రుషికొండ ప్యాలెస్ కి మాల్దీవుల తరహా కొత్త హంగులు
అయితే సీఆర్ జెడ్ నిబంధనల ప్రకారం రుషికొండపై ఉన్న తొమ్మిది ఎకరాలకు గానూ ఏడు ఎకరాలలో ఎలాంటి నిర్మాణాలు చేయకూడదని ఉందని వారు గుర్తు చేస్తున్నారు.;
విశాఖ సాగర తీరం వద్ద ఉన్న రుషికొండ ప్యాలెస్ ప్రస్తుతం ఉన్న షేప్ ని మారిస్తేనే తప్ప వినియోగంలోకి తేవడం కష్టం అని మంత్రివర్గ ఉప సంఘం అభిప్రాయపడుతోంది ఎందుకంటే ప్రస్తుతం నిర్మాణం జరిగిన దానిని పూర్తిగా హొటల్స్ వంటి వాటికి లీజుకు ఇవ్వడం కుదరదు అని అంటున్నారు. ప్రస్తుతం ఉన్న రుషికొండ భవనాలు హోటళ్లకు పూర్తి అనుకూలంగా లేవని మంత్రులు పయ్యావుల కేశవ్ కందుల దుర్గేష్ తెలిపారు. అదనంగా మరిన్ని నిర్మాణాలు చేపడతామని అలా అయితేనే లీజుకు తీసుకుంటామని ప్రతిపాదనలు వస్తున్నాయని చెబుతున్నారు.
ఆతిధ్య రంగం కోసమే :
ఇక ఈ భవనాలను ఎంతకాలం ఉంచుకున్నా ప్రభుత్వానికి అదనపు భారంగానే ఉంటుందని అందుకే ఏదో ఒకటి చేసి లీజుకు ఇవ్వాలని నిర్ణయానికి వచ్చామని చెబుతున్నారు. మొత్తంగా చూస్తే కనుక హాస్పిటాలిటీ ఇండస్ట్రీకి ఇవ్వాలని నిర్ణయించామని అంటున్నారు. దాని కోసం ప్యాలెస్ లపై అదనంగా భవంతులు నిర్మిస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వచ్చినట్లు మంత్రులు పేర్కొన్నారు. ప్యాలెస్ వినియోగంపై వచ్చిన పలు ప్రతిపాదనలను చర్చించామని, తాజ్, లీలా ప్యాలెస్, అట్మాస్ కోర్, ఫెమా సంస్థలు ముందుకొచ్చినట్లు వారు చెబుతున్నారు.
అడ్డంకులు ఇవే :
అయితే సీఆర్ జెడ్ నిబంధనల ప్రకారం రుషికొండపై ఉన్న తొమ్మిది ఎకరాలకు గానూ ఏడు ఎకరాలలో ఎలాంటి నిర్మాణాలు చేయకూడదని ఉందని వారు గుర్తు చేస్తున్నారు. అందువల్ల కేవలం మిగిలిన రెండు ఎకరాలు ఎలా వినియోగించాలన్న అంశంపై సుదీర్ఘంగా మంత్రివర్గ ఉప సంఘం సమావేశంలో చర్చించామని చెప్పారు. వయబుల్ మోడ్ లో ముందుకు వెళ్లాలని నిర్ణయించినట్లు చెప్పుకొచ్చారు. బీచ్ ఫ్రంట్ వినియోగంలో ఉండేలా అంతర్జాతీయ ప్రమాణాలను పాటిస్తూ మాల్దీవులు పుదుచ్చేరి తరహా విధానాలను రుషికొండ ప్యాలెస్ విషయంలో పాటిస్తే బాగుంటుందని కూటమి ప్రభుత్వం ఆలోచనగా ఉందని అంటున్నారు.
రెండుగా విభజిస్తూ :
ఇక రుషికొండ ప్యాలెస్ లోని ఒక భాగాన్ని హొటళ్ళ కోసం లీజుకి ఇస్తారు. అలాగే చివరి రెండు బ్లాక్ లు ప్రజలకు ఆర్ట్ గ్యాలరీ సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ కోసం ఇతర అవసరాల కోసం ఉంచేలా నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు. రుషికొండ మీద మొత్తంగా తొమ్మిది ఎకరాలు ఉందని ముందుకొచ్చిన ఇన్వెస్టర్లకు ప్రత్యామ్నాయం చూపించాల్సి ఉందని మంత్రి పయ్యావుల చెప్పారు. అయితే సీఆర్ జెడ్ నిబంధనలను పరిశీలించిన అనంతరం రుషికొండపై కేవలం 60 వేల చదరపు అడుగుల్లో నిర్మణానికి మాత్రమే అనుకూలంగా ఉందని తెలిసిందని అన్నారు. అందువల్ల దాన్ని ఎలా వినియోగించాలనే అంశంపై పలు సంస్థలు ముందుకు వచ్చినప్పటికీ వయబుల్ ప్రాజెక్టుపైనే తాము దృష్టి సారించామని చెప్పారు.
త్వరలోనే తుది నిర్ణయం :
ఇక రుషికొండ ప్యాలెస్ ని సాధ్యమైనంత తొందరలో ప్రజలకు ఉపయోగపడేలా ప్రభుత్వానికి ఆదాయం సమకూరేలా వినియోగించాలని భావిస్తున్నామని పయ్యావుల చెప్పారు. ఈ నేపధ్యంలో ఈ నెల 28న మరోసారి భేటీ కీలక ప్రతిపాదనలతో నివేదికను తయారు చేస్తామని దాన్ని కేబినెట్ లో పెట్టిన తరువాత రుషికొండ విషయంలో ఏమి చేయాలన్నది వెల్లడి అవుతుందని చెప్పారు. మొత్తానికి కొత్త ఏడాది నాటికి రుషికొండ ప్యాలెస్ కి ఒక రూపూ షేపూ వస్తాయని అంటున్నారు.