మోడీ సమర్పించు..మీలో ఎవరు కోటీశ్వరుడు?

Update: 2016-12-25 07:03 GMT
పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో డిజిటల్ చెల్లింపులను మోదీ సర్కారు ప్రోత్సహిస్తున్నది తెలిసిందే. ఈ క్రమంలోనే డిజిటల్ పేమెంట్లకు ఊతమిస్తూ వినియోగదారులు, వ్యాపారుల కోసం రెండు సరికొత్త పథకాలను ఈ రోజు ప్రారంభిస్తోంది కేంద్రం. లక్కీ గ్రాహక్ యోజన, డిజి-ధన్ వ్యాపారి యోజన పథకాలను ఆదివారం ప్రభుత్వం పరిచయం చేస్తోంది. ఈ పథకాలు 100 రోజులు అమల్లో ఉంటాయి. ఈ వ్యవధిలో డిజిటల్ పేమెంట్స్ చేసే వినియోగదారులకు, వాటిని అనుమతించే వ్యాపారులకు నగదు బహుమతులు అందనున్నాయి.
    
లక్కీ గ్రాహక్ యోజన కింద ఈ 100 రోజుల్లో రోజుకు 15 వేల మంది వినియోగదారులను లక్కీ డ్రాల ద్వారా ఎంపికచేసి ఒక్కొక్కరికి 1,000 రూపాయలను అందిస్తారు. అలాగే వారానికోసారి జరిగే డ్రాలో ఏడుగురు విజేతలకు గరిష్ఠంగా లక్ష రూపాయలను అందించనున్నారు. ఇక డిజి-ధన్ వ్యాపారి యోజన పథకం కింద వారానికి 7వేల మంది వ్యాపారులకు బహుమతులు అందుతాయి. గరిష్ఠంగా ఒక్కొక్కరు 50,000 రూపాయల వరకు పొందే వీలుంది.
    
మెగా బహుమతుల కింద కోటి రూపాయలు - 50 లక్షల రూపాయలు - 25 లక్షల రూపాయల బహుమతులూ ఉన్నాయి. పాత పెద్ద నోట్ల రద్దు అయిన నవంబర్ 8 నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ 13 మధ్య డిజిటల్ లావాదేవీలు జరిపిన వినియోగదారుల నుంచి విజేతలను ఎంపిక చేస్తారు. వారికే ఏప్రిల్ 14న ఈ మెగా బహుమతులు అందుతాయి. వ్యాపారులకూ 50 లక్షల రూపాయలు, 25 లక్షల రూపాయలు, 5 లక్షల రూపాయల మెగా బహుమతులను ఇవ్వనున్నారు. కాగా, 50 రూపాయల నుంచి 3,000 రూపాయల మధ్య జరిగిన డిజిటల్ పేమెంట్లకే ఈ పథకాలు వర్తిస్తాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News