జగన్ మామతో మేనల్లుడు...ఏం జరుగుతోంది ?

జగన్ పుట్టిన రోజు వేళ షర్మిల ఆయనకు శుభాకాంక్షలు చెప్పారు. దానికి జగన్ కూడా థాంక్యూ షర్మిలమ్మా అని బదులు ఇచ్చారు.;

Update: 2025-12-25 00:30 GMT

వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రస్తుతం పులివెందుల పర్యటనలో ఉన్నారు. ఆయన ప్రతీ ఏటా క్రిస్మస్ వేడులకను అక్కడే జరుపుకుంటారు. ఇది చాలా ఏళ్ళుగా కొనసాగుతూ వస్తోంది. మొత్తం వైఎస్సార్ కి చెందిన కుటుంబం అంతా ఒక్క చోట చేరి పండుగ సంబరాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తూంటారు. దాని కోసం ఏకంగా మూడు రోజుల పర్యటనను కూడా జగన్ తాజాగా చేపట్టారు. ఇదిలా ఉంటే జగన్ తో పాటు ఇతర కుటుంబ సభ్యులు అంతా కలసి ఉన్న గ్రూప్ ఫోటో ఒకటి బయటకు వచ్చింది. అందులో జగన్ తల్లి విజయమ్మ కూడా ఉన్నారు. ఆశ్చర్యకరంగా షర్మిల కొడుకు జగన్ మేనల్లుడు అయిన రాజారెడ్డి కూడా ఈ ఫోటోలో ఉండడాన్ని అంతా ప్రస్తావిస్తున్నారు.

ఏదో జరుగుతోందా :

వైసీపీలో అంతా ఒక్కటిగా ఉండేవారు. అన్నా చెల్లెలు ఇద్దరూ పార్టీ అధికారంలోకి రావడం కోసం ఎంతో పోరాడారు. 2019లో వైసీపీ అధికారంలోకి రావడం వెనక షర్మిల పాత్ర కూడా ఉందని అంతా అంటారు. అయితే ఆ తరువాతనే విభేదాలు వచ్చాయని అంటున్నారు. దాంతో షర్మిల వేరుగా పార్టీ పెట్టడం ఆ మీదట ఏపీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా కూడా రావడం జరిగింది. ఇక 2024 ఎన్నికల్లో అటు అన్న జగన్ ఇటు చెల్లెలు షర్మిల మధ్యనే ఒక ఆసక్తికరమైన రాజకీయ పోరు సాగింది. జగన్ ఓటమి పాలు అయి మాజీ సీఎం అయ్యారు. కట్ చేస్తే ఇపుడు అన్నా చెల్లెలు కలుస్తారా అన్నది ఊహాగానాలుగా పుకార్లుగా షికారు చేస్తోంది.

అన్నకు గ్రీట్ చేస్తూ :

జగన్ పుట్టిన రోజు వేళ షర్మిల ఆయనకు శుభాకాంక్షలు చెప్పారు. దానికి జగన్ కూడా థాంక్యూ షర్మిలమ్మా అని బదులు ఇచ్చారు. ఇక చూస్తే ఆమె ఇటీవల కాలంలో జగన్ ని పెద్దగా విమర్శించినది లేదు, పైగా పీసీసీ చీఫ్ గా ఆమె దూకుడు ఇదివరకు మాదిరిగా లేదని అంటున్నారు దానికి కారణం దేశంలో కాంగ్రెస్ పరిస్థితి బాగా లేకపోవడం ఏపీలో కూడా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉండడంతో ఆమె రాజకీయం సజావుగా లేదని అంటున్నారు. ఇక జగన్ విషయం తీసుకుంటే వైసీపీ మునుపటి గ్రాఫ్ అందుకోవాలని శ్రమిస్తోంది అయితే సంస్థాగతంగా ఇబ్బందులే కాకుండా కుటుంబ పరంగా ఇబ్బందులు కూడా చక్కదిద్దుకోవాల్సి ఉందని సూచనలూ ఉన్నాయి.

కలిపేందుకు యత్నం :

జగన్ వర్సెస్ షర్మిల ఇష్యూలో ఇద్దరూ రాజకీయంగా దెబ్బ తిన్నారు అని వైఎస్సార్ శ్రేయోభిలాషులు అంటున్నారు. జగన్ మాజీ సీఎం అయ్యారని షర్మిల రాజకీయమూ ఏ విధంగానూ ఎగ్గిగిల్లలేదని గుర్తు చేస్తున్నారు. అలా విడిపోయి ఉంటే రాజకీయంగా ఇద్ద్దరికీ నష్టమని పెద్దలు కొందరు కలసి రాజీ కుదిర్చే ప్రయత్నాలు మొదలెట్టారని ప్రచారం అయితే సాగుతోంది. ఆ క్రమంలోనే షర్మిల కొడుకు జగన్ ఇంట్లో నిర్వహించిన ఫోటో సెషన్ లో కనిపించారు అని అంటున్నారు. అదే విధంగా చూస్తే కనుక రానున్న రోజులలో అన్నా చెల్లెళ్ళను కలిపేందుకు మరిన్ని ప్రయత్నాలు జరుగుతాయని అంటున్నారు. కలసి ఉంటే కలదు సుఖం అన్నది గుర్తెరిగి అంతా ఒక్కటి అయితే 2029లో వైసీపీ అధికారంలోకి వచ్చేందుకు మార్గం సుగమం అవుతుందని వైసీపీలోనూ వినిపిస్తున్న మాటగా ఉంది. మరి చూడాలి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News