వరల్డ్ కప్ హ్యాంగోవర్.. అంతర్జాతీయ ఉద్రిక్తతల ప్రభావం.. ఐపీఎల్‌పై ఆసక్తి తగ్గుదల
ఐపీఎల్ అంటే ఒకప్పుడు దేశవ్యాప్తంగా పండుగ వాతావరణం. మ్యాచ్‌లు ప్రారంభం కావడానికి ముందే అభిమానుల్లో ఉత్సాహం ఉప్పొంగేది.;
ఐపీఎల్ అంటే ఒకప్పుడు దేశవ్యాప్తంగా పండుగ వాతావరణం. మ్యాచ్‌లు ప్రారంభం కావడానికి ముందే అభిమానుల్లో ఉత్సాహం ఉప్పొంగేది. టికెట్లు కోసం పోటీ, సోషల్ మీడియాలో చర్చలు, టీమ్‌లపై అంచనాలు.. ఈ అన్నీ కలిపి ఐపీఎల్‌ను ఒక ప్రత్యేక బ్రాండ్‌గా నిలబెట్టాయి. కానీ 2026 సీజన్ ప్రారంభానికి ముందు కనిపిస్తున్న పరిస్థితులు మాత్రం పూర్తిగా భిన్నంగా ఉన్నాయి.
మార్చి 28 నుంచి ఐపీఎల్ 2026 ప్రారంభం కానుండగా గతంలో లాగా ఎలాంటి హడావుడి, ఉత్సాహం కనిపించడం లేదు. సోషల్ మీడియా వేదికలలో గానీ, క్రికెట్ అభిమానుల మధ్య గానీ పెద్దగా చర్చలు జరగకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా విడుదలైన ఐపీఎల్ ట్రోఫీతో పాటు 10 జట్ల కెప్టెన్లు ఉన్న ఫోటో మరింత చర్చనీయాంశమైంది.
ఆ ఫోటోపై నెటిజన్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఐపీఎల్ కెప్టెన్ల ఫోటోలు అంటే ఒక ప్రత్యేక ఆకర్షణ ఉండేది. మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి దిగ్గజ ఆటగాళ్లు ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపు అయ్యేది. వారి మధ్య ఉన్న పోటీ తత్వం, ఆత్మవిశ్వాసం ఫోటోలోనే ప్రతిబింబించేది. కానీ ఈసారి విడుదలైన ఫోటోలో ఆ ‘ఆరా’ , ఆ ఫైర్ కనిపించడం లేదని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
ప్రస్తుతం ఉన్న కెప్టెన్లు ప్రతిభావంతులే అయినప్పటికీ గత తరం ఆటగాళ్లలా భారీ ఫాలోయింగ్ లేదా ఆకర్షణీయమైన వ్యక్తిత్వం లేదని సోషల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. “ఇది ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత నిరుత్సాహకరమైన కెప్టెన్ల ఫోటో కావచ్చు” అంటూ నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు.
ఇక ఈ సీజన్‌పై హైప్ తగ్గడానికి అంతర్జాతీయ పరిస్థితులూ కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు, చమురు సంక్షోభం ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపుతున్నాయి. ఈ పరిస్థితులు ప్రజల దృష్టిని క్రీడల నుంచి మరల్చాయి. అంతేకాకుండా ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్ కప్ ప్రభావం ఇంకా పూర్తిగా తగ్గలేదు. వరుసగా పెద్ద టోర్నమెంట్లు రావడంతో అభిమానుల్లో ‘క్రికెట్ అలసట’ ఏర్పడిందని చెప్పవచ్చు.
ఈ నేపథ్యంలో ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభం కానున్నప్పటికీ, ఆశించిన స్థాయిలో స్పందన రాకపోవడం నిర్వాహకులకు సవాల్‌గా మారింది. అయితే టోర్నమెంట్ ప్రారంభమైన తర్వాత మ్యాచ్‌ల ఉత్కంఠ, ఆటగాళ్ల ప్రదర్శనలు మళ్లీ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతాయా లేదా అనేది చూడాలి. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తే, ఐపీఎల్‌కు ఇది ఒక పరీక్ష సమయమని చెప్పడం తప్పు కాదు.