అనవసర ఆశలు వద్దు.. వ్యాక్సిన్ వచ్చేది 2021లోనేనట

Update: 2020-07-11 05:30 GMT
అదిగిదిగో పంద్రాగస్టున.. మయాదారి కరోనాకు వ్యాక్సిన్ వచ్చేస్తుందన్న మాట పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. మాటల్లో చెప్పినంత సులువుగా వ్యాక్సిన్ ను మార్కెట్లోకి తీసుకురావటం సాధ్యం కాదన్న విషయంపై స్పష్టత వచ్చేసినట్లే. పంద్రాగస్టుకు సాధ్యం కాకున్నా.. దసరా నాటికి మాత్రం పక్కా అని చెబుతున్న వేళ.. అది కూడా సాధ్యం కాదని.. అనవసరమైన ఆశలు పెట్టుకోవద్దన్న మాటను చెప్పేస్తున్నారు నిపుణులు.

వ్యాక్సిన్ వచ్చే అవకాశం 2021లోనే ఉందని.. అంతకు ముందు వచ్చే అవకాశం లేదని తాజాగా పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి శాస్త్రవేత్తలు.. ప్రభుత్వ ఉన్నతాధికారులు తేల్చి చెప్పారు. తాజాగా జరిగిన కమిటీ సమావేశంలో పాల్గొన్న పలువురు ప్రముఖులు ఈ విషయంపై స్పష్టత ఇచ్చారు. వ్యాక్సిన్ రేసులో భారత్ లోని ప్రముఖ ఫార్మా కంపెనీలు ముందుంటాయని ప్యానల్ ఎంపీలు అభిప్రాయపడ్డారు. ప్రపంచంలోని 60 శాతం వ్యాక్సిన్లు మన దేశంలోనే తయారీ అయ్యయన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 140కరోనా వ్యాక్సిన్లకు సంబంధించిన ప్రయోగాలు సాగుతుంటే.. అందులో పదకొండు వ్యాక్సిన్లకు గత వారం నుంచే క్లినికల్ టెస్టుల్ని షురూ చేసినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పూర్తిస్థాయి క్లీనికల్ టెస్టుల నిర్వహణ.. అనంతరం అనుమతులు వచ్చేసరికి 2021 తప్పదని స్పష్టం చేస్తున్నారు. అంతకు ముందే.. వ్యాక్సిన్ వచ్చే అవకాశం లేదంటున్నారు. సో.. ఈ ఏడాది చివరకు వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉందన్న ఆశలు ఉంటే.. ఇప్పటికైనా వాటిని తీసి పక్కకు పడేయాల్సిన సమయం వచ్చేసినట్లే.
Tags:    

Similar News