ఏపీలో సీట్లు పెరగవు...2029 లో అంతేనా ?

ఏపీలో ప్రస్తుతం ఉన్న సీట్లతోనే ఎన్నికలు జరుగుతాయా అంటే జరుగుతున్న పరిణామాలు అలాగే కనిపిస్తున్నాయి.

Update: 2026-08-11 19:30 GMT

ఏపీలో ప్రస్తుతం ఉన్న సీట్లతోనే ఎన్నికలు జరుగుతాయా అంటే జరుగుతున్న పరిణామాలు అలాగే కనిపిస్తున్నాయి. ఏపీయే కాదు, దేశమంతా సీట్లు పెరగాలంటే డీలిమిటేషన్ బిల్లు తప్పనిసరిగా పార్లమెంట్ ఆమోదం పొంది తీరాల్సి ఉంది. కానీ పార్లమెంట్ తీరు చూస్తే అలా జరిగే చాన్స్ కనిపించడం లేదు. ఆ మాటకు వస్తే వర్షాకాల సమావేశాలు పూర్తిగా వర్షార్పణం అయిపోయాయి. కేవలం రెండు రోజులు మాత్రమే మిగిలి ఉంది. దాంతో డీలిమిటేషన్ బిల్లు మహిళా బిల్లు ఆమోదం పొందుతుంది అనుకుంటే అది జరిగేట్టు లేదు, ఇపుడు కాకపోతే ఈ బిల్లులు మరెప్పుడు అన్న కొత్త చర్చ కూడా సాగుతోంది.

అంతా జంతర్ మంతర్ :

నిజానికి పార్లమెంట్ లో డీలిమిటేషన్ బిల్లు ఈసారి ఖాయంగా నెగ్గుతుందని ముందు అనుకున్నారు. దానికి తగిన పూర్వ రంగాన్ని బీజేపీ సమకూర్చి పెట్టుకుంది. ఏప్రిల్ 16, 17 తేదీలలో జరిగిన పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలలో ఎన్డీయేకు 298 ఓట్లు వచ్చాయి. 362 ఓట్లకు గానూ 64 ఓట్లు తక్కువ పడ్డాయి. అయితే వాటిని ఈ మధ్య కాలంలో సాధించుకునే పనిలో చాలా వరకూ బీజేపీ సక్సెస్ అయింది. అలా కొత్తగా 30 మంది దాకా ఎంపీలు బీజేపీకి వివిధ పార్టీల నుంచి చీలి మద్దతు తెలిపారు. మరి కొన్ని పార్టీలు పరోక్షంగా సహకారం అందించేందుకు రెడీ అయ్యాయి. కానీ పార్లమెంట్ జరిగితేనా అన్నదే ఇక్కడ పెద్ద ఇబ్బంది. ఇక పార్లమెంట్ లో ప్రతీ రోజూ జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు చేసిన ఆందోళన దాని పర్యవసానాల మీదనే విపక్షాలు పట్టు బట్టి కూర్చున్నాయి.

డీఎంకేకు ముకుతాడు :

మరో వైపు డీఎంకేకు తమిళనాడులో అధికారంలో ఉన్న విజయ్ ప్రభుత్వం ముకుతాడు వేసింది. అఖిల పక్షం పేరుతో డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇచ్చేది లేదని విజయ్ పార్టీ స్పష్టం చేసింది. దాంతో డీఎంకేకి కూడా ఇది ఇరకాటంగా మారింది. అంతే కాదు దేశంలో మారుతున్న రాజకీయ వాతావరణం జెన్ జీ ఆగ్రహాల మధ్య డీఎంకే కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుని వెనక్కి వెళ్ళింది అన్న చర్చ కూడా సాగింది. మొత్తం మీద ఏమైతేనేమి డీలిమిటేషన్ బిల్లుకి మద్దతు కరవు అవుతోంది. అంతకంటే ముందు అసలు బిల్లు పార్లమెంట్ లో ప్రవేశపెట్టేందుకు కూడా చాన్స్ లేకుండా పోతోంది అని అంటున్నారు.

ఏపీ సంగతేంటి :

డీలిమిటేషన్ బిల్లు ఆమోదం పొందితే ఏపీలో పార్లమెంట్ సీట్లతో పాటు అసెంబ్లీ సీట్లు కూడా పెరుగుతాయని అంటున్నారు. అలా అదనంగా కనీసం యాభై నుంచి అరవై అసెంబ్లీ సీట్లు అదనంగా వస్తాయని కూడా భావించారు. అయితే ఇపుడు ఆ పరిస్థితి అన్నది లేకుండా పోతోంది అని అంటున్నారు. నిజానికి రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి విభజన బిల్లులో ఉన్న మేరకు సీట్లు పెంచుకోవచ్చు. కానీ డీలిమిటేషన్ బిల్లు ఎటూ ఉంది కాబట్టి కొత్తగా పెంచేది ఎందుకు అన్నది చర్చగా ఉంది. ఇపుడు అదీ లేదు ఇదీ లేదు అని అంటున్నారు. దాంతో 2029 ఎన్నికల్లో చూసుకుంటే ఏపీలో 175 సీట్లకే ఎన్నికలు జరిగే వాతావరణం కనిపిస్తోంది అని అంటున్నారు. అదే జరిగితే కూటమి పార్టీలకు సీట్ల సర్దుబాటు పెద్ద సమస్యగా మారుతుందని అంటున్నారు. అలాగే వైసీపీలో కూడా అనేక మంది ఆశావహులు సీట్ల కోసం చూస్తున్నారు. సీట్లు పెరిగితే వారికి చాన్స్ వస్తుందని అనుకున్నారు. ఇపుడు వారు కూడా ఇబ్బంది పడే స్థితి ఏర్పడుతుందని అంటున్నారు. మొత్తం మీద ఇప్పటికి మూడు ఎన్నికలు పాత సీట్లతోనే జరిగాయి. సీట్లు కనుక పెరగకపోతే రాజకీయంగా కూడా 2029 ఎన్నికల్లో ఇది తీవ్ర ప్రభావం చూపిస్తుంది అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News