ఇన్నాళ్లకు ఈసీకి ప్రజల బాధ అర్థమైంది.. వివాదాలతో ఉపశమనమిచ్చింది..
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తున్న వేళ కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న తాజా నిర్ణయం సాధారణ ఓటర్లకు కొంత ఊరట కలిగించేలా ఉంది.
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తున్న వేళ కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న తాజా నిర్ణయం సాధారణ ఓటర్లకు కొంత ఊరట కలిగించేలా ఉంది. ఇప్పటివరకు ఎస్ఐఆర్ లో నోటీసులు అందుకున్న ఓటర్లు తమ వివరాలు, ఆధారాలు సమర్పించేందుకు అధికారుల వద్దకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుందనే ఆందోళన నెలకొంది. తాజాగా ఆ భారాన్ని ఓటర్లపై కాకుండా ఎన్నికల యంత్రాంగంపైనే ఎక్కువగా ఉంచేలా ఈసీ కీలక మార్పు ప్రకటించింది.
ఈ నిర్ణయాన్ని కేవలం పరిపాలనా మార్పుగా చూడటం కంటే.. ఎస్ఐఆర్ పై పెరుగుతున్న ప్రశ్నలు, ప్రజల్లో ఏర్పడిన అనుమానాలు, ఎన్నికల ప్రక్రియపై జరుగుతున్న విస్తృత చర్చల నేపథ్యంలో వచ్చిన ఉపశమన చర్యగా చూడాల్సి ఉంటుంది.
నోటీసు అంటే ఓటరు తప్పు చేసినట్టా?
ఎస్ఐఆర్ లో నోటీసు అందుకోవడం అంటే ఆ ఓటరు తప్పనిసరిగా అనర్హుడని అర్థం కాదు. ఎన్నికల జాబితాలోని వివరాలను ధ్రువీకరించే ప్రక్రియలో భాగంగానే నోటీసులు జారీ అవుతున్న సందర్భాలు ఉన్నాయి. అయితే సాధారణ ఓటరికి మాత్రం ‘నోటీసు వచ్చింది’ అంటే వెంటనే ఆందోళన మొదలవుతుంది.
ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగులు, అనారోగ్యంతో ఉన్నవారు, దూర ప్రాంతాల్లో నివసించే వారు లేదా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగడం కష్టమైన వారికి ఇది మరింత భారంగా మారే అవకాశం ఉంది. గతంలో ఎస్ఐఆర్ నోటీసులు, వ్యక్తిగత హాజరు, పత్రాల సమర్పణపై వివిధ రాష్ట్రాల్లో ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఇలాంటి పరిస్థితిలో ‘ఓటరు కార్యాలయానికి రావాలి’ అనే విధానం కంటే ‘అధికారులే ఓటరు ఇంటికి వెళ్లాలి’ అనే విధానం ప్రజలపై ప్రక్రియ భారాన్ని తగ్గిస్తుంది.
అసలు మార్పు ఇక్కడే ఉంది
తాజా నిర్ణయంలో కీలకమైన అంశం ఇదే. నోటీసులు అందుకున్న ప్రతి ఓటరూ తప్పనిసరిగా ఈఆర్వో ముందు వ్యక్తిగతంగా హాజరు కావాల్సిన అవసరం లేదని ఈసీ స్పష్టం చేసింది. అసాధారణ పరిస్థితులు మినహా వ్యక్తిగత విచారణకు పిలవాల్సిన అవసరం లేదని తెలిపింది. అంటే సర్ ప్రక్రియలో ‘పౌరుడు అధికారిని వెతుక్కుంటూ వెళ్లాలి’ అన్న భావన నుంచి ‘అధికారి పౌరుడి వద్దకు వెళ్లాలి’ అన్న దిశగా ఒక ముఖ్యమైన మార్పు కనిపిస్తోంది.
బీఎల్ ఓలు ఇంటికే వెళ్లి అవసరమైన పత్రాలను పరిశీలించడం, వాటిని స్వీకరించడం, అవసరమైన చోట డిజిటల్‌గా అప్‌లోడ్ చేయడం వంటి చర్యలు చేపట్టడం వల్ల నోటీసులు అందుకున్న వారికి ప్రక్రియ సులభతరం కానుంది.
