జిల్లాల వారీగా పక్కా లెక్క.. ఏపీలో ఏ జిల్లాలో ఎన్ని అంటే?
జిల్లాలు, ప్రాంతాల వారీగా చూస్తే ప్రస్తుతం కోస్తాలో అత్యధికంగా 80 సీట్లు ఉన్నాయి. అదేవిధంగా రాయలసీమలో 52, ఉత్తరాంధ్రలో 43 స్థానాలు ఉన్నాయి.;
అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన అంశంపై విస్తృత చర్చ జరుగుతోంది. కొత్తగా ఏర్పడే నియోజకవర్గాలు, ఎస్సీ, ఎస్టీ, మహిళా రిజర్వు స్థానాలపై రకరకాల అంచనాలు వెలువడుతున్నాయి. రెండు రోజులుగా ఈ అంశం చుట్టూ పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ నడుస్తోంది. ఏపీలో కొత్తగా 88 అసెంబ్లీ, 13 పార్లమెంటు నియోజకవర్గాలు పెరిగుతాయని అంటున్నారు. అయితే ఈ కొత్త స్థానాలు ఏవి? వాటి కేంద్రాలుగా ఏ ఊర్లను ఖరారు చేస్తారన్నదే ఇప్పుడు హాట్ డిబేట్ అవుతోంది. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ఎక్కడ చూసినా ఇదే చర్చ. 2009 అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనకు ముందు, తర్వాత ఉన్న పరిస్థితులు, భవిష్యత్తులో వచ్చేమార్పులపై నేతలు, విశ్లేషకులు లెక్కలు వేస్తూ తలలు బద్దలు కొట్టుకుంటున్నారు.
రాష్ట్రంలో ప్రస్తుతం 175 నియోజకవర్గాలు ఉండగా, పునర్విభజన తర్వాత ఈ సంఖ్య 263కి పెరుగుతుందని చెబుతున్నారు. అయితే జిల్లాల వారీగా ఎన్ని స్థానాలు పెరుగుతాయనేదే ఇప్పుడు వాడివేడి చర్చగా మారింది. దీంతో నేతలు ప్రాంతాలు, జిల్లాలు, మండలాల వారీగా అంచనాలు వేస్తూ కొత్త నియోజకవర్గాలపై ఓ అభిప్రాయానికి వస్తున్నారు. మొత్తం 88 నియోజకవర్గాలు పెరగనుండగా, రాయలసీమ, కోస్తాల్లో ఎక్కువ సీట్లు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదేవిధంగా కొత్తగా 13 పార్లమెంటు నియోజకవర్గాలు పెరుగుతుండగా, వీటిని ఉమ్మడి జిల్లాకు ఒకటి చొప్పున కేటాయించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
జిల్లాలు, ప్రాంతాల వారీగా చూస్తే ప్రస్తుతం కోస్తాలో అత్యధికంగా 80 సీట్లు ఉన్నాయి. అదేవిధంగా రాయలసీమలో 52, ఉత్తరాంధ్రలో 43 స్థానాలు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా పెరిగే స్థానాల్లో ఎక్కువగా కోస్తాలో 40, రాయలసీమలో 26, ఉత్తరాంధ్రలో 22 స్థానాలు చొప్పున పెరుగుతాయని అంటున్నారు. ఇక ఉత్తరాంధ్రలో ఎక్కువగా విశాఖ నగరంలో సీట్లు పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. అదేవిధంగా కోస్తాలో విజయవాడ, రాజమండ్రి, కాకినాడ, ఏలూరు, నెల్లూరు, ఒంగోలు నగరాల్లో అసెంబ్లీ సీట్లు సంఖ్య పెరుగుతాయని విశ్లేషిస్తున్నారు.
ఉమ్మడి జిల్లాల వారీగా చూస్తే ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లాలో ప్రస్తుతం 10 స్థానాలు ఉండగా, అదనంగా మరో 5 కొత్తగా ఏర్పడుతాయని చెబుతున్నారు. అదేవిధంగా ఉమ్మడి విజయనగరంలో నాలుగు లేదా ఐదు, విశాఖలో ఏడు నుంచి 8 సీట్లు పెరగనున్నాయని చెబుతున్నారు. అదేవిధంగా ఉమ్మడి తూర్పుగోదావరిలో 8, పశ్చిమ గోదావరిలో 7, కృష్ణా, గుంటూరుల్లో 8 చొప్పున సీట్లు పెరిగే అవకాశాలు ఉన్నట్లు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రకాశంలో 6, నెల్లూరు 5, కడప 5, అనంతపురం 7, కర్నూలు 7, చిత్తూరులో 7 చొప్పున నియోజకవర్గాలు పెరుగుతాయని అంటున్నారు.
ఇక ఈ పరిణామం రాజకీయంగా ఎవరికి మేలు చేస్తుంది? ఎవరికి చేటు చేస్తుందనే చర్చ ఎక్కువగా జరుగుతోంది. ప్రస్తుతం కూటమి పార్టీలకు గట్టి పట్టు ఉన్న కోస్తా, ఉత్తరాంధ్రలో అత్యధిక సీట్లు పెరుగుతుండటం అధికార పార్టీకి అడ్వాంటేజ్ గా మారుతుందా? అనే చర్చకు దారితీస్తోంది. ఇక రాయలసీలో ప్రస్తుతం 52 స్థానాలు ఉండగా, అదనంగా మరో 26 పెరగనున్నాయి. ఇక్కడ విపక్ష వైసీపీకి గట్టి పట్టు ఉందని చెబుతున్నారు. గత ఎన్నికల్లో కూటమి సునామీలో వైసీపీ తీవ్రంగా దెబ్బతిన్నా సంప్రదాయంగా చూస్తే ఆ ప్రాంతంలో ఓ సామాజికవర్గం ఆధిపత్యం, ఆ సామాజికవర్గానికి వైసీపీతో ఉన్న అనుబంధం కారణంగా కొత్త నియోజకవర్గాలు ఆ పార్టీకి ఉపయోగపడతాయని అంటున్నారు. మొత్తానికి ఈ లెక్కలు ఏపీ రాజకీయాన్ని హీటెక్కిస్తున్నాయి.