21 రోజుల్లో ఏకంగా వంద కిలోలు తగ్గింది

Update: 2017-03-08 04:38 GMT
వారం పాటు మా దగ్గర ట్రీట్ మెంట్ తీసుకోండి.. అంత తగ్గిస్తాం.. ఇంత తగ్గిస్తామంటూ కొన్ని సంస్థల వ్యాపార ప్రకటనలు చూస్తుంటాం. అందులో నిజాల కంటే అబద్ధాలే ఎక్కువగా ఉంటాయి.అయితే.. భారీకాయంతో చికిత్స కోసం కైరో నుంచి ముంబయి వచ్చిన ఇమాన్ అహ్మద్ 21 రోజుల్లో రికార్డు స్థాయిలో 108 కేజీల బరువు తగ్గినట్లుగా వైద్యులు వెల్లడించారు.

దీంతో.. ఇప్పటివరకూ ఆమె పేరిట ఉన్న రికార్డు తుడిచిపెట్టుకుపోయింది. ఇప్పటివరకూ ఇమాన్ అహ్మద్ కు ప్రపంచంలోనే అత్యంత బరువైన మహిళగా పేరుంది. విపరీతమైన బరువుతో ఉన్న ఆమె శ్వాస పీల్చుకోవటం కూడా కష్టంగా ఉండేది. కదల్లేని స్థితిలో ఆమెను ప్రత్యేక విమానంలో కైరో నుంచి ముంబయికి తరలించారు. ఆమెకు ముంబయిలోని సైఫీ ఆసుపత్రి వైద్యులు చికిత్స చేయటం తెలిసిందే.

ప్రస్తుతం ఆమె బరువు 380 కేజీలుగా చెబుతున్నారు. పాతికేళ్ల తర్వాత ఆమె స్వయంగా కూర్చోగలిగినట్లుగా వైద్యులు చెబుతున్నారు. త్వరలో ఆమెకు శస్త్రచికిత్స చేయనున్నట్లుగా చెప్పిన వైద్యులు.. అది పూర్తి అయ్యాక ఆమె తన కాళ్ల మీద తాను నిలబడే అవకాశం ఉంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.చికిత్స కోసం ముంబయి వచ్చిన ఇమాన్ రోజుకు రెండు కేజీల చొప్పు పాతిక రోజుల్లో 50 కిలోలు తగ్గుతుందని తాము అంచనా వేశామని.. కానీ.. ఆమె ఏకంగా వందకు పైగా కేజీలు తగ్గి ఆశ్చర్యపోయేలా చేశారని చెప్పారు. త్వరలో ఆమెకు శస్త్రచికిత్స చేసిన తర్వాత మరింత బరువు తగ్గే అవకాశం ఉన్నట్లుగా చెబుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News