పెద్దాయన సైడ్...వైసీపీలో కళింగ యుద్ధం

తాజాగా క్రిష్ణదాస్ టెక్కలి నియోజకవర్గంలో జరిగిన పార్టీ సమావేశంలో మాట్లాడుతూ 2029 ఎన్నికల్లో శ్రీకాకుళం ఎంపీ సీటు నుంచి బలమైన సమర్ధుడైన యువకుడిని తెచ్చి పోటీ చేయిద్దామని చెప్పారు.;

Update: 2025-12-25 03:00 GMT

అసలే విపక్షంలో ఉన్న పార్టీ. పైగా టీడీపీకి కంచుకోట లాంటి జిల్లాలో ఎంతో బలపడాల్సి ఉంది. అలాంటి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా వైసీపీలో వర్గ పోరు హెచ్చుగా ఉంది. జిల్లా నాయకత్వం అంది పుచ్చుకున్న ధర్మాన క్రిష్ణదాస్ సౌమ్యుడిగా పేరు తెచ్చుకున్నారు. టీడీపీకి కేంద్రంలో మంత్రి రాష్ట్రంలో మంత్రి ఉన్నారు. అన్ని సీట్లూ కూటమి ఎమ్మెల్యేలు గెలుచుకున్నారు. పటిష్టంగా అంతటా ఉన్న వేళ వైసీపీని బలంగా తీర్చిదిద్దాల్సిన దాసన్న ఆ దిశగా ప్రయత్నాలు పెద్దగా చేయలేకపోతున్నారు అన్న విమర్శలు ఒక వైపు ఉన్నాయి. మరో వైపు ఆయన తాజాగా చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇపుడు వైసీపీలో సామాజిక రణాన్ని రగులుస్తున్నాయి.

కాళింగులలో అసంతృప్తి :

తాజాగా క్రిష్ణదాస్ టెక్కలి నియోజకవర్గంలో జరిగిన పార్టీ సమావేశంలో మాట్లాడుతూ 2029 ఎన్నికల్లో శ్రీకాకుళం ఎంపీ సీటు నుంచి బలమైన సమర్ధుడైన యువకుడిని తెచ్చి పోటీ చేయిద్దామని చెప్పారు. అయితే ఈ సీటు నుంచి పోటీ చేయాలని మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం చూస్తున్నారు. ఆయనకే పార్లమెంటరీ పార్టీ ఇంచార్జిగా అధినాయకత్వం బాధ్యతలు అప్పగించింది. అయితే దాసన్న చేసిన ఈ కామెంట్ తో తమ్మినేని వర్గీయులు పూర్తిగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక వైసీపీ నుంచి వేరుపడి ధర్మాన ఫ్యామిలీ మీద నిప్పులు చెరుగుతున్న ఎమ్మెల్సీ కాళింగ సామాజిక వర్గానికి చెందిన దువ్వాడ శ్రీనివాస్ అయితే ఈ ఇష్యూ మీద ఒక వీడియో బైట్ ని రిలీజ్ చేసి మరీ వైసీపీలో కాళింగులను అణగతొక్కుతున్నారు అని దాసన్న మీద విరుచుకుపడ్డారు.

తమ్మినేనికి ఏమి తక్కువ :

తమ్మినేని సీతారాం కి ఏమి తక్కువ అని ఆయనను ఎంపీగా పోటీ చేయవద్దు అని దాసన్న చెబుతున్నారని దువ్వాడ ప్రశ్నించారు. ఒక పద్ధతి ప్రకారం వైసీపీలో కాళింగ నేతల మీద వివక్ష సాగుతోందని ఆయన విమర్శించారు. ఇదిలా ఉంటే దువ్వాడ కాంగ్రెస్ లో ఉన్నపుడు కూడా ఆయన మీద ఆ పార్టీ ద్వారా వేటు వేయించారని ఆ తరువాత కాళింగ సామాజిక వర్గానికి చెందిన కిల్లి కృపారాణికి టెక్కలి ఎమ్మెల్యే సీటు కానీ ఎంపీ సీటు కానీ దక్కకుండా ధర్మాన ఫ్యామిలీ చేసింది అని కాళింగ సామాజిక వర్గం నేతలు గుస్సా అవుతున్నారు. ఇక దువ్వాడ అయితే కింజరాపు ఫ్యామిలీతో ధర్మాన ఫ్యామిలీ అవగాహనతోనే ఈ విధంగా కాళింగులను దూరం పెడుతోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దాంతో వైసీపీలో కాళింగ సామాజిక వర్గం నేతలు మండిపోతున్నారు.

వివరణ ఇచ్చినా :

ఇక చూస్తే తాను తమ్మినేనిని తక్కువ చేయాలని ఉద్దేశ్యంతో అనాలేదని దాసన్న వివరణ ఇచ్చుకున్నారు. జిల్లాలో మొత్తం సీట్లు గెలవాలని అన్న ఉద్దేశ్యంతో చెప్పాను అన్నారు. తమ్మినేనికి రాజ్యసభ ఎమ్మెల్సీ వంటి పదవులు ఇవ్వాలన్న ఆలోచనతో మాట్లాడాను అని ఆయన చెప్పుకొచ్చారు. అయితే ఆయన ఏమి చెప్పినా దువ్వాడ శ్రీనివాస్ ఆరోపణలు ఒక వైపు ఆ సామాజిక వర్గంలో తీవ్రంగా ఆలోచింప చేస్తున్నాయని అంటున్నారు. గతంలో కాళింగ సామాజిక వర్గానికి చెందిన బొడ్డేపల్లి రాజగోపాల్ ని కూడా ఇబ్బంది పెట్టారని దువ్వాడ ఆరోపిస్తున్నారు. మొత్తానికి వైసీపీ పరిస్థితి రాజకీయంగా బాగులేదు, గ్రాఫ్ పెరగాల్సి ఉంది. పార్టీని పటిష్టం చేసుకోకుండా మూడున్నరేళ్ళలో జరిగే ఎన్నికల గురించి ఇప్పటి నుంచి ఎందుకు చర్చలు ప్రకటనలు అని అంటున్నారు. అయినా ఎవరికీ ఎక్కడ టికెట్ ఇవ్వాలో జగన్ నిర్ణయిస్తారు కానీ మధ్యలో జిల్లా నేతలు చెప్పడమేంటి అని అంటున్నారు. ఇక చూస్తే జిల్లాలో లక్షలలో కాళింగ సామాజిక వర్గం ఉంది. నాలుగైదు నియోజకవర్గాలను ప్రభావితం చేసే స్థితిలో వారు ఉన్నారు. ఈ నేపధ్యంలో వారిని దూరం చేసుకోకుండా వైసీపీ ఏమి చేస్తుంది అన్నది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News