రాత్రి వేళ సీఎం చిట్ చాట్ అన్నారు సరే.. కేసీఆర్ సంగతి మరిచారా?
ఒకరిని వేలెత్తి చూపే వేళలో నాలుగు వేళ్లు మనవైపు చూపిస్తుంటాయన్న చిన్న లాజిక్ ను బీఆర్ఎస్ ముఖ్యనేతలు మొదలుకొని ఆ పార్టీని అభిమానించి..ఆరాధించేటోళ్లు మిస్ అవుతున్నట్లుగా కనిపిస్తోంది.;
ఒకరిని వేలెత్తి చూపే వేళలో నాలుగు వేళ్లు మనవైపు చూపిస్తుంటాయన్న చిన్న లాజిక్ ను బీఆర్ఎస్ ముఖ్యనేతలు మొదలుకొని ఆ పార్టీని అభిమానించి..ఆరాధించేటోళ్లు మిస్ అవుతున్నట్లుగా కనిపిస్తోంది. ప్రతి విషయాన్ని భూతద్దంలో చూపిస్తూ.. ఇలాంటివి ఎప్పుడైనా చూశామా? ఎప్పుడైనా మనకు అనుభంలో ఉందా? అంటూ విస్మయాన్ని ప్రదర్శిస్తూ.. ఆ వెంటనే అడ్డంగా బుక్ అవుతున్న వైనం చూస్తే.. అయ్యో అనిపించక మానదు. రెండేళ్ల విరామం తర్వాత గులాబీ బాస్ కేసీఆర్ మీడియా ముందుకు వచ్చి.. రేవంత్ సర్కారుపై క్రమపద్దతిలో విమర్శలు చేసి.. ప్రశ్నలు సంధించి ఉంటే బాగుండేది.
అందుకు భిన్నంగా తాను తిట్టాల్సిన తిట్లు తిట్టేయటం.. తోలు తీస్తానంటూ వార్నింగ్ ఇవ్వటం.. నీ సంగతి చెబుతా బిడ్డా అన్నట్లుగా విరుచుకుపడ్డారు. అదే సమయంలో సందర్భంలేని రీతిలో పక్క రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రి చంద్రబాబు ముచ్చట తీసుకొచ్చి.. ఆయనపై తనకున్న ఆగ్రహాన్ని.. ఆక్రోశాన్ని కక్కేశారు. నీ రాష్ట్రం నీది. నా రాష్ట్రం నాది అంటూ తరచూ హద్దులు చెప్పే పెద్దమనిషి.. రెండేళ్ల విరామం తర్వాత తెర మీదకు వచ్చిన సందర్భంగా తన సొంత రాష్ట్రం.. తన ప్రజల గురించి మాట్లాడటం వదిలేసి.. పక్క రాష్ట్రం ముఖ్యమంత్రిని ఉద్దేశించి విమర్శలు గుప్పిస్తే ప్రయోజనం ఏమిటి? అన్నది ప్రశ్న.
నాలుగు విమర్శలు.. పద్నాలుగు పంచ్ లతో.. అంతకు మించిన నిందలతో తన సుదీర్ఘ ప్రెస్ మీట్ ను ముగించిన కేసీఆర్ కు కౌంటర్ ఇచ్చేందుకు ఆదివారం రాత్రి వేళలో మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు ముఖ్యమంత్రి రేవంత్. సీరియస్ విమర్శలు చేసినంతనే.. దానికి బదులు ఇవ్వటం తెలుగు రాజకీయాల్లో గడిచిన కొన్నేళ్లుగా వస్తున్న అలవాటే. దీనికి కేసీఆర్ సైతం మినహాయింపు కాదు.
ఆ మాటకు వస్తే.. దేశంలో మరే ముఖ్యమంత్రి నిర్వహించని రీతిలో రాత్రి వేళలో ప్రెస్ మీట్లు నిర్వహించటం కేసీఆర్ ముందుంటారు. అంతేకాదు.. ప్రెస్ మీట్ సందర్భంగా మీడియా ప్రతినిధులను ఉద్దేశించి చులకనగా మాట్లాడటం.. చిందులు వేయటం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఇలాంటి తీరు దేశంలోని మరే ముఖ్యమంత్రి ప్రదర్శించరు. సీఎం రేవంత్ రాత్రివేళ విలేకరులతో చిట్ చాట్ నిర్వహించిన అంశాన్ని ప్రస్తావించిన హరీశ్ రావు.. తనపాతికేళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడూ అలాంటి సందర్భాన్ని చూడలేదని వ్యాఖ్యానించారు.
ఇక్కడో ఫన్నీ పాయింట్ ఏమంటే.. ముఖ్యమంత్రి చిట్ చాట్ గురించి విమర్శలు చేసిన హరీశ్ రావు.. తాను కూడా ఈ మాటల్ని చిట్ చాట్ లోనే తప్పించి.. మీడియా సమావేశంలో కాదన్న విషయాన్ని చూస్తే ఆశ్చర్యానికి గురి కావటం ఖాయం. ముఖ్యమంత్రిని ఉద్దేశించి.. ఆయన తీరును క్వశ్చన్ చేసే వేళలో.. హరీశ్ అదే తీరును ప్రదర్శించటం చూస్తే.. ఇలాంటివే కదా సెల్ఫ్ గోల్ అంటే అన్న భావన కలుగక మానదు. సీఎం రేవంత్ ను వేలెత్తి చూపే క్రమంలో తనను తాను సెల్ఫ్ గోల్ వేసుకున్న తీరు చూస్తే.. హరీశ్ రావు మరికాస్త జాగ్రత్తగా ప్రిపేర్ కావాల్సిన అవసరాన్ని సూచిస్తుందని చెప్పాలి.