దేశ భవిష్యత్తుకు బరువు భయం.. ఆరోగ్యంతో పాటూ ?
ఈ పెరిగే బరువును ఇప్పుడే కంట్రోల్ చేయకపోతే, రాబోయే తరాలు బలహీనపడే ప్రమాదం పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆ వివరాలు ఇలా వున్నాయి ..;
ఈరోజు పిల్లలే రేపటి దేశ పౌరులు. కానీ, నేడు ఆ చిన్నారులు ఊబకాయం బారిన పడటం అనేది కేవలం వారి వ్యక్తిగత ఆరోగ్య సమస్య మాత్రమే కాదు, అది దేశ ఆర్థిక వ్యవస్థకే ఒక సవాల్‌గా మారుతోంది. చిన్న వయసులోనే అధిక బరువు పెరగడం వల్ల వారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోంది. శారీరక శ్రమ తగ్గడం, జంక్ ఫుడ్ అలవాట్లు దేశ ముఖచిత్రాన్ని మార్చేస్తున్నాయి. ఈ పెరిగే బరువును ఇప్పుడే కంట్రోల్ చేయకపోతే, రాబోయే తరాలు బలహీనపడే ప్రమాదం పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆ వివరాలు ఇలా వున్నాయి ..
పెరిగే బరువు.. కుదేలయ్యే ఆరోగ్యం:
పిల్లల్లో ఊబకాయం పెరగడం వల్ల కేవలం లావు అవ్వడమే కాదు, చిన్న వయసులోనే మధుమేహం, బీపీ వంటి దీర్ఘకాలిక వ్యాధులు చుట్టుముడుతున్నాయి. దీనివల్ల ఫ్యూచర్‌లో హెల్త్‌కేర్ ఖర్చులు విపరీతంగా పెరిగిపోతాయి. ఇక ఒక వ్యక్తి సంపాదనలో ఎక్కువ భాగం హాస్పిటల్స్ కే పోతే, అది ఆ కుటుంబానికే కాకుండా దేశ ఆర్థిక ప్రగతికి కూడా పెద్ద అడ్డంకి. ఆరోగ్యకరమైన యువశక్తి ఉంటేనే ఏ దేశమైనా అభివృద్ధి చెందుతుంది. కానీ, అనారోగ్యంతో ఉన్న వర్క్‌ఫోర్స్ వల్ల పని సామర్థ్యం తగ్గిపోతుంది, ఇది దేశాభివృద్ధిని కుంటుపరుస్తుంది.
బడుల్లో ఆటలు.. ప్రభుత్వాల అప్రమత్తత:
ఇక దీనిని అరికట్టాలంటే ముందుగా బడుల్లో మార్పు రావాలి. చదువుతో పాటు వ్యాయామం, ఆటలను ప్రభుత్వం తప్పనిసరి చేయాలి. కేవలం పుస్తకాలతోనే కుస్తీ పట్టకుండా, మైదానంలో పరుగు తీయడం వల్ల పిల్లల మెదడు, శరీరం చురుగ్గా ఉంటాయి. స్కూళ్లు కూడా జంక్ ఫుడ్ విషయంలో కఠినంగా ఉండాలి. ప్రభుత్వం కూడా ఊబకాయం వల్ల వచ్చే అనర్థాల మీద భారీ స్థాయిలో చైతన్యం తీసుకురావాలి. స్కూల్ సిలబస్‌లో పౌష్టికాహారం, ఫిజికల్ ఫిట్‌నెస్ గురించి ప్రత్యేక పాఠాలు ఉండటం తప్పనిసరి కావాలి
ఇంటి భోజనం.. తల్లిదండ్రుల బాధ్యత:
ఇక బయట పిల్లలు ఏమి తింటున్న, పిల్లల ఆహారపు అలవాట్లు ఫస్ట్ ఇంటి దగ్గరే మొదలవుతాయి. సెల్‌ఫోన్లు ఇస్తూ పిల్లలకు తినిపించడం మానేసి, వారిని శారీరక శ్రమ చేసేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలి. ఇంట్లో వండిన సమతుల్య ఆహారం అందేలా చూడటం పేరెంట్స్ బాధ్యత. కేవలం ప్రోటీన్లు, విటమిన్లు ఉన్న ఆహారాన్ని ఇస్తూ, అనవసరమైన స్వీట్ పదార్థాలను దూరం పెట్టాలి. తల్లిదండ్రులు కూడా పిల్లలతో కలిసి వ్యాయామం చేస్తే, వారు దాన్ని ఒక ఆహ్లాదకరమైన అలవాటుగా మార్చుకుంటారు. పిల్లలు ఆరోగ్యంగా ఉంటేనే దేశం బాగుంటుంది. ఊబకాయం అనే మహమ్మారిని తరిమికొట్టడానికి స్కూళ్లు, ప్రభుత్వం, తల్లిదండ్రులు ముగ్గురూ కలిసికట్టుగా అడుగు వేయాల్సిన సమయం వచ్చేసింది.