సోష‌ల్ మీడియా కిటుకులు చెప్పిన ర‌క్షిత్ టాండ‌న్

Update: 2019-07-24 04:54 GMT
చేతిలో స్మార్ట్ ఫోన్ ఎంత కామ‌నో.. సోష‌ల్ మీడియాలో అకౌంట్ ఇప్పుడంత కామ‌న్. నిబంధ‌న‌లు ఒప్పుకోకున్నా ఆరేడేళ్ల వ‌య‌సులోనే సోష‌ల్ మీడియా ఖాతాల్ని తెరిచేసే వారెంద‌రో. చిన్న వ‌య‌సు నుంచి ముదిమి వ‌య‌సులో ఉన్న వారి వ‌ర‌కూ ప్ర‌తి ఒక్క‌రికి క‌నీసం ఒక‌ట్రెండు ఖాతాలు మొద‌లుకొని.. ప‌దుల సంఖ్య‌లో అకౌంట్స్ ను మొయింటైన్ చేసేటోళ్లు బోలెడంత మంది.

అలాంటివారంతా త‌మ‌కు తెలిసిన అంశాలు.. త‌మ‌కు సంబంధించిన ఫోటోలు.. వ్య‌క్తిగ‌త వివ‌రాల్ని తెగ షేర్ చేసేస్తుంటారు. మ‌న చుట్టూ ఉండే ప్ర‌పంచం లాంటిదే సోష‌ల్ ప్ర‌పంచం. ఆ మాట‌కు వ‌స్తే మ‌రింత డేంజ‌ర్ కూడా. సోష‌ల్ ప్ర‌పంచంలో ఎలా ఉండాలి?  ఎలా వ్య‌వ‌హ‌రించాల‌న్న దానిపై స్ప‌ష్ట‌త చాలా త‌క్కువ‌. దాదాపుగా 20 ఏళ్ల క్రిత‌మే సైబ‌ర్ ప్ర‌పంచంలో ఎంత జాగ్ర‌త్త‌గా ఉండాలి?  ఇక్క‌డ జ‌రిగే నేరాలు.. ఘోరాల‌పై ప‌రిశోధ‌న చేయ‌ట‌మే కాదు.. వివిధ రాష్ట్రాల్లోని కాలేజీల‌కు.. పోలీసుల‌కు.. సీబీఐతోపాటు ప‌లు సంస్థ‌ల‌కు క‌న్స‌ల్టెంట్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు ఆగ్రాకు చెందిన ర‌క్షిత్ టండ‌న్.

తాజాగా ఆయ‌న హైద‌రాబాద్ కు వ‌చ్చి ఒక కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా సైబ‌ర్ ప్ర‌పంచంలో అందునా సోష‌ల్ మీడియాలో ఎవ‌రెలా వ్య‌వ‌హ‌రించాలి?  ఎలా స‌మ‌స్య‌ల వ‌ల‌యంలోకి చిక్కుకోకుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి?  సైబ‌ర్ నేర‌గాళ్ల ఉచ్చులో ప‌డ‌కుండా ఉండాల‌న్న అంశంపై విలువైన స‌ల‌హాలు.. సూచ‌న‌లు ఇచ్చారు.

నిత్యం సోష‌ల్ మీడియాలో గంట‌ల కొద్దీ యాక్టివిటీస్ లో బిజీగా ఉండే నేటి యూత్ ఆయ‌న చెప్పిన అంశాల‌పై ఒక లుక్కేయ‌టం చాలా అవ‌స‌రం. స‌మ‌స్య‌ల సుడిగుండాల్లోకి చిక్కుకోకుండా ఉండాలంటే ఏం చేయాలన్న దానిపై ఆయ‌నేం చెప్పారంటే?

