ఇష్టానుసారం టికెట్ ధరలు పెరగనీయం: మంత్రి కందుల
అయితే థియేటర్లకు రాని జనాన్ని ఏదో ఒక తరుణోపాయంతో రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయా? అంటే అది శూన్యం.;
ఓవైపు సినిమా థియేటర్లలో తిండి, కోలాల ధరలపై ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. మరోవైపు టికెట్ ధరల్ని ఇష్టానుసారం పెంచుకునే పద్ధతిని ప్రజలు చాలా కాలంగా తిడుతూనే ఉన్నారు. క్లాస్ ఆడియెన్ చాలా వరకూ థియేటర్లకు రావడం మానుకున్నారు. సామాన్య మధ్యతరగతికి వినోదం చివరి ఆప్షన్ గనుక, గ్యారెంటీగా థియేటర్లకు వస్తారని చెప్పలేని పరిస్థితి. దీంతో భారతదేశంలోని 150కోట్ల మంది ప్రజల్లో కేవలం 20శాతం జనం కూడా థియేటర్లకు రాని పరిస్థితి.
అయితే థియేటర్లకు రాని జనాన్ని ఏదో ఒక తరుణోపాయంతో రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయా? అంటే అది శూన్యం. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ప్రకటన అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇకపై ఎగ్జిబిటర్లు ఇష్టానుసారం సినిమా టికెట్ ధరలు పెంచకుండా ప్రభుత్వమే ముకుతాడు వేస్తుందని ఆయన అన్నారు. ఏడాది పొడవునా స్థిరంగా ఒకే ధర ఉండేలా నియంత్రించడానికి సమగ్ర విధానాన్ని ప్రవేశ పెడతామని అన్నారు. దీనివల్ల కొత్త సినిమా విడుదలైనప్పుడల్లా టికెట్ ధరలు పెంచుకునే విధానానికి స్వస్తి పలుకుతామని కూడా వ్యాఖ్యానించారు. ప్రతిసారీ టికెట్ ధరలు ఇష్టానుసారం పెంచినప్పుడు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇది నిర్మాతలకు కూడా అనుకూలంగా లేదు. థియేటర్లకు రావాల్సిన జనం తగ్గిపోతున్నారు. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు కృషి చేస్తామని కందుల అన్నారు. అటు సినీపరిశ్రమకు, ఇటు ప్రేక్షకులకు మధ్యే మార్గంగా ఇరువైపులా న్యాయంగా ధర్మంగా ఉండేలా టికెట్ ధరలను నిర్ణయించడానికి చర్చలు జరుగుతున్నాయని అన్నారు.
సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఏపీలో నిర్వహించిన సమావేశానికి సినీ ప్రముఖులు, సీనియర్ ప్రభుత్వ అధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో కందుల మాట్లాడుతూ.. ప్రతిసారీ ఇష్టానుసారం టికెట్ ధరలు పెంచుకునే విధానానికి స్వస్థి చెప్పాలని కోరారు. టికెట్ ధరలు ఇలా పెంచేయడం వల్ల జనాలకు బొప్పి కడుతోందని, కనీసం పాప్ కార్న్ కూడా కొనుక్కోలేని ధైన్యంలో ఉన్నారని ఈ సమావేశంలో అభిప్రాయం వ్యక్తమైంది. టికెట్ల ధరలను పదే పదే పెంచడం అనవసరమైన సమస్యలను సృష్టిస్తోందని దుర్గేష్ పేర్కొన్నారు. ధరల విషయంలో ఏకరీతి విధానాన్ని అమలు చేయడానికి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
సినిమా థియేటర్లలో సమోసాలు, పాప్ కార్న్, ఇతర చిరుతిళ్లు మొదలు కోక్ లు తాగడం వరకూ, పార్కింగ్ ల నుంచి టికెట్ కొనుగోళ్ల వరకూ ప్రతిదీ జేబులు గుల్ల చేసే వ్యవహారంగా కనిపిస్తోందని మెజారిటీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అయితే నేటి ఒడిదుడుకుల ప్రపంచంలో ఎగ్జిబిషన్ రంగం నిలబడాలంటే ధరలు పెంచాల్సిందేనని వారంతా ఏకాభిప్రాయంతో ఉన్నారు. ఎండ్ లెస్ గా ఉన్న ఈ సమస్యకు కందుల పరిష్కారం ఎలా ఇస్తారో వేచి చూడాలి.