జనసేన దెబ్బకు ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో టెన్షన్

Update: 2018-01-31 14:27 GMT
వైసీపీ నుంచి ఫిరాయించి టీడీపీలో చేరిన ఎమ్మెల్యేల్లో కొందరు ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో తమ భవిష్యత్తేంటన్న విషయంలో టెన్షన్ పడుతున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా టీడీపీతో అంటకాగే జనసేన పార్టీ నుంచి కనీసం 30 మంది అభ్యర్థులు టీడీపీ మద్దతుతో పోటీలో ఉంటారని.. వారికి ఈ ఫిరాయింపు స్థానల్లోనే నిలుపుతారన్న ప్రచారం ఒకటి మొదలైంది. ఇదే నిజమైతే.. వైసీపీ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో టికెట్ దొరుకుతుందన్న గ్యారంటీ లేనట్లే. దాంతో పలువురు ఫిరాయింపు ఎమ్మెల్యేలు ముందే జాగ్రత్తపడుతున్నారని.. మళ్లీ జగన్ పంచన చేరాలని భావిస్తున్నారని సమాచారం.
    
ఇప్పటికే ఎనిమిది మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలు నేరుగా జగన్‌ను కాంటాక్ట్ చేయకపోయనా విజయసాయిరెడ్డి, బొత్స సత్యనారాయణ వంటి సీనియర్లతో మళ్లీ టచ్ లో ఉన్నట్లు వినిపిస్తోంది. వీరంతా మళ్లీ వైసీపీలోకి వచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే.. వైసీపీ వారిని అబ్జర్వేషన్లో ఉంచి నమ్మకం కుదిరితేనే మళ్లీ తీసుకోవాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.
    
దీనికి తగ్గట్లుగానే జగన్ తాజా వ్యాఖ్యలు కూడా ఉన్నాయి. ఫిరాయింపుదారులు తిరిగి వస్తే పార్టీలోకి తీసుకుంటామని ఆయన సూచనప్రాయంగా చెప్పారు. ఆవేశంలో కొందరు కొన్ని సమయాల్లో తప్పులు చేస్తుంటారని.. అలాంటి వారు వాటిని తెలుసుకుని తిరిగి వస్తే అభ్యంతరం లేదన్నారు. కాకపోతే వారిపై పూర్తి నమ్మకం కలిగితేనే పార్టీలోకి తీసుకుంటామని చెప్పారు జగన్.


Tags:    

Similar News