జ‌గ‌న్ మాటే మంత్రం!... సింగిల్ సిట్టింగ్‌ లో సెట్‌!

Update: 2019-02-15 11:18 GMT
రాజ‌కీయాల్లో ఏదైనా వివాదం త‌లెత్తితే... దానిని ప‌రిష్క‌రించ‌డం అంత ఈజీ కాదు. ఇందుకు నిద‌ర్శ‌నం టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు చేస్తున్న పంచాయ‌తీలు. క‌డ‌ప జిల్లా జ‌మ్మ‌ల‌మ‌డుగు, క‌ర్నూలు జిల్లా ఆళ్ల‌గ‌డ్డ పంచాయ‌తీల‌ను తెంచేందుకు బాబు చేయ‌ని య‌త్నాలంటూ లేవు. ద‌ఫ‌ద‌ఫాలుగా, విడ‌త‌ల‌వారీగా లెక్క‌లేన‌న్ని సార్టు సిట్టింగేసిన చంద్ర‌బాబు... నానా అవ‌స్థ‌లు ప‌డి జ‌మ్మ‌ల‌మ‌డుగు పంచాయ‌తీని ఓ దారికి తెచ్చారు. అయితే ఈ స‌యోధ్య ఎంత‌కాలం కొన‌సాగుతుందో తెలియ‌ని ప‌రిస్థితి. ఇక ఆళ్ల‌గ‌డ్డ ప‌రిస్థితి స‌రేస‌రి. అయితే వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వ‌ద్ద ఈ త‌ర‌హా నాన్చుడు పంచాయ‌తీలు ఉండ‌వు. సింగిల్ సిట్టింగ్ లోనే వివాదం స‌మ‌సిపోవాల్సిందే. అందుకోసం ఏం చేయాల‌న్న విష‌యంపై చాలా లోతుగా ఆలోచించే జ‌గ‌న్‌.... త‌ను వెళ్ల‌కుండానే ఆ స‌మ‌స్య‌ను ఇట్టే ప‌రిష్క‌రించేస్తున్నారు. రాజంపేట‌లో నెల‌కొన్న వివాదాన్ని జ‌గ‌న్ మార్గ‌ద‌ర్శ‌క‌త్వంలో ఆ పార్టీ నేత‌లు సింగిల్ సిట్టింగ్ లోనే ప‌రిష్క‌రించేసిన వైనం ఇందుకు నిలువెత్తు నిద‌ర్శ‌నంగా నిలుస్తోందని చెప్పాలి.

ఈ వ్య‌వ‌హారానికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే... గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో క‌డ‌ప జిల్లాలోని ఒక్క రాజంపేట అసెంబ్లీ మిన‌హా అన్ని స్థానాల‌ను వైసీపీ గెలుచుకుంది. రాజంపేట‌లో టీడీపీ త‌ర‌ఫున బ‌రిలోకి దిగిన మేడా మ‌ల్లికార్జున రెడ్డి ఎమ్మెల్యేగా విజ‌యం సాధించారు. అయితే ఎన్నిక‌లు స‌మీపిస్తున్న ప్ర‌స్తుత త‌రుణంలో అక్క‌డ ఫిరాయింపు నేత‌, మంత్రి ఆదినారాయ‌ణ రెడ్డి జోక్యం అధికం కావ‌డంతో మేడా పార్టీ మారిపోయారు. టీడీపీకి, ఆ పార్టీ టికెట్ పై అందిన ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసేసిన మేడా... వైసీపీలో చేరిపోయారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో రాజంపేట ఎమ్మెల్యే టికెట్ మేడాకే కేటాయించాల‌ని వైసీపీ నిర్ణ‌యించేసింది. మ‌రి గ‌డ‌చిన ఎన్నికల్లో వైసీపీ త‌ర‌ఫున పోటీ చేసిన అమ‌ర్ నాథ రెడ్డి ప‌రిస్థితి ఏమిటి? ఇదే వివాదానికి దారి తీసింది. మేడాకు టికెట్ ఇస్తే.... ఆది నుంచి పార్టీని న‌మ్ముకుని ఉన్న తానెక్క‌డికి పోవాలంటూ అమ‌ర్ నాథ‌రెడ్డి అడిగిన ప్ర‌శ్న కూడా స‌బ‌బుగానే ఉంది.

అయితే ఇద్ద‌రికీ ఒకే సారి టికెట్టు ఇవ్వ‌డం కుద‌ర‌దు క‌దా. ఇదే అంశంపై రాజీమంత్రాన్ని ర‌చించిన జ‌గ‌న్‌... దానిని చిటికెలోనే ప‌రిష్క‌రించేశారు. జ‌గ‌న్ ర‌చించిన వ్యూహాన్ని అమ‌లు చేసిన పార్టీ యువ‌నేత‌, రాజంపేట తాజా మాజీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి... మేడాతో పాటు అమ‌ర్ నాథ‌రెడ్డిని రాజంపేట‌లో కూర్చోబెట్టారు. ఎమ్మెల్యే ప‌దవిని వ‌దిలేసుకుని వ‌చ్చిన మేడాకు టికెట్ ఇవ్వాల్సిందేన‌ని, అదే స‌మ‌యంలో మేడా విజ‌యానికి అమ‌ర్ కృషి చేయాల్సిందేన‌ని ఆయ‌న వారిద్ద‌రికీ తేల్చి చెప్పారు. అదే స‌మ‌యంలో వైసీపీ అధికారంలోకి వ‌స్తే... అమ‌ర్‌ కు ప్రాధాన్యం క‌లిగిన ప‌ద‌వితో పాటు నియోజ‌క‌వ‌ర్గంలో మంచి ప్రాధాన్యం ద‌క్కేలా చూసుకోవాల్సిన బాధ్య‌త మేడాదేన‌ని కూడా చెప్పారు. ఈ రాజీ మంత్రానికి ఇద్ద‌రు నేత‌లు అక్క‌డిక‌క్క‌డే స‌రేన‌నేశారు. మొత్తంగా రాజంపేట పంచాయ‌తీ సింగిల్ సిట్టింగ్ లో సెట్ అయిపోయింద‌న్న మాట‌.

Tags:    

Similar News