా ఉంటుంద‌ని పేర్కొన్నాడు. అప్ప‌టికీ చాలామంది ప్ర‌జ‌లు త‌న కారు డోరు తెరిచేందుకు ప్ర‌య‌త్నిస్తార‌ని వివ‌రించాడు. తానే కాదు చాలామంది అఫ్ఘాన్ లో బుల్లెట్ ప్రూఫ్ కార్ల‌ను వాడుతుంటార‌ని.. ఇది చాలా సాధార‌ణ విష‌యం అని పేర్కొన్నాడు.

పీట‌ర్స‌న్ అవాక్కు..

ర‌షీద్ ఖాన్ తో ఇంట‌ర్వ్యూలో అత‌డు చెప్పిన విష‌యాలు విని పీట‌ర్స‌న్ అవాక్క‌య్యాడు. మ‌రీ ముఖ్యంగా త‌న‌లా చాలా మంది బుల్లెట్ ప్రూఫ్ కారు వాడ‌తార‌ని చెప్ప‌గా.. ఇది ఫాసినేటింగ్ అంటూ ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశాడు. ఇక పీట‌ర్స‌న్ ద‌క్షిణాఫ్రికాలో పుట్టినా ఇంగ్లండ్ లో స్థిర‌ప‌డి ఆ దేశ జ‌ట్టుకు ఆడాడు. స‌హ‌జంగానే ప్ర‌జ‌ల వ్య‌క్తిగ‌త జీవితానికి అధిక ప్రాధాన్యం ఇచ్చే ఇంగ్లండ్ లో పీట‌ర్స‌న్ రోడ్ల‌పై న‌డుచుకుంటూ వెళ్లినా ఎవ‌రూ ప‌ట్టించుకోరు. అందుకే అఫ్ఘానిస్థాన్ లో ర‌షీద్ ఖాన్ ప‌రిస్థితి ఏమిటో తెలుసుకుని ఆశ్చ‌ర్య‌పోయాడు.

Tags:    

Similar News