టీమిండియా కోచ్ మార్పుపై బీసీసీఐ సంచలన ప్రకటన
గౌతం గంభీర్.. టీమిండియా హెడ్ కోచ్ గా వచ్చినప్పటి నుంచి ఆయన దూకుడు, వ్యవహారశైలి కారణంగా వివాదాలు కొనితెచ్చుకుంటున్నాడు.;
గౌతం గంభీర్.. టీమిండియా హెడ్ కోచ్ గా వచ్చినప్పటి నుంచి ఆయన దూకుడు, వ్యవహారశైలి కారణంగా వివాదాలు కొనితెచ్చుకుంటున్నాడు. టీమిండియా ఆయన హయాంలో టీ20ల్లో జట్టు బాగానే పర్ ఫామెన్స్ చేస్తున్నా.. టెస్టుల్లో మాత్రం ఘోరంగా విఫలమవుతోంది. వన్డేల్లోనూ పెద్దగా రాణించడం లేదు. దీంతో టీమిండియా కోచ్ మార్పు చేయబోతున్నారన్న ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.
తాజాగా భారత క్రికెట్ జట్టు హెడ్కోచ్ గా వీవీఎస్ లక్ష్మణ్ పేరు తెరపైకి రావడం.. ఆయనతో బీసీసీఐ చర్చలు జరుపుతోందన్న వార్తలపై బీసీసీఐ స్పందించింది. ఈ ఊహాగానాలకు తెరదించింది. టెస్ట్ ఫార్మాట్ నుంచి గంభీర్ ను తప్పించి ఆ బాధ్యతలను వీవీఎస్ లక్ష్మణ్ కు అప్పగిస్తారంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో కొన్ని ప్రధాన వార్త సంస్థల్లో వస్తున్న కథనాలను బీసీసీఐ తీవ్రంగా ఖండించింది.
అసలేం జరిగింది?
ఈ ఏడాది దక్షిణాఫ్రికా (0-2), న్యూజిలాండ్ (0-3) టెస్టు సిరీస్ లలో టీమిండియా వైట్ వాష్ కావడంతో గంభీర్ కోచింగ్ శైలిపై విమర్శలు వెల్లువెత్తాయి. దాదాపు 12 ఏళ్ల తర్వాత భారత్ స్వదేశంలో టెస్టు సిరీస్ ను కోల్పోవడంతో గంభీర్ చేసిన ప్రయోగాలే జట్టు ఓటమికి కారణమని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే గంభీర్ ను కేవలం పరిమిత ఓవర్ల క్రికెట్ వైట్ బాల్ కే పరిమితం చేసి టెస్టుల్లో లక్ష్మణ్ ను కోచ్ గా నియమిస్తారనే వార్తలు జోరందుకున్నాయి.
బీసీసీఐ కీలక ప్రకటన..
ఈ వివాదంపై బీసీసీఐ ప్రధాన కార్యదర్శి దేవజిత్ సైకియా ఒక జాతీయ ఛానల్ తో మాట్లాడుతూ ఘాటుగా స్పందించారు. ఈ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. ‘గౌతమ్ గంభీర్ ను మారుస్తామన్న వార్తలు కేవలం రూమార్లు మాత్రమే. ఇప్పటివరకూ బోర్డులో ఎలాంటి చర్చలే జరగలేదు. 2027 వన్డే ప్రపంచకప్ వరకూ గంభీర్ తో మాకు ఒప్పందం ఉంది. ఒప్పందం ప్రకారం ఆయనే కోచ్ గా కొనసాగుతారు’ అని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్పష్టం చేశారు.
గంభీర్ జూలై 2024లో రాహుల్ ద్రవిడ్ నుండి బాధ్యతలు స్వీకరించారు. ఆయన హయాంలో జట్టు ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. ఇంగ్లండ్ పై టెస్టు సిరీస్ ను సమయం చేసిన టీమిండియా, ఆస్ట్రేలియా చేతిలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఓడింది. స్వదేశంలో న్యూజిలాండ్, సౌతాఫ్రికా చేతుల్లో వైట్ వాష్ కు గురైంది. 27 ఏళ్ల తర్వాత లంకపై వన్డే సిరీస్ ఓటమి చెందడం మైనస్ గా మారింది.
గంభీర్ ఆధ్వర్యంలో టీమ్ ఇండియా వైట్ బాల్ టీ20 క్రికెట్‌లో చాలా బలంగా కనిపిస్తోంది. అయితే, టెస్టుల్లో.. స్పిన్ బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో బ్యాటర్లు తడబడటం ఆందోళన కలిగిస్తోంది. వచ్చే ఏడాది జట్టు ప్రదర్శన ఆధారంగానే బీసీసీఐ తదుపరి కార్యాచరణ ఉండే అవకాశం ఉంది.
ప్రస్తుతానికి గంభీర్ పదవికి ఎలాంటి ఢోకా లేదని బీసీసీఐ క్లారిటీ ఇవ్వడంతో గత కొన్ని రోజులుగా సాగుతున్న కోచ్ మార్పు చర్చకు ప్రస్తుతానికి తెరపడినట్లైంది.