ఆయనకు మంత్రి పదవి హామీని ఇచ్చిన వైఎస్ జగన్!

Update: 2019-03-24 18:06 GMT
ఎన్నికల ప్రచార సభల్లోనే నేతలకు మంత్రి పదవుల హామీలను కూడా ఇస్తున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి. గుంటూరు జిల్లా చిలకలూరి పేటలో ఉత్సాహవంతంగా జరిగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార సభలో జగన్ స్థానిక నేతకు మంత్రి పదవి హామీని ఇచ్చారు. గత ఐదేళ్ల నుంచి చిలకలూరి పేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జిగా ఉండిన మర్రి రాజశేఖర్ కు జగన్ మంత్రి పదవి హామీని ఇచ్చారు.

తను కోరగానే చిలకలూరి పేట టికెట్ ను త్యాగం చేయడానికి సమ్మతించినందుకు గానూ.. మర్రి రాజశేఖర్ కు జగన్ ఆ బంపర్ ఆఫర్  ప్రకటించారు. గత ఎన్నికల్లో మర్రి రాజశేఖర్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కూడా ఆయనే ఇన్ చార్జిగా కొనసాగారు. అయితే ఇటీవలే విడదల రజనీ ఇక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆమెకు వెనువెంటనే జగన్ చిలకలూరి పేట టికెట్ ను ఖరారు చేశారు.

ఈ నేఫథ్యంలో మర్రి రాజశేఖర్ అలక వహించి ఉంటారనే మాట వినిపించింది. అప్పటి నుంచి ఆయన స్తబ్ధుగా ఉండిపోయారు కూడా. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచార సభలో జగన్ ఈ హామీని ఇచ్చారు. ప్రభుత్వం రాగానే మర్రి రాజశేఖర్ ను మంత్రిగా చేయడం ఖాయమని జగన్ ప్రకటించారు. ఈ ప్రకటనతో మర్రి అనుచరులు హర్షధ్వానాలు చేశారు.

ఈ ప్రకటనతో చిలకలూరి పేటలో అసంతృప్తిని జగన్ కూల్ చేసేసినట్టే అని చెప్పవచ్చు. ఎన్నికల్లో పోటీ చేయాల్సిన అవసరం లేకుండా.. మర్రి రాజశేఖర్ కు జగన్ ఈ అవకాశం ఇస్తున్నట్టుగా ప్రకటించారు. ఇన్ని రోజులూ పార్టీ తరఫున పని చేస్తున్నందుకు రాజశేఖర్ కు ఇది మంచి అవకాశమే అని చెప్పవచ్చు. ఇక జగన్ పార్టీ  అధికారంలోకి వస్తుందేమో చూడాల్సి ఉంది.
Tags:    

Similar News