బంగ్లా బలుపు... పాక్ కవ్వింపు... ముహూర్తం పెట్టాల్సిందే !

భారత్ సృష్టించిన దేశం బంగ్లాదేశ్. వయసు అయిదున్నర దశాబ్దాలు. ఆర్ధికంగా కూడా భారత్ ఆదుకోకపోతే ఈ రోజు ఈ పరిస్థితి లేదు.;

Update: 2025-12-25 03:52 GMT

భారత్ సృష్టించిన దేశం బంగ్లాదేశ్. వయసు అయిదున్నర దశాబ్దాలు. ఆర్ధికంగా కూడా భారత్ ఆదుకోకపోతే ఈ రోజు ఈ పరిస్థితి లేదు. ఎంత చూసినా చిన్న దేశం, అన్ని విధాలుగా అండ అవసరం కావాల్సిన దేశం. అలాంటి బంగ్లాదేశ్ భారత్ ని రెచ్చగొడుతోంది. భారత్ వంటి పెద్ద దేశం మీద కవ్వింపు చర్యలకు దిగుతోంది. మొత్తం బంగ్లాదేశ్ కధ అంతా భారత్ చుట్టూ తిరుగుతూనే సాగింది.

బెంగాల్ లో సగం :

ఇక భారత్ లోని పశ్చిమ బెంగాల్ లో సగమైన బంగ్లాదేశ్ భారతదేశ సరిహద్దుల్లోని దేశంగా ఉంది. దీనికి దక్షిణాన బంగాళాఖాతం, ఉత్తర, తూర్పు, పడమరల్లో భారతదేశం, ఆగ్నేయాన బర్మా సరిహద్దులుగా ఉన్నాయి. హిమాలయ దేశాలైన నేపాల్, భూటాన్ లను భారతదేశ సిలిగురి కారిడార్ వేరు చేస్తుంది. ఇక్కడ కీలమైన పాయింట్ ఏంటి అంటే ప్రాదేశికంగా చైనాకు దగ్గరగా బంగ్లాదేశ్ ఉండడం. అదే ఇపుడు భారత్ మీద ఈ చిన్న దేశం రెచ్చిపోవడానికి కారణంగా కూడా దౌత్య నిపుణులు చెబుతూంటారు.

భారత్ తోనే దోస్తీ :

ఇదిలా ఉంటే బంగ్లాదేశ్ పొరుగున ఉన్న భారతదేశంతో అత్యధికంగా అత్యంత సన్నిహిత సంబంధాలను కలిగి ఉన్న దేశంగా నిన్నటిదాకా ఉంది. బంగ్లాదేశ్ భారతదేశ సంబంధాలు చారిత్రక పరమైనవి, అలాగే సాంస్కృతిక నేపథ్యం కలిగి ఉన్నవని చెప్పాల్సి ఉంది. ఇక 1971 స్వాతంత్ర్య సమరంలో బంగ్లాదేశ్‌కు భారత్ అందించిన సహాయం ఇరుదేశాల సంబంధాలను మరింతగా పటిష్టం చేసింది. భారత్‌తో వ్యాపార సంబంధాలలో బంగ్లాదేశ్ అయిదవ స్థానంలో ఉంది. ఇటీవలి కాలంలో తీవ్రవాదంతో పోరాడడానికి రెండు దేశాలు కలిసికట్టుగా కృషి చేశాయి. కానీ ఇపుడు బంగ్లాదేశ్ భారత్ మీదనే తన ప్రతాపం చూపిస్తోంది.

పాక్ రంగంలోకి :

ఇక ఇదే అదనుగా పాకిస్తాన్ బంగ్లాదేశ్ తో దోస్తీ చేస్తోంది. భారత్ మీద ఉసిగొలపడానికి చూస్తోంది. సౌదీ అరేబియా తరహాలో సైనిక ఒప్పందానికి పాక్ ప్రయత్నిస్తోంది. బంగ్లాదేశ్ లో కూడా మెజారిటీ వర్గం పాకిస్థాన్ తో చేయి కలపాలని కోరుతోంది. తాజాగా చూస్తే పాకిస్తాన్ జనరల్ ఆసిం మాలిక్ తరచూ బంగ్లాదేశ్ లో పర్యటిస్తున్నారు. ఆ దేశంతో మచ్చిక చేసుకుని భారత్ మీదకు పరోక్షంగా రావాలని చూస్తున్నారు. ఆయన ఒక్కరే కాదు కీలకమైన పాక్ సైనిక అధికారులు గూఢచారి సంస్థ ఐఎస్ఐ అధికారులు కూడా బంగ్లాదేశ్ లో పర్యటిస్తున్నారు.

రక్షణ ఒప్పందం కోసం :

ఈ ఏడాది సెప్టెంబర్ లో సౌదీ అరేబియాతో పాకిస్తాన్ రక్షణ ఒప్పదం చేసుకుంది. దాని ప్రకారం ఒక దేశం మీద ఎవరైనా దాడి చేస్తే రెండు దేశాల మీద దాడిగా చూసి యుద్ధానికి ఆ రెండు దేశాలు దిగుతాయన్న మాట. ఇపుడు అలాంటి ఒప్పందం బంగ్లాదేశ్ తో చేసుకోవాలని పాక్ చూస్తోంది. అదే జరిగితే బంగ్లాదేశ్ మీద భారత్ రేపు ఏ రూపేణా దాడి చేసినా సీన్ లోకి రావాలని పాక్ చూస్తోంది అన్న మాట. ఈ మేరకు ప్రతిపాదన దశలో ఒప్పందం ఉందని తొందరలో కుదురుతుందని అంటున్నారు. అదే జరిగితే మాత్రం భారత్ కి ఇబ్బందిగా ఉండొచ్చు అన్నది అంతర్జాతీయ నిపుణుల మాటగా ఉంది.

పాక్ హెచ్చరికలు :

ఇప్పటికే పాక్ లోని అధికార పార్టీ ముస్లిం లీగ్ కి చెందిన కీలక నాయకుడు కమ్రాన్ సయ్యీద్ ఉస్మానీ భారత్ ని హెచ్చరిస్తూ ప్రకటన విడుదల చేయడం విశేషం. బంగ్లాదేశ్ మీద భారత్ దాడి చేస్తే పాక్ భారత్ మీద దాడి చేస్తుందని ఆయన చెప్పడం బట్టి చూస్తూంటే రెండు దేశాల మధ్య సయోధ్య ఏ దశలో ఉందో అర్ధం అవుతోంది అంటున్నారు. ఈ నేపథ్యంలో భారత్ ఆచీ తూచీ అడుగులు వేయాల్సి ఉందని అంటున్నారు. ఇక ఏదైనా అనూహ్యమైన పరిణమాలు ప్రాంతీయంగా తలెత్తితే భారత్ టూ ఫ్రంట్ వార్ చేయాల్సి వస్తుందని అంటున్నారు. అయితే మొత్తం పరిణామాలను భారత్ నిశితంగా పరిశీలిస్తోంది. మరో వైపు ఆపరేషన్ సింధూర్ టూ చేయాలని బీజేపీ అసోం ముఖ్యమంత్రి బిశ్వాంత్ శర్మ కోరుతున్నారు. మొత్తానికి బంగ్లా బరితెగింపు పాక్ కుయుక్తుల మధ్య భారత్ కీలక అడుగులు వేస్తుందని అంటున్నారు.

Tags:    

Similar News