ప్రెస్ మీట్ లో అందర్ని కవర్ చేసిన కవిత
తెలంగాణ రాజకీయాల్లో తన ఉనికిని ఎప్పటికప్పుడు చాటుకుంటూ.. తరచూ వార్తల్లో ఉండేలా వ్యవహరిస్తున్న కవిత.. తాను అనుకున్నట్లే చేయగలుగుతున్నారు.;
తెలంగాణ రాజకీయాల్లో తన ఉనికిని ఎప్పటికప్పుడు చాటుకుంటూ.. తరచూ వార్తల్లో ఉండేలా వ్యవహరిస్తున్న కవిత.. తాను అనుకున్నట్లే చేయగలుగుతున్నారు. నిజానికి ఆమె చేసే వ్యాఖ్యలకు సంబంధించి ప్రధాన దినపత్రికల్లో వస్తున్న కవరేజ్ చాలా తక్కువ. టీవీ చానళ్లు.. యూట్యూబ్ చానళ్లతో పాటు.. వెబ్ సైట్లు.. సోషల్ మీడియా.. వాట్సాప్ తో ఆమె తన ఉనికిని కాపాడుకుంటున్న పరిస్థితి. ప్రజలు తన గురించి.. తాను చెప్పిన మాటల్ని మర్చిపోతున్నారన్నంతనే తెర మీదకు రావటం.. ఘాటు వ్యాఖ్యలు చేయటం ద్వారా వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్నారు.
ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి కవిత.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ మొదలు.. బీఆర్ఎస్.. బీజేపీ.. మజ్లిస్ నేతలకు వరకు అందరిని వేలెత్తి చూపుతూ.. ఎవరికి ఎంత అవసరమో అంతలా వడ్డిస్తున్న వైనం ఆసక్తికరంగా మారింది. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి బుధవారం పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో.. ప్రచారానికి ఫుల్ స్టాప్ పడటం తెలిసిందే. ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ.. ‘మున్సిపల్ బూతుల వర్షం ఆగిపోవటం సంతోషంగా ఉంది. మున్సిపల్ ప్రచారం చూసిన తర్వాత పార్టీ గుర్తులు లేకుండా ఎన్నికలు జరిగితే బాగుంటుందనిపించింది. ముఖ్యమంత్రి రేవంత్ సొంత జిల్లాలో మంచినీరు.. పారిశుధ్యం లోపించింది. ఎన్నికల ప్రచారంలో ప్రజల సమస్యల మీద చర్చే లేదు’’ అని పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మంచివాళ్లను ఎన్నుకోవాలన్న వినతిని చేశారు.
తెలంగాణలోని మిగిలిన మున్సిపాలిటీల్లో నిధులు విడుదల కాకున్నా.. సిద్దిపేట మున్సిపాలిటీకి మాత్రం నిధులు మంజూరు కావటాన్ని ప్రస్తావిస్తూ.. ‘హరీశ్ రావు.. సీఎం మధ్య ఏముందో అర్థం చేసుకోవాలి. ప్రభుత్వం సంపదను సృష్టించకుండా ఆస్తుల్ని అమ్ముతోంది. రాబోయే బడ్జెట్ లో అన్ని వర్గాలకు న్యాయం చేయాలి. రుణమాఫీ చర్చకు మేం సిద్ధం. 50 శాతం మందికి రైతులకు రుణమాఫీ చేయలేదు’ అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
జాగృతి తరపున తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు వినతిపత్రాన్ని ఇస్తామని.. లేబర్ కోడ్ కు వ్యతిరేకంగా ఈ నెల పన్నెండున జరిగే బంద్ కు మేం మద్దతు ఇస్తున్నాం. మజ్లిస్ పొద్దుతిరుగుడు పువ్వులా ఎవరు అధికారంలో ఉంటే వారి వెంట ఉంటారు. తెలంగాణ ఉద్యమ సమయంలో రాయలతెలంగాణకు ఓవైసీ బ్రదర్స్ మద్దతు ఇచ్చారు. సీఎం రేవంత్ సంఘ్ పరివార్ మనిషి అన్న ఓవైసీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చారు’ అంటూ మండిపడ్డారు. వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా అందరిని తన విమర్శలతోకవర్ చేసిన కవిత టాలెంట్ ను మాత్రం మెచ్చుకోవాలసిందే.