ఎటకారం చేసి అంతలోనే ఆయింట్ మెంట్ రాసిన రాకేశ్ రెడ్డి
తెలంగాణ అధికార కాంగ్రెస్ నేతలకు కాలేలా మాట్లాడిన బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి పుణ్యమా అని సభలో తాజాగా కాస్తంత హాట్ హాట్ గా మారింది.;
ఎటకారం చేయటానికి హద్దులు ఉంటాయి. కొన్ని విషయాల్లోకి కొందరి పేర్లను ప్రస్తావించటం బాగోదు. రాజకీయంగా వంద వైరుధ్యాలు ఉండొచ్చు. అంత మాత్రాన నోటికి వచ్చినట్లుగా మాట్లాడటం కూడా సరికాదు. తెలంగాణ అధికార కాంగ్రెస్ నేతలకు కాలేలా మాట్లాడిన బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి పుణ్యమా అని సభలో తాజాగా కాస్తంత హాట్ హాట్ గా మారింది. ఆయన చేసిన వ్యాఖ్యల్ని రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లుగా తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ స్పష్టం చేశారు. ఇంతకూ అసలేం జరిగింది? దివంగత ప్రధాని ఇందిరాగాంధీ ప్రస్తావన తీసుకొచ్చి సాధించిందేంటి అన్నది ప్రశ్న. కెలికి మరీ కవర్ చేసుకోవాల్సినంత ప్రయాస ఎందుకు? అన్నది ప్రశ్న. అసలేం జరిగిందన్న వివరాల్లోకి వెళితే..
బడ్జెట్ పద్దులపై చర్చ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో జరుగుతోంది. ఇందులో భాగంగా బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి మాట్లాడారు. తన ప్రసంగంలో భాగంగా ఇప్పపువ్వు సారా అంశంపై చర్చలో పాల్గొన్న రాకేశ్ రెడ్డి.. ఇప్ప సారాకు మాత్రం ఇందిరమ్మ పేరు పెట్టొద్దంటూ చేసిన వ్యాఖ్యలు పెను దుమారంగా మారాయి. తొలిసారి ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న ఆయన..కాంగ్రెస్ మీదా.. ఆ పార్టీ ప్రభుత్వం మీదా తనకున్న నెగిటవ్ ఫీలింగ్ ను చెప్పే వేళ.. ఆయన చేసిన పోలిక సెట్ కాలేదని చెప్పాలి.
ఇప్పపువ్వు సారాకు ఇందిరమ్మ పేరు పెట్టొద్దని.. ఇప్ప టకీలా లేదంటే.. ఇంకేమైనా పేరు పెట్టాలన్నారు. ఈ వ్యాఖ్యలపై మంత్రులు శ్రీధర్ బాబు.. సీతక్క.. పొన్నం ప్రభాకర్.. వాకిటి శ్రీహరి తీవ్రంగా తప్పు పట్టారు. ఇందిరమ్మ ప్రస్తావన తెచ్చినందుకు రాకేశ్ రెడ్డి సారీ చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ నేతలు ఇందిరమ్మ మీదా ఇంకా అక్కసు ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. ఇందిరాను అవమానిస్తే.. మహిళల్ని అవమానించినట్లే అవుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.
వాజ్ పేయ్ లాంటి వ్యక్తే ఇందిరమ్మను ఉక్కు మహిళ, దుర్గామాతగా పేర్కొన్నారని.. అలాంటిది రాకేశ్ రెడ్డి లాంటోళ్లు ఈ తరహా వ్యాఖ్యలు చేయటం ఏమిటి? అన్నది మంత్రులు ప్రశ్నిస్తున్నారు. ప్రతి పథకానికి ఇందిరమ్మ పేరు పెట్టటాన్ని సెటైరికల్ గా వ్యాఖ్యలు చేసే వైనం మిస్ ఫైర్ అయ్యిందని చెప్పాలి. తాను చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ రాష్ట్ర మంత్రులు మొదలు ముఖ్యమంత్రితో పాటు ఇతరులు సైతం తన మాటల్ని తప్పు పడుతున్న వేళ.. కవరింగ్ వ్యాఖ్యలు చేయటం గమనార్హం.
తనకు దివంగత ప్రధాని ఇందిరా గాంధీ పేరు మీద ఉన్న గౌరవంతోనే ఆ వ్యాఖ్యలు చేశానని చెప్పారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఇప్ప సారా పేరు పెట్టొద్దన్న ఉద్దేశంతోనే తాను అలా మాట్లాడినట్లుగాపేర్కొన్నారు. ప్రభుత్వం ఆధ్వర్యంలోనే తయారీ కేంద్రం ఉండాలని చెప్పిన రాకేశ్.. ‘‘ప్రతి పథకానికి ఇందిరా గాంధీ పేరు పెట్టటం వాళ్లకు అలవాటు. నేను చేసిన సూచనలో ఎలాంటి తప్పు లేదు. ఇందిరా గాంధీ ఉక్కు మహిళ.. ఆమె అంటే నాకు ఎంతో గౌరవం. ఆమె కాంగ్రెస్ నేత మాత్రమే కాదు భారత మాజీ ప్రధాని కూడా’’ అంటూ వ్యాఖ్యలు చేశారు.
ఇదంతా చూస్తే.. తన మాటలతో విమర్శల మంటలు రేగిన నేపథ్యంలో తానే ఆ మంటల్ని చల్లార్చే ప్రయత్నం చేశారని చెప్పాలి రాకేశ్ రెడ్డి. అదేదో మాట్లాడటానికి ముందే అప్రమత్తంగా ఉంటే ఈ విమర్శలు.. వివాదాలు ఉండేవి కావు. ఎటకారానికి హద్దులు ఉంటాయని.. అనవసరంగా ప్రముఖుల పేర్లను ప్రస్తావించకూడదన్న విషయం అర్థమై ఉంటుంది. ఏమైనా.. దివంగత నేతల గురించి.. అత్యున్నత స్థానాల్లో ఉన్నోళ్ల గురించి మాట్లాడే వేళ.. వీలైనంత వరకు వారి గౌరవ మర్యాదల్ని మంటకలిగేలా మాత్రం వ్యవహరించకూడదు. తాజా ఉదంతమే ఇందుకు నిదర్శనమన్నది రాకేశ్ రెడ్డికి అర్థమైందా?