ఆ పని చేయకుంటే అమిత్ షా చెవులు మెలేయొచ్చట

Update: 2020-01-27 10:07 GMT
బరిలోకి దిగిన వెంటనే గెలుపు దక్కితే మజా ఏముంటుంది? ఎంతగా ప్రయత్నించినా.. ఎన్నిసార్లు బరిలోకి దిగినా విజయం అందని చోట గెలుపు కోసం చేసే కసరత్తు అంతా ఇంతా కాదు. దేశంలో ఏ రాష్ట్రమైనా కానీ టార్గెట్ చేస్తే చాలు.. తమ వశం చేసుకోవటం మోడీషాలకు అలవాటు. అయితే.. వారికి ఒక పట్టాన కొరుకుడుపడని రాష్ట్రాలు కొన్ని ఉన్నాయి. అందులో ఒకటి ఢిల్లీ రాష్ట్రం. ఢిల్లీ సింహాసనం తమ అధీనంలోనే ఉన్నా.. ఢిల్లీ రాష్ట్ర పగ్గాలు మాత్రం వేరే పార్టీ చేతిలో ఉండటాన్ని మోడీషాలు జీర్ణించుకోలేకపోతున్నారు.

ప్రస్తుతం ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఓపక్క పౌరసత్వ సవరణ చట్టం మీద ఆగ్రహం వ్యక్తమవుతున్న వేళ.. ఢిల్లీ రాష్ట్ర పీఠాన్ని కానీ తాము కైవశం చేసుకుంటే తమకు తిరుగు ఉండకపోవటమే కాదు.. తమ మీద విరుచుకుపడుతున్న నోళ్లు మూతపడే వీలుందని భావిస్తోంది బీజేపీ. అందుకే.. ఢిల్లీ పీఠాన్ని సొంతం చేసుకోవటం కిందా మీదా పడటమే కాదు.. ఊహించని రీతిలో హామీల్ని ఇస్తున్నారు.

తాజాగా కేంద్ర హోం మంత్రి.. పార్టీలో పెద్ద తలకాయి.. మోడీకి కళ్లు.. చెవులుగా ఉండే అమిత్ షా స్వయంగా ప్రచారం చేస్తున్నారు. ఈసారికి ఢిల్లీ పగ్గాలు తమకే ఇవ్వాలని ఆయన అడుగుతున్నారు. తమకు అవకాశం ఇస్తే ఢిల్లీని ప్రపంచ స్థాయి నగరంగా చేస్తామని.. ఒకవేళ చేయకపోతే తన చెవులు మెలి పెట్టి మరీ అడగొచ్చన్న బంపర్ ఆఫర్ ను ఢిల్లీ ప్రజలకు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి పదిహేనేళ్లు అధికారంలో ఉండే అవకాశం ఇచ్చారని.. ఆప్ కు ఐదేళ్లు ఛాన్స్ ఇచ్చారని.. తమకు కూడా అవకాశం ఇస్తారని తాము ఆశిస్తున్నట్లు చెప్పారు.

తమ చేతికి ఢిల్లీ రాష్ట్ర పగ్గాలు వస్తే.. ప్రపంచ స్థాయి నగరంగా తీర్చి దిద్దుతామన్నారు. కేంద్రం తీసుకొచ్చిన అయుష్మాన్ భారత్ పథకాన్ని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అమలు చేయకుండా ఢిల్లీ రాష్ట్ర ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారంటూ మండి పడ్డారు. ఆయుష్మాన్ భారత్ ను ఢిల్లీలో అమలు చేసేందుకు సీఎం కేజ్రీవాల్ నిరాకరించారన్నారు. కొన్ని సర్వేల ప్రకారం ఒక ప్రభుత్వం మంచినీటి సరఫరాలో అగ్రస్థానంలో ఉంటే.. మరొకరు రోడ్లనిర్మాణంలో ముందున్నారని.. ఇంకొకరు విద్యుత్ సరఫరా లో ముందుంటే.. ఆప్ ప్రభుత్వం మాత్రం అబద్ధాలు చెప్పే విషయం లో ముందున్నట్లు గా షా వ్యాఖ్యానించారు. ఈ పంచ్ లు బాగానే ఉన్నాయి కానీ.. ఢిల్లీ ఓటర్లు అమిత్ షా మాటల్ని ఎంత మేర విశ్వాసం తీసుకుంటారన్నది తుది ఫలితమే చెబుతుందని చెప్పాలి.
Tags:    

Similar News