30 ఏళ్లు.. ముగ్గురు నేతలు.. తెలంగాణకు ఎవరు ఏం చేశారు?
ఈ సందర్బంగానే ఉమ్మడి రాష్ట్రం, ఆ తర్వాత తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో ముగ్గురు నేతలు అధికారం చెలాయించడాన్ని ప్రస్తావిస్తున్నారు.;
తెలంగాణ ఏర్పాటైన 11 ఏళ్ల తర్వాత ఏపీ సీఎం చంద్రబాబుపై మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు చేయడం రాజకీయంగా ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. తెలంగాణ ఏర్పాటుకు పదేళ్ల ముందే అధికారం కోల్పోయిన చంద్రబాబును ఇప్పటికీ కేసీఆర్ విమర్శించడం, తెలంగాణ వెనుకబాటుకు చంద్రబాబే కారణమన్నట్లు చూపడంపై పలు అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై చంద్రబాబు పార్టీకి అనుకూలంగా ఉన్న యూట్యూబర్లు, రాజకీయ విశ్లేషకులు సైతం ప్రత్యేక వీడియోలు చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తొమ్మిదేళ్ల పాటు సీఎంగా పనిచేసిన చంద్రబాబును నిందిస్తున్న కేసీఆర్ తన పాలన కాలంలో పదేళ్ల పాటు ఏం చేశారని ప్రశ్నిస్తున్నారు.
ఈ సందర్బంగానే ఉమ్మడి రాష్ట్రం, ఆ తర్వాత తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో ముగ్గురు నేతలు అధికారం చెలాయించడాన్ని ప్రస్తావిస్తున్నారు. 1996 నుంచి 2004 వరకు అధికారంలో ఉన్న చంద్రబాబు తెలంగాణ ప్రాంతానికి ఏం చేశారు? ఆయన తర్వాత ముఖ్యమంత్రిగా వచ్చిన కాంగ్రెస్ నేత వైఎస్ రాజశేఖరరెడ్డి, ఇతర కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఎలాంటి అభివృద్ది చేశారు? విభజన తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్ పాలన ఎలా సాగిందన్న చర్చ ఎక్కువగా నడిపిస్తున్నారు. గత 20 ఏళ్లలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలనలోనే తెలంగాణ ఉందని, చంద్రబాబు హయాంలో అన్యాయం జరిగితే ఈ రెండు పార్టీలు ఎందుకు సరిదిద్దలేకపోయాయని నిలదీస్తున్నారు.
పదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్.. పాలమూరు జిల్లాకు ఏం చేయలేదని చెబుతుండటమే కాకుండా, స్వయంగా మహబూబ్ నగర్ ఎంపీగా పనిచేసిన కేసీఆర్ ఒక్క రోజు కూడా ఆ ప్రాంత సమస్యలపై పార్లమెంటులో మాట్లాడలేదని అంటున్నారు. అదేవిధంగా పదేళ్లు సీఎంగా ఉన్నప్పుడు ఉమ్మడి పాలమూరు తలరాత ఎందుకు మార్చలేకపోయారని ప్రశ్నిస్తున్నారు. ఇదే ప్రశ్నను పదేళ్లు పాలించిన కాంగ్రెస్ కు వేయకపోవడంపైనా టీడీపీ అనుకూల సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాను ఏం చేయలేక.. 20 ఏళ్ల క్రితమే తెలంగాణ రాజకీయాల నుంచి దూరంగా జరిగిపోయిన ఏపీ సీఎం చంద్రబాబుపై విమర్శలు చేస్తారా? అంటూ కన్నెర్ర చేస్తున్నారు.
సుమారు రెండేళ్ల తర్వాత రాజకీయంగా యాక్టివ్ అయిన కేసీఆర్.. వ్యూహాత్మకంగా చంద్రబాబును టార్గెట్ చేసినట్లు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే కేసీఆర్ వ్యూహాలు పనిచేస్తాయా? లేదా? అన్నది ఇప్పుడిప్పుడే చెప్పలేం అంటున్నారు. ఇదే సమయంలో కేసీఆర్ పాత చింతకాయ పచ్చడి కబుర్లు చెబుతున్నారని మరికొందరు విమర్శిస్తున్నారు. చంద్రబాబు పాలన ముగిసి తెలంగాణలో 20 ఏళ్లు అవుతున్నా.. కేసీఆర్ ఆ విషయన్ని విస్మరించి, తన పాలనను గుర్తుచేయకుండా చంద్రబాబు హయాంలోని నిర్లక్ష్యాన్నే ఎత్తిచూపడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని అంటున్నారు. కేసీఆర్ ఇలా మాట్లాడటం వల్ల చంద్రబాబు, వైఎస్, కేసీఆర్ హయాంలో జరిగిన పనులు అన్నీ చర్చకు వచ్చే అవకాశం ఉందని వ్యాఖ్యానిస్తున్నారు.