అక్కడ సైకిల్ జోరందుకుంటోంది...భారీ స్కెచ్ రెడీ

అరకు పార్లమెంట్ నియోజకవర్గంగా మారాక మూడు సార్లు ఎన్నికలు జరిగితే మూడు సార్లూ వైసీపీ గెలిచింది.;

Update: 2025-12-25 03:46 GMT

అరకు పార్లమెంట్ నియోజకవర్గంగా మారాక మూడు సార్లు ఎన్నికలు జరిగితే మూడు సార్లూ వైసీపీ గెలిచింది. ఆ మూడు సార్లూ మహిళలకే టికెట్లు వైసీపీ ఇచ్చింది. 2014లో కొత్తపల్లి గీత గెలిస్తే 2019లో గొడ్డేటి మాధవి అనూహ్యంగా ఎంపీ అయ్యారు. 2024లో గుమ్మా తనూజ రాణి గెలిచారు ఇలా వైసీపీకి అరకు ఎంపీ ఓటర్లు పట్టం కడుతూ వస్తున్నారు. దాంతో హ్యాట్రిక్ విజేతగా వైసీపీ నిలిచింది. ఇక అరకు ఎంపీ సీటు గతంలో పార్వతీపురం పార్లమెంట్ సీటుగా ఉండేది. అప్పుడు కూడా టీడీపీ కేవలం రెండు సార్లు మాత్రమే గెలిచింది. 1998. 1999 లలో గెలిచిన తరువాత ఏజెన్సీలో టీడీపీ ఎంపీ తిరిగి విజేత అయిన చరిత్ర లేదు.

ముందస్తు వ్యూహంగానే :

ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అరకు ఎంపీ సీటుని గెలిచి తీరాలని టీడీపీ గట్టిగా నిర్ణయించుకుంది. అందుకోసం ముందస్తుగానే వ్యూహ రచన చేస్తోంది. అరకు పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలిగా మోజోరు తేజోవతిని ఎంపిక చేశారు. ఆమెని ఈసారి నిలబెట్టి గెలిపించుకోవాలని టీడీపీ చూస్తోంది. గిరిజన మహిళగానే కాకుండా విద్యావంతురాలిగా ప్రభుత్వ ఉద్యోగినిగా ఉన్న మోజోరు తేజోవతికి గిరిజన సమస్యల మీద పూర్తి అవగాహన ఉంది. ఆమె గిరిజన ప్రాంతాలలో పెద్ద ఎత్తున పర్యటిస్తున్నారు. ప్రభుత్వం అమలు చేసే కార్యక్రమాలను వారిని వివరించి మరీ వారి మద్దతుని కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆమె బలమైన గిరిజన వర్గానికి చెందిన వారు కావడం కూడా టీడీపీకి కలసి వస్తుందని భావించే ఈ ఎంపిక చేశారు అని అంటున్నారు.

అసెంబ్లీకి జనసేన :

ఇక అరకు అసెంబ్లీకి జనసేన పోటీ చేయాలని చూస్తోంది అని అంటున్నారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ గతంలో నుంచి ఇప్పటిదాకా అనేక సార్లు పర్యటించి వచ్చారు. ఆయన ఉప ముఖ్యమంత్రిగా కూడా అరకులో రోడ్ల నిర్మాణానికి శ్రద్ధ తీసుకున్నారు. అదే విధంగా ఏజెన్సీ ప్రాంత సమస్యల పట్ల శ్రద్ధ చూపిస్తున్నారు. చంద్రబాబు సైతం ముఖ్యమంత్రి హోదాలో పాడేరులో గత నెలలో సామాజిక పెన్షన్లను పంపిణీ చేయడం ద్వారా అక్కడ గిరిజనంతో మమేకం అయ్యారు. వారికి అనేక పధకాలను టీడీపీ కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందని కూడా చెబుతూ వారి ఆదరణను పొందే ప్రయత్నం చేస్తున్నారు.

వైసీపీ ఉదాశీనత :

వైసీపీలో చూస్తే నిర్లిప్తత అంతటా కనిపిస్తోంది. ప్రతీ సారీ వారినే గెలిపిస్తూ రావడం వల్ల కూడా ధీమా హెచ్చుగా ఉందని అంటున్నారు. ఇక అరకు ఎమ్మెల్యేగా గెలిచిన వైసీపీ నేత మత్స్య లింగం పెద్దగా జనంలోకి రావడంలేదు, పార్టీకి దూరంగా ఉంటున్నట్లుగా ప్రచారం సాగుతోంది. ఎంపీగా తనూజా రాణి కొంతవరకూ తిరుగుతున్నా పూర్తి స్థాయిలో రాజకీయ వ్యూహాలను అమలు చేయాల్సి ఉందని అంటున్నారు. ఏజెన్సీ వైసీపీలో వర్గ పోరు ఉందని అంటున్నారు. గతంలో పాడేరు, అరకు నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేలుగా గెలిచిన వారికి టికెట్లు ఇవ్వలేదు, దాంతో అసంతృప్తి వారిలో ఉంది వైసీపీకి ఈ రోజుకీ ఏజెన్సీలో బలం ఉంది, కానీ సంస్థగతంగా గట్టిగా నిలబడాల్సి ఉంది అని అంటున్నారు, కూటమి టార్గెట్ గా చేసుకుని దూసుకుని వస్తున్న నేపథ్యంలో సరైన యాక్షన్ ప్లాన్ వైసీపీ కూడా రెడీ చేసుకోవాల్సి ఉందని అంటున్నారు.

Tags:    

Similar News