యుద్ధం గెలిస్తే ఏం జ‌రుగుతుంది.. ఓడితే ఏం జ‌రుగుతుంది ?

యుద్ధం ఖ‌రీదెంత అని ప్ర‌శ్నిస్తే.. వెల‌క‌ట్ట‌లేం అన్న‌దే స‌మాధానం. ఎందుకంటే.. న‌ష్టం ఆర్థిక‌, స‌హ‌జ వ‌న‌రుల‌కే ప‌రిమితం కాదు.;

Update: 2026-03-05 08:30 GMT

యుద్ధం ఖ‌రీదెంత అని ప్ర‌శ్నిస్తే.. వెల‌క‌ట్ట‌లేం అన్న‌దే స‌మాధానం. ఎందుకంటే.. న‌ష్టం ఆర్థిక‌, స‌హ‌జ వ‌న‌రుల‌కే ప‌రిమితం కాదు. ఆయా దేశాల భావిత‌రాల భ‌విష్య‌త్తుకు సంబంధించిన‌ది. ఇది వెల‌క‌ట్ట‌లేని న‌ష్టం. గెలుపుంటే లాభం. ఓట‌మి అంటే న‌ష్టం అన్నఅర్థాలు, అభిప్రాయం స‌మాజంలో ఉంటుంది. కానీ యుద్ధంలో గెలుపు, ఓట‌మి రెండూ ఒక‌టే. న‌ష్ట‌మే. అవి సామాన్య జ‌నానికి ఈజీగా అర్థం కావు. అర్థం చేసుకోరు. అందుకే యుద్ధమంటే మ‌న‌కు సంబంధం లేనిదిగా, మ‌న వ‌ర‌కు రాని ప్ర‌మాదంగా చూస్తారు. అమెరికా, ఇరాన్ మ‌ధ్య యుద్ధంలో అమెరికా గెలిచినా, ఇరాన్ గెలిచినా న‌ష్టం రెండు దేశాల‌కు ఉంటుంది. యుద్ధంలో గెలుపు లాభాన్ని ఇవ్వ‌దు. యుద్ధం అంటేనే న‌ష్టం. అది గెలిచినా, ఓడినా. పెద్ద దేశ‌మైనా, చిన్న‌దేశ‌మైనా. చివ‌రికి మూల్యం చెల్లించేది సామాన్య ప్ర‌జ‌లే. అదెలా అన్న విష‌యం చూద్దాం.

చ‌రిత్ర‌లో అన్ని యుద్ధాల్లోనూ ఒక‌రు గెలిచారు. మ‌రొక‌రు ఓడిపోయారు. కానీ న‌ష్టం మాత్రం ఇద్ద‌రికీ జ‌రిగింది. ఉదాహ‌ర‌ణ‌కు అమెరికా బ‌ల‌మైన ఆయుధ సంప‌త్తి క‌లిగిన దేశ‌మైన‌ప్ప‌టికీ.. ఇరాన్ తో యుద్ధం చేసిన‌ప్పుడు భారీ స్థాయిలో డ‌బ్బును ఖ‌ర్చు పెట్టాలి. యుద్ధం ఒక్క‌రోజుతో ఆగ‌దు. ఆప‌లేరు. రెండో ప్ర‌పంచ యుద్ధాన్ని జ‌పాన్ పై అణుబాంబులు వేసి అమెరికా ఆపింది అన్న వాద‌న ఉంది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితిలేదు. చాలా దేశాల‌తోనూ అణుబాంబులు ఉన్నాయి. ఒక్క‌రు వాడినా, రెండోవాడు వాడుతాడు. ఇద్ద‌రూ తుడిచిపెట్టుకుపోతారు. కాబ‌ట్టి ఇక్క‌డ గెలుపు లేదు. న‌ష్టం మాత్ర‌మే ఉంది.

యుద్ధ స‌మ‌యంలో ప్ర‌భుత్వాలు భారీగా డ‌బ్బును ఖ‌ర్చు పెడ‌తాయి. ఫారిన్ రిజ‌ర్వుల‌ను వాడుతాయి. మ‌రోవైపు సొంత క‌రెన్సీ ముద్రిస్తాయి. క‌రెన్సీ ముద్ర‌ణ కార‌ణంగా ఇప్ప‌టికే ఆయా దేశాల్లోని సేవింగ్స్ వాల్యూ పడిపోతుంది. ప్ర‌జ‌ల కొనుగోలు శ‌క్తి త‌గ్గుతుంది. దీనికి తోడు చ‌మురు స‌ర‌ఫ‌రా వ్య‌వ‌స్థ‌లు దెబ్బ‌తింటే ధ‌రలు పెరిగి.. క‌రెన్సీ వాల్యూ ప‌డుతుంది. అప్పుడు కూడా ప్ర‌జ‌ల కొనుగోలు శ‌క్తి ప‌డిపోతుంది. మ‌ళ్లీ ఆ దేశం కోలుకోవ‌డానికి చాలా కాలం ప‌ట్ట‌వ‌చ్చు. హింస‌, యుద్ధం ఆయుధాలుగా చేసుకున్న దేశాలు ఆర్థికంగా చితికిపోయిన ఉదాహ‌ర‌ణ‌లు అనేకం. అంతిమంగా ప్ర‌జ‌ల జీవ‌న‌ప్ర‌మాణాలు త‌గ్గిపోతాయి. భ‌విష్య‌త్ త‌రాలు ప్ర‌పంచంతో పోటీ ప‌డ‌లేవు. నిరుద్యోగం, ఆర్థిక అస్థిర‌త్వం, వ‌న‌రుల కోసం ఇత‌ర దేశాల‌పై ఆధార‌ప‌డటం, ఆ దేశాలు ఇబ్బందుల్లో ఉన్న దేశాల‌ను త‌మ అవ‌సరాల‌కు అనుగుణంగా వాడుకోవ‌డం ఇవ‌న్నీ కూడా చ‌రిత్ర‌లో క‌నిపించిన సంఘ‌ట‌న‌లు.

యుద్ధం ఎవ‌రికీ లాభం కాదు. కానీ ఆయా దేశాల్లోని అధినేత‌లు, రాజకీయ పార్టీలు యుద్ధాల‌ను అనేక ర‌కాలుగా వాడుకుంటాయి. ఒక‌రు అంత‌ర్గ‌త స‌మ‌స్యలు వెలుగుచూడ‌కుండా ఉండ‌టానికి యుద్ధాన్ని కాంక్షిస్తారు. మ‌రొక‌రు అధికారం కోసం యుద్ధాన్ని కాంక్షిస్తారు. నిత్యం ప్ర‌జ‌ల‌ను ఏమార్చే ప్ర‌య‌త్నం చేస్తారు. ప్ర‌ధాన స‌మ‌స్య‌ల‌ను మాట్లాడ‌కుండా ఉంచేందుకు యుద్ధ వాతావ‌ర‌ణం సృష్టిస్తారు. ప్ర‌జ‌ల భావోద్వేగాల‌ను అనుకూలంగా మార్చుకుంటారు. అంతిమంగా న‌ష్ట‌పోయేది మాత్రం సామాన్య ప్ర‌జ‌లు, వారి పిల్ల‌లే.

Tags:    

Similar News