ఏడు కోట్ల దున్న‌పోతు

Update: 2015-11-11 07:24 GMT
ఈ ఫొటోలో ఉన్న యువరాజు ...దున్నపోతని తేలిగ్గా తీసేయకండి ఎందుకంటే...దీని భోగభాగ్యాలు వింటే నిజంగానే యువరాజని మాతో పాటు మీరూ అంగీకరిస్తారు! హర్యానాలోని కురుక్షేత్రకు చెందిన క‌ర‌మ్‌ వీర్ సింగ్ అనే పాడిరైతు వద్ద ఉంది. దూరంగా ఉన్న రాష్ర్టంలోని దున్న‌పోతు గురించి మ‌న‌కెందుకు అంటారా.....ఆ దున్న విశిష్టత‌లు చెప్పాల్సిన విధంగానే ఉన్నాయి మ‌రి.

హైదరాబాద్ నగరంలో ఏటా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే యాద‌వుల పండ‌గ...సదర్ ఉత్సవాల కోసం ఈ యువ‌రాజును  అఖిల భారత యాదవ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎడ్ల హరిబాబు యాదవ్ నగరానికి తీసుకొచ్చారు. ఏడు సంవత్సరాలున్న ఈ యువరాజు బరువు 1600 కేజీలు. ఆరున్నర అడుగుల ఎత్తు - 14 అడుగుల పొడువున్న దీనిని 12 టైర్ల లారీపై తీసుకొచ్చారు. ఈ లారీని అనుసరిస్తూ మరో మూడు వాహనాలు తరలివచ్చాయట. ఈ యువరాజా వారు ప్రతి రోజూ 100 ఆపిల్స్ - 20 లీటర్ల పాలు తాగుతుంద‌ట‌. అయినా కడుపు నిండదట. ఆ తర్వాత టమాటోలు, బ‌త్తాయిని మేతగా వేస్తారు! ఆ రేంజ్‌ లో తినడం వ‌ల్లే ఈ రేంజ్‌ లో పెరిగింది.

ఇంత బలిసిన యువరాజు తిండికి తిమ్మరాజు - పనికి పోతరాజేనా? అనుకోకండి! ముర్రాజాతిలో ఈ యువరాజుని మించిన మగమహారాజు (దున్నపోతు) మరోటి లేదట. జాతీయస్థాయి పశు ప్రదర్శనల్లో 12సార్లు ఛాంపియన్‌ గా నిలిచిన ఘనత ఈ యువరాజు సొంతం. తిండికి తగ్గ పని చేయలేకున్నా, యజమానికి అంతకంటే ఎక్కువ ఆదాయాన్నే సమకూరుస్తోందీ యువరాజు. దీని నుంచి సేకరించే వీర్యంతో ఏటా కోటి రూపాయలు సంపాదిస్తున్నాని యజమాని చెప్పాడు. యూరోపియన్ దేశాలతో పాటు టర్కీ - స్కాట్లాండ్ - బ్రెజిల్ వంటి దేశాలకు సైతం ఆ వీర్యాన్ని ఎగుమతి చేస్తున్నారు.  ప్రస్తుతం డీఎల్ డెయిరీఫామ్ (ముషీరాబాద్)లో ఉన్న యువరాజును చూసేందుకు జనం ఎగబడుతున్నారు. ఈ ఘనత వహించిన యువరాజును రూ. 7.5 కోట్లకు కొంటామని ముందుకొచ్చినా అమ్మనంటున్నాడు యజమాని.
Tags:    

Similar News