యాషెస్‌కు వాట్‌ ఎ ఆరంభం!

Update: 2015-07-11 11:27 GMT
యాషెస్‌ సిరీస్‌ అనగానే వేరే దేశాల ప్రేక్షకులు కూడా అంత ఆసక్తి చూసేది అందుకే. టెస్టులకు కాలం చెల్లిందన్న వాళ్లకు ఈ సిరీస్‌ చెంపపెట్టులాంటి సమాధానం. తొలి టెస్టు సాగుతున్న తీరు చూస్తే తెలుస్తుంది టెస్టు క్రికెట్లో ఎంత మజా ఉందనేది. మ్యాచ్‌ మొదలవ్వడానికి ముందు అందరూ ఆస్ట్రేలియానే ఫేవరెట్‌ అన్నారు. ఇంగ్లాండ్‌ పోటీ ఇచ్చినా గొప్పే అన్నారు. సిరీస్‌ను ఆస్ట్రేలియా 5-0తో క్లీన్‌స్వీప్‌ చేస్తుందన్నారు. కానీ మూడు రోజుల ఆట అనూహ్య మలుపులు తిరిగి.. ఇంగ్లాండ్‌దే పైచేయి అయింది. తొలి ఇన్నింగ్స్‌ను పేలవంగా ఆరంభించినా.. ఇంగ్లాండ్‌ పుంజుకుని 430 పరుగులు చేస్తే.. ఆరంభంలో అద్భుతంగా ఆడిన ఆస్ట్రేలియా 308 పరుగులకే ఆలౌటై.. ప్రత్యర్థికి 122 పరుగుల ఆధిక్యాన్ని సమర్పించుకుంది.

రెండో ఇన్నింగ్స్‌ 289 పరుగులు చేసిన ఇంగ్లాండ్‌ ప్రత్యర్థి ముందు 412 పరుగుల భారీ లక్ష్యాన్ని నిలిపింది. నాలుగో ఇన్నింగ్స్‌లో 400కు పైగా లక్ష్యాన్ని ఛేదించడం ఎంత కష్టమో చరిత్ర చూస్తే తెలుస్తుంది. ఇప్పటిదాకా మూణ్నాలుగు సందర్భాల్లో మాత్రమే ఇది సాధ్యమైంది. కాబట్టి ఆసీస్‌ ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం చాలా చాలా కష్టం. అదే జరిగితే పెద్ద సంచలనం అవుతుంది. అలా కాకుండా ఇంగ్లాండ్‌ గెలిచినా సంచలమే. ఎందుకంటే సిరీస్‌కు ముందు ఆ జట్టు మీద ఎవరికీ అంచనాల్లేవు. భీకరమైన ఫామ్‌తో, బలమైన జట్టుతో యాషెస్‌ బరిలో నిలిచిన ఆస్ట్రేలియాను ఇంగ్లాండ్‌ ఓడించడం కంగారూలకు మింగుడు పడదు. రెండు రోజుల ఆట మిగిలుంది కాబట్టి ఫలితం రావడం ఖాయం. గెలిచేది ఎవరైనా యాషెస్‌కు మాత్రం అద్భుతమైన ఆరంభం దక్కబోతున్నట్లే.

Tags:    

Similar News