ట్రంప్ స్వస్థలంలో భారీ షాక్.. ఫ్లోరిడాలో డెమోక్రాట్ సంచలన విజయం
అమెరికా రాజకీయాల్లో ఎవరూ ఊహించని అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. రిపబ్లికన్ పార్టీకి తిరుగులేని కంచుకోటగా.. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అత్యంత సన్నిహిత ప్రాంతంగా భావించే ఫ్లోరిడా గడ్డపై డెమోక్రాట్లు విజయభేరి మోగించారు.;
అమెరికా రాజకీయాల్లో ఎవరూ ఊహించని అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. రిపబ్లికన్ పార్టీకి తిరుగులేని కంచుకోటగా.. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అత్యంత సన్నిహిత ప్రాంతంగా భావించే ఫ్లోరిడా గడ్డపై డెమోక్రాట్లు విజయభేరి మోగించారు. రాబోయే మధ్యంతర ఎన్నికలకు ముందు సెమీఫైనల్‌గా భావించిన ఈ ఉప ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థిపై డెమోక్రాట్ అభ్యర్థి ఎమిలీ గ్రెగరీ సంచలన విజయం సాధించడం ఇప్పుడు అగ్రరాజ్య రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ట్రంప్ నివాసం ఉన్న చోటే పరాజయం
ఈ ఎన్నిక ఫలితం రిపబ్లికన్లకు కేవలం ఒక సీటు కోల్పోవడం మాత్రమే కాదు.. అది ఒక పెద్ద నైతిక పరాజయం. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ అధికారిక నివాసం మార్-ఎ-లాగో ఉన్న నియోజకవర్గంలోనే డెమోక్రాట్లు గెలుపొందడం గమనార్హం. 2024 అధ్యక్ష ఎన్నికల్లో ఇదే ప్రాంతంలో ట్రంప్ ఏకంగా 11 శాతం మెజారిటీ సాధించారు. అటువంటి పట్టున్న చోట ట్రంప్ స్వయంగా మద్దతు ప్రకటించిన రిపబ్లికన్ అభ్యర్థి జాన్ మేపుల్స్‌ను గ్రెగరీ ఓడించడం రాజకీయ విశ్లేషకులను సైతం విస్మయానికి గురిచేస్తోంది. గతంలో ఈ స్థానాన్ని రిపబ్లికన్ నాయకుడు మైక్ కరూసో 19 శాతం భారీ మెజారిటీతో గెలుచుకున్నారు. ఆయన రాజీనామాతో వచ్చిన ఈ ఉప ఎన్నికలో రిపబ్లికన్ల ఓటు బ్యాంకు భారీగా చీలి డెమోక్రాట్ల వైపు మళ్లడం స్పష్టంగా కనిపిస్తోంది.
ప్రజల నాడి పట్టుకున్న ఎమిలీ గ్రెగరీ
విజయం అనంతరం ఎమిలీ గ్రెగరీ మాట్లాడుతూ ప్రజలు కేవలం రాజకీయ విమర్శల కంటే తమ దైనందిన సమస్యల పరిష్కారాన్ని కోరుకుంటున్నారని స్పష్టం చేశారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకడం.. ఇరాన్ యుద్ధం కారణంగా పెట్రోల్ ధరలు పెరగడం సామాన్యులపై తీవ్ర ప్రభావం చూపింది. కేవలం పార్టీ సిద్ధాంతాల కంటే స్థానిక నాయకత్వంపై ప్రజలు మొగ్గు చూపారు. డెమోక్రాటిక్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు నిక్కీ ఫ్రైడ్ ఈ విజయాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ.. "అధిక ధరలు, అవినీతి, రిపబ్లికన్ల రాజకీయ గందరగోళంతో ప్రజలు విసుగెత్తిపోయారు. ఈ ఫలితం నవంబర్ మధ్యంతర ఎన్నికలకు ఒక ట్రైలర్ మాత్రమే" అని ధీమా వ్యక్తం చేశారు.
రెట్టింపు దెబ్బ.. సెనేట్ స్థానం కూడా కైవసం
రిపబ్లికన్లకు షాక్ కేవలం ఒక స్థానానికే పరిమితం కాలేదు. ఫ్లోరిడా రాష్ట్ర సెనేట్ ఉప ఎన్నికలో కూడా డెమోక్రాట్ అభ్యర్థి బ్రియన్ నాథన్ విజయం సాధించి.. రిపబ్లికన్ల నుంచి ఆ సీటును లాగేసుకున్నారు. ఒకేసారి రెండు కీలక స్థానాల్లో డెమోక్రాట్లు గెలవడం ఫ్లోరిడా రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారుతున్నాయనే సంకేతాలను ఇస్తోంది.
అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావం
మరోవైపు ఇరాన్ యుద్ధం అమెరికా దేశీయ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అమెరికా సెనేట్‌లో జరిగిన విచారణలో సెనేటర్ జీన్ షాహీన్ ఆందోళనకర విషయాలను వెల్లడించారు. ఇరాన్ యుద్ధం కారణంగా అమెరికా తన ఆయుధ నిల్వలను వేగంగా కోల్పోతోందని దాదాపు 16 బిలియన్ డాలర్ల విలువైన ఆయుధాలను అత్యవసర అధికారాలతో మిడిల్ ఈస్ట్‌కు తరలించడం వల్ల దేశ రక్షణ సామర్థ్యంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయని ఆమె హెచ్చరించారు. యుద్ధం వల్ల కలుగుతున్న ఆర్థిక భారం సామాన్య ఓటరును రిపబ్లికన్లకు దూరం చేస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.
మధ్యంతర ఎన్నికలకు హెచ్చరిక
ఈ ఫలితాలు రిపబ్లికన్ పార్టీకి.. ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్‌కు గట్టి హెచ్చరిక వంటివి. తన సొంత గడ్డపై, తన ప్రభావం బలంగా ఉన్న చోటే ఓటమి ఎదురవ్వడం ట్రంప్ రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం ఉంది. నవంబర్‌లో జరగబోయే మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాట్లు ఇదే ఊపును కొనసాగిస్తారా లేదా రిపబ్లికన్లు పుంజుకుంటారా అనేది వేచి చూడాలి.