వివాదాల మధ్య జరిగిన సమావేశం
ఈ నిర్ణయం వెలువడిన రోజే కేంద్ర ఎన్నికల సంఘం పూర్తి కమిషన్ సమావేశం కూడా జరిగింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌తో పాటు ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి సమావేశంలో పాల్గొన్నారు. సర్, ఓటర్ల నమోదు, కమిషన్ అంతర్గత వ్యవహారాలపై సమావేశంలో చర్చ జరిగినట్లు ఈసీ వెల్లడించింది.
ఇటీవల కమిషన్‌లోని కొందరు అధికారులు సర్ కు సంబంధించిన నిర్ణయాలపై అభ్యంతరాలు వ్యక్తం చేశారంటూ వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ముగ్గురు కమిషనర్లు కలిసి సమావేశం కావడం సహజంగానే ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే అంతర్గత విభేదాలపై వచ్చిన వార్తలతోనే ఈసీ డిఫెన్స్ లో పడి ఓటర్లకు ఈ ఉపశమనం నిర్ణయం తీసుకున్నట్టు అర్థం అవుతోంది.. ఈసీ మాత్రం తన సర్ నిర్ణయాలు పూర్తి కమిషన్ ఆమోదంతోనే తీసుకున్నామని స్పష్టం చేసింది.
ప్రజలకు నమ్మకం కల్పించడమే అసలు పరీక్ష
ఎన్నికల జాబితా అనేది ప్రజాస్వామ్య ప్రక్రియకు పునాది. అందులో అర్హులైన ఓటర్ల పేర్లు ఉండటం ఎంత ముఖ్యమో.. అనర్హుల పేర్లు తొలగించడం కూడా అంతే ముఖ్యమైన ప్రక్రియ. కానీ ఈ రెండు లక్ష్యాల మధ్య ‘అర్హుడైన ఓటరికి అనవసరమైన ఇబ్బంది కలగకూడదు’ అనే అంశం కూడా కీలకమే.
అందుకే సర్ లో ప్రతి దశలో పారదర్శకత, స్పష్టమైన సమాచారం, సులభమైన ఫిర్యాదు పరిష్కార వ్యవస్థ అవసరం. నోటీసు ఎందుకు వచ్చింది? ఏ పత్రాలు అవసరం? ఎక్కడ సమర్పించాలి? సమర్పించిన పత్రాలకు రసీదు ఎలా వస్తుంది? పేరు తొలగించే ముందు ఎలాంటి అవకాశం ఉంటుంది? వంటి ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు ప్రజలకు అందాలి. తాజా నిర్ణయం ఆ దిశలో ఒక పరిపాలనా ఉపశమన చర్యగా కనిపిస్తోంది.
ఇక మాటల్లో కాదు.. అమలులో చూపాలి
ఈసీ తీసుకున్న నిర్ణయం కాగితాలపై ఎంత సానుకూలంగా కనిపించినా అసలు పరీక్ష క్షేత్రస్థాయిలోనే ఉంటుంది. బీఎల్ వోలు నిజంగా ప్రతి నోటీసుదారుడి ఇంటికి వెళ్తున్నారా? పత్రాలను సక్రమంగా స్వీకరిస్తున్నారా? ఆన్‌లైన్‌లో సరిగ్గా అప్‌లోడ్ చేస్తున్నారా? వృద్ధులు, దివ్యాంగులు, గ్రామీణ ప్రాంతాల ఓటర్లకు సమానంగా సేవలు అందుతున్నాయా? అన్నది కీలకం.
అంతిమంగా సర్ విజయవంతం కావాలంటే ఓటర్ల పేర్లను సరిచేయడమే లక్ష్యం కాకుండా.. అర్హుడైన ఒక్క ఓటరు కూడా ప్రక్రియలో ఇబ్బంది పడకుండా చూడాల్సి ఉంటుంది.
వివాదాలు, అనుమానాలు, రాజకీయ ఆరోపణల మధ్య ఈసీ తాజాగా తీసుకున్న నిర్ణయం మాత్రం ఒక విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఎన్నికల ప్రక్రియ ఎంత కఠినంగా ఉన్నా.. దాని భారం మొత్తం ఓటరిపైనే పడకూడదు. ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రజల వద్దకే వెళ్లాలి. తాజా నిర్ణయం ఆ దిశగా ఎంతవరకు పనిచేస్తుందన్నది ఇప్పుడు అమలుపైనే ఆధారపడి ఉంది.