పీపీపీ వార్...వైసీపీకి బూమరాంగ్ ?

కేవలం ఆదోని తప్ప ఏపీలో మిగిలిన కళాశాలల విషయంలో టెండర్ల కోసం ఆహ్వానిస్తే ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. ప్రభుత్వం ఈ విధంగా నాలుగు మెడికల్ కాలేజీలకు ఆహ్వానించినట్లుగా చెబుతోంది.;

Update: 2025-12-25 01:30 GMT

ఏపీలో ప్రస్తుతం పీపీపీ వార్ సాగుతోంది. ప్రభుత్వ రంగంలో ఉండాల్సిన మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తున్నారు అని వైసీపీ దీని మీద పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేసింది. అంతే కాదు గత మూడు నెలలుగా జనంలోకి వెళ్ళి మరీ కోటి సంతకాల సేకరణ పేరుతో కార్యక్రమాలు నిర్వహించింది ఇవన్నీ ఒక ఎత్తు అయితే జగన్ మీడియా సమావేశాలలో ఒక ఘాటు హెచ్చరికను జారీ చేశారు. పీపీపీ విధానంలో ఎవరైనా టెండర్లు దక్కించుకుంటే తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వారి మీద చర్యలు తీసుకుంటామని జైలులో పెడతామని కూడా హెచ్చరించారు. అయితే ఇపుడు ఏపీలో జగన్ హెచ్చరికలు పనిచేశాయా అన్న చర్చ అయితే సాగుతోంది.

సింగిల్ గానే :

కేవలం ఆదోని తప్ప ఏపీలో మిగిలిన కళాశాలల విషయంలో టెండర్ల కోసం ఆహ్వానిస్తే ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. ప్రభుత్వం ఈ విధంగా నాలుగు మెడికల్ కాలేజీలకు ఆహ్వానించినట్లుగా చెబుతోంది. అయితే ఈ విషయంలో గడువు ముగిసిన తరువాత చూస్తే పరిస్థితి వేరుగా ఉంది. దాంతో జగన్ హెచ్చరికలు పనిచేశాయని తమ మాట నెగ్గిందని వైసీపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. అయితే అదే సమయంలో ప్రభుత్వం పీపీపీ విధానమే కొనసాగుతుందని చెప్పడం విశేషం.

ప్రతి నాయక పాత్రగా :

ఈ విషయంలో వైసీపీ పాత్ర ప్రతిపక్ష పాత్రగా లేదని ప్రతి నాయక పాత్రగా ఉందని మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేసారు. వైసీపీని ఆయన తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వం అయితే పీపీపీ విధానం దేశంలో అనేక రాష్ట్రాలలో ఉందని చెబుతోంది. పేదలకు నాణ్యమైన వైద్యంలో రాజీలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. అంతే కాదు పీపీపీ విధానంపై ముందుకే వెళ్తామని అన్నారు. తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టండి అని పిలుపు ఇచ్చారు టెండర్ల ప్రక్రియను వేగవంతం చేయాలని ఆయన అధికారులకు సూచించారు. అలాగే ఆదోని మెడికల్ కాలేజ్‌ నిర్మాణానికి ముందుకొచ్చిన సంస్థతో ఒప్పందం చేసుకుంటామని వైద్య ఆరోగ్య శాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడిస్తున్నారు.

అభివృద్ధికి అవరోధం :

ఇక ఈ విషయంలో కూటమి నుంచి వైసీపీ మీద పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. అభివృద్ధికి వైసీపీ వ్యతిరేకంగా మారుతోంది అని అంటున్నారు పీపీపీ మోడల్ లో తొందరగా మెడికల్ కాలేజీలను ప్రజలకు అందించాలని చూస్తే దానికి కాదని చెప్పడం ద్వారా వైసీపీ మరోసారి ఏపీలో విధ్వంసానికి తెర తీస్తోంది అని కూడా అంటోంది. ఇక పీపీపీ మోడల్ విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. తొందరగా వైద్య విద్యతో పాటు వైద్యం కూడా అందుబాటులోకి రావాలని అంతా కోరుకుంటున్నారు. వైసీపీ పీపీపీని వ్యతిరేకించడం వరకూ ఓకే కానీ అధికారంలోకి వస్తే జైళ్ళల్లో పెడతామని చేసిన హెచ్చరికల వల్ల పీపీపీ ఆగిపోతే అది ఏ మేరకు మేలు చేస్తుంది అన్న చర్చ కూడా మొదలైంది అంటున్నారు అంతే కాదు ఇదే తీరున పెట్టుబడులను రాకుండా వైసీపీ అడ్డుపడుతోందని కూటమి చెప్పిన మాటలను ఏపీ ప్రగతి కోరుకునే వారు నమ్మే పరిస్థితి వస్తోందని అది అంతిమంగా వైసీపీకే బూమరాంగ్ అయ్యేలా ఉందని అంటున్నారు. ప్రతిపక్షంగా ప్రభుత్వం మీద విమర్శలు చేసినా రాష్ట్ర హితం కోసం నిర్మాణాత్మకంగా కూడా వ్యవహరించాలని అంటున్నారు.

Tags:    

Similar News