‘ఇరాన్ కు సుప్రీం లీడర్‌గా ఉండమన్నారు’ ట్రంప్ వ్యాఖ్యల వెనుక అసలు కథేంటి?
ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడులు ప్రారంభమైన తొలిరోజే ఆ దేశ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ మరణించడం పెద్ద మలుపు.;
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసే వ్యాఖ్యలు ఎప్పుడూ ఒక పట్టాన అర్థం కావు. అటు ఇరాన్ ఏమో అసలు చర్చలే జరగట్లేదని భీష్మించుకు కూర్చుంటే, ఈయన మాత్రం ఏకంగా ఆ దేశానికే తనను 'సుప్రీం లీడర్'గా ఉండమని అడిగారంటూ బాంబు పేల్చారు. యుద్ధం జరుగుతున్న సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దౌత్యపరంగా ఎంత వరకు సమంజసమో పక్కన పెడితే, ట్రంప్ మార్క్ ‘ప్రగల్భాలు’ మాత్రం ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఇరాన్ అంతర్గత సంక్షోభం, ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలను పరిశీలిస్తే..
నన్ను సుప్రీం లీడర్ అవమన్నారు..
రిపబ్లికన్ పార్టీ విరాళాల సేకరణ కార్యక్రమంలో మాట్లాడిన ట్రంప్, ఇరాన్ నేతలు తనను ఆ దేశ తదుపరి సుప్రీం లీడర్‌గా ఉండాలని కోరారంటూ ఆశ్చర్యకరమైన ప్రకటన చేశారు. అయితే తనకు ఆ పదవి అక్కర్లేదని, అందుకే వారి అభ్యర్థనను తిరస్కరించానని చెప్పుకొచ్చారు. యుద్ధంలో ఇరాన్‌పై భారీ విజయం సాధించబోతున్నామని, ఆ దేశం ఒప్పందం కోసం ప్రాధేయపడుతోందని ఆయన చెప్పారు. కానీ సొంత ప్రజల తిరుగుబాటుకు భయపడి ఇరాన్ నేతలు ఈ విషయాన్ని బయటకు చెప్పడం లేదని ట్రంప్ వింత విశ్లేషణలు చేస్తున్నారు.
ఖమేనీ మరణం తర్వాత ఇరాన్ లో ఏం జరుగుతోంది..?
ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడులు ప్రారంభమైన తొలిరోజే ఆ దేశ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ మరణించడం పెద్ద మలుపు. ఆయన తర్వాత కుమారుడు మొజ్తాబా ఖమేనీ బాధ్యతలు చేపట్టినట్లు వార్తలు వచ్చినా, ఆయన ఇంత వరకు బహిరంగంగా కనిపించలేదు. అమెరికా దాడుల్లో మొజ్తాబా తీవ్రంగా గాయపడ్డారనే ప్రచారం జరుగుతున్న తరుణంలో, ఇరాన్ నాయకత్వం ఇప్పుడు అగాధంలో పడిపోయిందని అమెరికా భావిస్తోంది. ఈ అనిశ్చిత పరిస్థితులనే ట్రంప్ తన వ్యాఖ్యలకు అనుకూలంగా మార్చుకుంటున్నారు.
పశ్చిమాసియాలో భారీ విజయం..
పశ్చిమాసియాలో ఇంతవరకూ ఎవరూ చూడని విధంగా అమెరికా భారీ విజయాన్ని అందుకోబోతోందని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. ఇరాన్‌పై సైనిక విధ్వంసం దాదాపు పూర్తయిందని, చర్చల ప్రక్రియ కొనసాగుతోందని ఆయన పునరుద్ఘాటించారు. అయితే, వైట్ హౌస్ గానీ లేదా ఇరాన్ విదేశీ వ్యవహారాల శాఖ గానీ ఈ చర్చలపై అధికారికంగా స్పందించకపోవడం గమనార్హం. కేవలం ఎన్నికల ప్రచారంలో భాగంగానే ట్రంప్ ఇలాంటి ‘అతిశయోక్తులు’ పలుకుతున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.
ట్రంప్ వ్యాఖ్యలు ప్రగల్భాలుగా అనిపించినా, ఇరాన్ ప్రస్తుతం ఒక గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోందన్నది వాస్తవం. ఒకవైపు నాయకత్వ లేమి, మరోవైపు అమెరికా సైనిక ఒత్తిడి ఆ దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇరాన్ నిజంగానే లోలోపల చర్చలకు మొగ్గు చూపుతోందా? లేక ట్రంప్ తన రాజకీయ ప్రయోజనాల కోసం ఈ కథను అల్లుతున్నారా? అనేది త్వరలోనే తేలనుంది. ఏదేమైనా, ఇరాన్ సుప్రీం లీడర్ పదవిని కూడా వదులుకున్నానని ట్రంప్ చెప్పడం మాత్రం అంతర్జాతీయ రాజకీయాల్లో ఒక పెద్ద జోక్‌గా మిగిలిపోయేలా ఉంది.