ట్రంప్ హత్యకు ఇరాన్ ప్లాన్? వెలుగులోకి సంచలన నిజం
అమెరికా రాజకీయ వర్గాలను కుదిపేసేలా ఒక సంచలన అంశం వెలుగులోకి వచ్చింది.;
అమెరికా రాజకీయ వర్గాలను కుదిపేసేలా ఒక సంచలన అంశం వెలుగులోకి వచ్చింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మాజీ అధ్యక్షుడు జో బిడెన్, అలాగే రిపబ్లికన్ పార్టీ ప్రముఖ నాయకురాలు నిక్కీ హేలీలను హత్య చేయడానికి కుట్ర పన్నారనే ఆరోపణలు అమెరికాలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ కేసులో అరెస్టైన పాకిస్తాన్‌కు చెందిన వ్యక్తి కోర్టులో చేసిన వాంగ్మూలం మరింత సంచలనంగా మారింది.
పాకిస్తాన్‌కు చెందిన ఆసిఫ్ మర్చంట్ అనే వ్యక్తిని 2024 జూన్‌లో అమెరికా పోలీసులు అరెస్టు చేశారు. అమెరికా రాజకీయ నాయకుడిని హత్య చేయడానికి కుట్ర పన్నుతున్నట్లు అనుమానాలు వ్యక్తమవడంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ కేసు న్యూయార్క్‌లోని బ్రోక్లిన్ ఫెడరల్ కోర్టులో విచారణలో ఉంది.
ఈ విచారణ సందర్భంగా ఆసిఫ్ మర్చంట్ కోర్టులో చేసిన ప్రకటనలు ఇప్పుడు పెద్ద చర్చకు దారితీశాయి. తనను ఇరాన్ ఇంటెలిజెన్స్ సంస్థ సంప్రదించిందని, అమెరికా కీలక రాజకీయ నాయకులను హత్య చేయడానికి కుట్రలో భాగస్వామ్యం కావాలని ఒత్తిడి తీసుకొచ్చిందని అతడు తెలిపాడు. ముఖ్యంగా డోనాల్డ్ ట్రంప్, జో బైడెన్, నిక్కీ హేలీ వంటి ప్రముఖులను టార్గెట్ చేయాలని సూచించారని కోర్టుకు వెల్లడించాడు. అయితే తాను స్వచ్ఛందంగా ఈ కుట్రలో పాల్గొనలేదని ఆసిఫ్ మర్చంట్ పేర్కొన్నాడు. తన కుటుంబ సభ్యులను హత్య చేస్తామని బెదిరించడంతో బలవంతంగా వారి మాట వినాల్సి వచ్చిందని చెప్పాడు. కుటుంబ భద్రత కోసం తాను సహకరించినట్లు తెలిపాడు. ఈ వాంగ్మూలం వెలుగులోకి రావడంతో ఈ కేసు మరింత కీలక మలుపు తీసుకుంది.
అమెరికా భద్రతా సంస్థల సమాచారం ప్రకారం.. అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ రాజకీయ పరిస్థితులను అస్థిరపరిచేందుకు ఈ కుట్ర పన్నినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఎన్నికల సమయంలో ప్రముఖ రాజకీయ నాయకులపై దాడులు జరిగితే అమెరికా రాజకీయ వ్యవస్థలో పెద్ద కల్లోలం ఏర్పడే అవకాశం ఉందని భద్రతా నిపుణులు చెబుతున్నారు. ఇక ఈ కేసులో ఇరాన్ పాత్ర ఉందన్న ఆరోపణలపై అమెరికా దర్యాప్తు సంస్థలు కూడా తీవ్రంగా విచారణ కొనసాగిస్తున్నాయి. ఈ ఆరోపణలు నిజమైతే అంతర్జాతీయ స్థాయిలో పెద్ద రాజకీయ ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే అమెరికా-ఇరాన్ సంబంధాలు ఉద్రిక్తంగా ఉన్న నేపథ్యంలో ఈ కేసు మరింత సున్నితంగా మారింది.
అమెరికా న్యాయవర్గాలు చెబుతున్న వివరాల ప్రకారం.. ఆసిఫ్ మర్చంట్ కుట్రలో భాగంగా అమెరికాలో కొన్ని వ్యక్తులతో సంప్రదింపులు జరిపినట్లు ఆధారాలు లభించాయి. అయితే అతడు నేరుగా దాడి అమలు దశకు వెళ్లకముందే భద్రతా సంస్థలు అప్రమత్తమై అతడిని అరెస్టు చేశాయి. ఈ చర్యతో పెద్ద ప్రమాదం తప్పిందని అధికారులు చెబుతున్నారు.
ఈ కేసు నేపథ్యంలో అమెరికాలో రాజకీయ నాయకుల భద్రతపై మరోసారి చర్చ మొదలైంది. ఎన్నికల కాలంలో విదేశీ శక్తులు జోక్యం చేసుకునే ప్రయత్నాలు పెరుగుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రస్తుతం ఆసిఫ్ మర్చంట్‌పై దర్యాప్తు కొనసాగుతుండగా కోర్టులో మరిన్ని కీలక వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. ఈ కేసు తుది ఫలితం ఏమవుతుందో అన్నది ఇప్పుడు అమెరికా రాజకీయ వర్గాల్లో ఉత్కంఠగా మారింది.