అభ్యర్థుల ప్ర‌క‌ట‌న‌కు డేట్ ఫిక్స్ చేసిన జ‌గ‌న్‌

Update: 2019-01-29 07:55 GMT
ఎన్నిక‌ల వేడి ఏపీని చుట్టేస్తుంది. ఫిబ్ర‌వ‌రి రెండు.. మూడు వారాల్లో ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ విడుద‌ల అవుతుంద‌న్న అంచ‌నాల నేప‌థ్యంలో ఏ పార్టీకి ఆ పార్టీ ఎన్నిక‌లకు సంబంధించిన ప‌నుల్లో త‌ల‌మున‌క‌ల‌వుతోంది. ఇదిలా ఉంటే.. ఏపీ విప‌క్ష నేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి త‌న గెలుపు గుర్రాలను ఇప్ప‌టికే ఎంపిక చేసుకున్న‌ట్లు చెబుతున్నారు.

ఎన్నిక‌ల ప్ర‌క‌ట‌న‌కు ముందుగా ప్ర‌తి జిల్లాలోనూ స‌భ‌ను నిర్వ‌హించాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్న ఆయ‌న‌.. అందుకు నాందిగా ఫిబ్ర‌వ‌రి 6న స‌మ‌ర శంఖారావం పేరుతో స‌భ‌ల్ని నిర్వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. తొలి స‌భ తిరుప‌తిలో త‌ర్వాతి స‌భ క‌డ‌ప‌లోనూ.. త‌ర్వాత అనంత‌పురంలో నిర్వ‌హిస్తార‌ని చెబుతున్నారు. ఫిబ్ర‌వ‌రి ఆరున జ‌రిగే తిరుప‌తి స‌భ‌లో చిత్తూరు జిల్లా నుంచి పోటీ చేసే అభ్య‌ర్థుల ప్ర‌క‌ట‌న ఉంటుంద‌ని తెలుస్తోంది.

ఏ జిల్లాకు ఆ జిల్లాలో నిర్వ‌హించే స‌మ‌ర శంఖారావం స‌భ‌లో ఆయా జిల్లాల నుంచి పోటీ చేసే అభ్య‌ర్థుల జాబితాను ప్ర‌క‌టించే వీలుంద‌ని చెబుతున్నారు. ఏదైనా సీటు విష‌యంలో ఇబ్బందిక‌ర ప‌రిస్థితి ఉంటే.. అలాంటి వాటిని విడిచి పెట్టి.. మిగిలిన అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఏపీ వ్యాప్తంగా మొత్తం 13 స‌భ‌లు నిర్వ‌హించ‌నున్నారు. ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ విడుద‌ల‌య్యే నాటికి ఈ స‌భ‌లు దాదాపుగా పూర్తి అవుతాయ‌ని భావిస్తున్నారు. అభ్య‌ర్థుల ప్ర‌క‌ట‌న‌లో ఏపీ రాజ‌కీయాలు మ‌రింత హాట్ హాట్ గా మార‌తాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.


Tags:    

Similar News