+  ప‌ర్స‌న‌ల్ ఫోటోల్ని తెలిసిన వారికి.. ద‌గ్గ‌రివారికి పంపుతామ‌న్న ఉద్దేశంతో సోష‌ల్ మీడియాలో ఫోటోల్ని పెట్టేస్తున్నారు. అయితే.. ఇలాంటి ఫోటోల్ని సైబ‌ర్ నేర‌గాళ్లు డేటింగ్ యాప్ ల‌లో ఉంచి భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. అస‌భ్యంగా మార్ఫింగ్ చేసి అశ్లీల వెబ్ సైట్లో ఉంచుతూ ల‌క్ష‌ల్లో ఆదాయాన్ని పొందుతున్నారు.

+ మీ ప‌ర్స‌న‌ల్ డిటైల్స్ భ‌ద్రంగా ఉండాలంటే ప్రైవ‌సీ సెట్టింగ్స్ కు వెళ్లండి. అక్క‌డి వాటిని వినియోగించండి.

+  ఫేస్ బుక్ అకౌంట్స్ దుర్వినియోగం చేసేందుకు స్కామ‌ర్లు మీ ఫ్రెండ్స్ పంపిన‌ట్లుగా లింకులు పంపుతుంటారు. చెక్ చేసిన త‌ర్వాతే వాటిని ఓపెన్ చేయండి.

+  మీ ప‌ర్స‌న‌ల్ డిటైల్స్ ను.. మీ స్నేహితులు.. కుటుంబ స‌భ్యుల వివ‌రాలు.. ఫోన్ నెంబ‌ర్ల‌ను హైడ్ అనే ఆప్ష‌న్ తో ఇత‌రుల‌కు క‌నిపించ‌కుండా చేయండి.

+  చిన్న‌పిల్ల‌లు మొబైల్ ద్వారా ఫేస్ బుక్ చూస్తుంటే.. హ్యాకింగ్ కు గురి కాకుండా ఉండేందుకు వీలుగా ఫేస్ బుక్ డాట్ కాం/  మొబైల్ ప్రొటెక్ష‌న్ లో మీ డిటైల్స్ న‌మోదు చేయండి

+  అమ్మాయిలు.. కాలేజీ గాళ్స్.. మ‌హిళ‌లు త‌మ ప్రొఫైల్ పిక్ ల‌ను ఎట్టి ప‌రిస్థితుల్లో వాడొద్దు.మీరు పోస్ట్ చేసిన గంట‌ల వ్య‌వ‌ధిలోనే సైబ‌ర్ నేర‌గాళ్ల చేతుల్లోకి వెళ్తాయి. లాస్ట్ సీన్.. ప్రొఫైల్ ఫోటో.. మై కాంటాక్ట్స్ కు ప్రైవ‌సీ సెట్టింగ్స్ పెట్టుకోండి.

+  బ‌హిరంగ ప్ర‌దేశాల్లో ఉచిత వైఫై ఉన్న చోట వాట్సాప్ వాడొద్దు. వైఫై పాస్ వ‌ర్డ్ ద్వారా మీ వాట్సాప్ నెంబ‌రు తెలిసిపోతుంది. వాట్సాప్ ఉన్న ఫోన్ ను తెలియ‌ని వారికి అస్స‌లు ఇవ్వొద్దు. ల్యాప్ టాప్ ద్వారా మీ వాట్సాప్ ఖాతా తెరిచి దుర్వినియోగం చేస్తుంటారు.

+  ఇన్ స్టాలో ప‌ర్స‌న‌ల్ ఫోటోలు.. మీ డిటైల్స్.. మీరుంటున్న ప్రాంతాన్ని అస్స‌లు షేర్ చేయొద్దు. శ‌త్రువులు.. అప‌రిచితులు.. మిమ్మ‌ల్ని టార్గెట్ చేసినోళ్లు మీపై దాడి చేసే అవ‌కాశం ఉంది.

+  మీ ఆన్ లైన్ బ్యాంక్.. ఫేస్ బుక్.. మొయిల్ ఖాతాల‌కు ఒకే పాస్ వ‌ర్డ్ అస్స‌లు వాడొద్దు.

+  మీకు తెలియ‌ని ఫోన్ నెంబ‌ర్ల నుంచి ఫోన్లు వచ్చినా.. మెసేజ్ లు వ‌చ్చినా రియాక్ట్ కావొద్దు.


Tags:    

Similar News