విశాఖకు మెట్రో కూత...46 కిలోమీటర్ల పొడవుతో మెట్రో రైల్ ప్రాజెక్ట్!

ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన నేపధ్యంలో ఏపీకి సంబంధించిన పలు కీలక ప్రాజెక్టులకు కదలిక వస్తోంది.;

Update: 2026-02-11 04:02 GMT

ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన నేపధ్యంలో ఏపీకి సంబంధించిన పలు కీలక ప్రాజెక్టులకు కదలిక వస్తోంది. బాబు ఒక్క రోజు పర్యటనలో మొత్తం కేంద్ర కేబినెట్ మంత్రులలో కీలకమైన వారందరితో భేటీలు వేశారు. ఏపీకి సంబంధించిన పలు ప్రాజెక్టుల విషయంలో కేంద్రం చొరవ చూపాలని కోరారు. అదే విధంగా ఏపీకి దండీగా నిధుల సాయం చేయాలని కూడా వినతి చేశారు. మొత్తానికి చూస్తే చంద్రబాబు ఢిల్లీ టూర్ లో ఎన్నో మంచి వార్తలనే ఏపీకి తెస్తున్నారు అని అంటున్నారు.

విశాఖకు మెట్రో కూత :

గత పుష్కర కాలంగా విశాఖకు మెట్రో రైలు అన్న వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే అవి కార్యరూపం దాల్చడం మాత్రం లేదు. అయితే ఇపుడు కలిసి వచ్చే వాతావరణం కళ్ళ ముందు ఉంది. భోగాపురం ఎయిర్ పోర్టు ఆపరేషన్స్ తొందరలో మొదలు కావడంతో విశాఖ సహా ఉత్తరాంధ్ర జిల్లాలలో హెవీ ట్రాఫిక్ ఏర్పడనుంది. ఈ పరిస్థితుల్లో మెట్రో రైలు ప్రాజెక్ట్ అన్నది కచ్చితంగా ఉండాల్సిందే అన్న భావన అయితే ఉంది. దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం డీపీఆర్ ని సిద్ధం చేసి కేంద్రానికి పంపించింది. ఇప్పుడు బాబు పర్యటనలో దానికి కేంద్రం అంగీకరించినట్లుగా శుభవార్త అయితే తెలిసింది.

మూడు కారిడార్లతో :

ఏపీలోని అతి పెద్ద నగరంగా ఉన్న విశాఖలో మెట్రో రైలు ప్రాజెక్టు కి కేంద్రం పచ్చ జెండా ఊపింది. మూడూ కారిడార్లతో దాదాపుగా 46 కిలోమీటర్ల పొడవుతో మెట్రో రైల్ ప్రాజెక్ట్ కి కేంద్ర రైల్వే శాఖ అంగీకారం తెలిపీంది అని చెబుతున్నారు. ఏకంగా 11 వేల అయిదు వందల కోట్ల రూపాయలతో ఈ మెట్రో రైలు ప్రాజెక్ట్ పనులు మొదలవుతాయని అంటున్నారు. ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి మధురవాడ వద్ద ఉన్న కొమ్మాది దాకా ఒక కారిడార్ ఉంటుంది. ఇది దాదాపుగా 35 కిలోమీటర్ల దూరంతో సాగుతుంది.

అలాగే మరో కారిడార్ గా నగరంలోని గురుద్వారా జంక్షన్ నుంచి పాత పోస్ట్ ఆఫీస్ దాకా ఉన్న ఆరు కిలోమీటర్ల పరిధిలో మెట్రో రైలు సాగుతుంది. ఇక్కడే విశాఖ ట్రాఫిక్ మొత్తం కదులుతుంది కాబట్టి ఇది కీలకంగా భావిస్తున్నారు. ఇక మూడో కారిడార్ పూర్తిగా టూరిజాన్ని దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేశారు. ఇది నగరంలోని తాటిచెట్లపాలెం నుంచి రామకృష్ణ బీచ్ దాకా సాగుతుంది. అంటే నగరంలోని జనాలు నేరుగా టూరిజం స్పాట్ కి చేరుకునేలా ఈ కారిడార్ ఉంటుంది అన్న మాట. ఇలా మెట్రో రైల్ ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించేనెదుకు కేంద్రం అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది అని చెబుతున్నారు.

ఏపీ ప్రాజెక్టుల కోసం :

ఇక ఏపీ ప్రాజెక్టులు అంటే అమరావతి పోలవరం అన్నది తెలిసిందే. అమరావతి రాజధానికి చట్టబద్దత కల్పించండని ముఖ్యమంత్రి ఈ పర్యటనలో కేంద్రాన్ని కోరారు. అలాగే పోలవరం రెండవ దశ నిధులు విడుదల చేయాలని ఆయన కోరారు. దేశంలో కీలకమైనది రవాణా రంగం కాబట్టి ఉత్తర దక్షిణ భారత్ లను కలుపుతూ ఫ్రైట్ కారిడార్లు నిర్మించాలని చంద్రబాబు కేంద్రానికి మరో కీలక వినతి చేశారు. అలాగే ఏపీలో మఖానా డెవలప్మెంట్ బోర్డు ఏర్పాటు చేయాలని, పూర్వోదయ సహా కేంద్ర ప్రాయోజిత పథకాలకు నిధులను పెద్ద ఎత్తున విడుదల చేయాలని కూడా బాబు కోరారు. ఇక బాబు హోంమంత్రి అమిత్ షా సహా ఏడుగురు కేంద్ర మంత్రులతో వరుస భేటీలని నిర్వహించారు.

Tags:    

Similar News