టీడీపీ నేత కొడుక్కి జాబ్ ఇచ్చిన జగన్ సర్కార్

Update: 2019-09-17 11:25 GMT
అన్ని విషయాల్లో రాజకీయాల్ని పట్టించుకోనన్న విషయాన్ని మరోసారి రుజువు చేశారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఒక టీడీపీ నేత కుమారుడికి సర్కారీ ఉద్యోగానికి ఓకే చేస్తూ ఏపీ సీఎం నిర్ణయం తీసుకోవటం ఆసక్తికరంగా మారింది. టీడీపీ దివంగత ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు ను ఆ మధ్యన మావోయిస్ట్ లు హతమార్చటం తెలిసిందే.

2014లో జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కిడారి అరకు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం 2016 ఏప్రిల్లో ఆయన టీడీపీలోకి వెళ్లారు. అయితే 2018 సెప్టెంబరులో ఆయన్ను మావోలు కాల్చి చంపారు. ఈ నేపథ్యంలో కిడారి పెద్ద కొడుకు శ్రావణ్ కుమార్ కు నాటి ఏపీ ప్రభుత్వం మంత్రి పదవి ఇస్తూ నిర్ణయం తీసుకుంది. చిన్న కొడుక్కి గ్రూప్ 1 ఉద్యోగాన్ని ఇవ్వాలని నాటి సీఎం చంద్రబాబు నిర్ణయించారు.

ఇదిలా ఉంటే.. తాజాగా కిడారి చిన్న కొడుకు సందీప్ కుమార్ కోసం సూపర్ న్యూమరీ పోస్టును ఏర్పాటు చేశారు. ఆయన కోసం పే స్కేల్ విషయంలోనూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన పేస్కేల్ ను రూ.40,270- రూ.93,780గా నిర్ణయించారు. 2019 జనవరి 31న డిప్యూటీ కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన సంతీప్ ఆ తర్వాత 72 వారాల ట్రైనింగ్ కోసం విజయనగరం జిల్లా ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్ గా పని చేశారు.

తాజాగా శిక్షణ పూర్తి చేసుకోవటంతో పోస్టింగ్ కోసం సూపర్ న్యూమరీ పోస్టును ఏర్పాటు చేసి.. పే స్కేల్ కు సంబంధించిన నిర్ణయాన్ని తీసుకున్నారు. ప్రభుత్వ నిర్ణయం నేపథ్యంలో డిప్యూటీ కలెక్టర్ గా సాధారణ విధుల్లో చేరే వరకూ సూపర్ న్యూమరీ పోస్టు కింద పని చేయనున్నారు. రాజకీయ ప్రత్యర్థులైనప్పటికీ.. గత ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు చేయటం.. వారి పట్ల కక్ష సాధింపు చర్యల్ని తీసుకోకపోవటం ద్వారా జగన్ తానో పరిణితి చెందిన రాజకీయ నేతగా నిరూపించుకున్నారని చెప్పకతప్పదు.


Tags:    

Similar News