మాయ‌ల ఫ‌కీరు ప్రాణం చిల‌క‌లో.. మ‌రి ట్రంప్ ప్రాణం ఎందులో ?

ఇంత‌కీ అమెరికాలో సంక్షోభం ఎందుకు వ‌స్తుంది ?. దీనికి కార‌ణం ఏంటి ?. ప్ర‌జ‌ల దృష్టిని ట్రంప్ ఎలా మ‌ర‌ల్చే ప్ర‌య‌త్నం చేస్తున్నారు అన్న‌వి కీల‌క ప్ర‌శ్న‌లు.;

Update: 2026-03-05 07:53 GMT

అమెరికా సంక్షోభం అంచున ఉందా ?. అందుకే ప్ర‌జ‌ల‌ను ఏమార్చే ప‌నిలో ట్రంప్ నిమ‌గ్న‌మ‌య్యారా ?. అంటే అవున‌నే స‌మాధానం కొన్ని వర్గాల నుంచి వినిపిస్తోంది. ముఖ్యంగా అమెరికాలోని ట్రంప్ ను వ్య‌తిరేకిస్తున్న వారు ఇదే చెబుతున్నారు. ఇంత‌కీ అమెరికాలో సంక్షోభం ఎందుకు వ‌స్తుంది ?. దీనికి కార‌ణం ఏంటి ?. ప్ర‌జ‌ల దృష్టిని ట్రంప్ ఎలా మ‌ర‌ల్చే ప్ర‌య‌త్నం చేస్తున్నారు అన్న‌వి కీల‌క ప్ర‌శ్న‌లు.

అప్పుల ఊబిలో అమెరికా

అమెరికా అప్పుల భారం త‌డిసి మోపెడ‌వుతోంది. ప్ర‌భుత్వ అప్పుల భారం 34 ట్రిలియ‌న్ డాల‌ర్లుగా ఉంది. ఇది అమెరికా జీడీపీ కంటే ఎక్కువ‌. డెబిట్ టు జీడీపీ - 120 శాతంగా ఉంది. ఇదొక ప్ర‌మాద‌క‌ర ప‌రిణామం. వ‌డ్డీ చెల్లింపులకే వంద‌ల బిలియ‌న్ డాల‌ర్లు వెళ్తున్నాయి. కానీ డాల‌ర్ ఆధిప‌త్యం ఇంకా అమెరికా ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను కూల్చ‌కుండా నిల‌బెడుతోంది. కానీ భ‌విష్య‌త్తులో వ‌డ్డీ చెల్లింపులు అమెరికా బ‌డ్జెట్ ను మించితే ప్ర‌మాదం త‌ప్ప‌దు. డాల‌ర్ పై విశ్వాసం త‌గ్గినా, డాల‌ర్ కు స‌వాల్ విసిరినా .. అమెరికా సంక్షోభంలోకి జారుకునే ప్ర‌మాదం ఉండొచ్చు. డాల‌ర్ ఆధిప‌త్యం ఉన్నంత వ‌ర‌కు అమెరికా ఇబ్బంది ఉండ‌దు.

డాల‌ర్ ఆధిప‌త్యానికి స‌వాల్

చైనా, ర‌ష్యాతో పాటు మ‌రికొన్ని దేశాలు డాల‌ర్ ఆధిప‌త్యానికి స‌వాల్ విసురుతున్నాయి. ఉదాహ‌ర‌ణ‌కు బ్రిక్స్ క‌రెన్సీ తీసుకురావాల్న యోచ‌న‌. డాల‌ర్ తో దిగుమ‌తులు కారణంగా అమెరికా ఆధిప‌త్యం కొన‌సాగుతూ.. ప్ర‌పంచ పోలీస్ గా వ్య‌వ‌హ‌రిస్తూ ఉండ‌టం చైనా, ర‌ష్యా లాంటి దేశాల‌కు మింగుడు ప‌డ‌టం లేదు. ట్రంప్ కు చెక్ పెట్టాలంటే అమెరికా ఆధిప‌త్యాన్ని త‌గ్గించాలి. డాల‌ర్ ను బ‌ల‌హీనప‌ర‌చాలి. అందుకు ప్ర‌త్యామ్నాయం ఏర్పాటు చేయాలి. అందుకే చైనా, ర‌ష్యా ఈ విష‌యంలో వేగంగా, వ్యూహాత్మ‌కంగా క‌దులుతున్నాయి. ఇప్ప‌టికే కొన్ని దేశాల మ‌ధ్య లోక‌ల్ క‌రెన్సీతో ట్రేడ్ జ‌రుగుతోంది. ఇది ట్రంప్ కు రుచించని అంశం. ఎందుకంటే డాల‌ర్ ఆధిప‌త్యం త‌గ్గితే అప్పుల ఊబిలో ఉన్న అమెరికా వ్య‌వ‌స్థ ప‌త‌న‌మ‌వుతుంది. అలా జ‌ర‌గ‌కూడ‌దంటే చైనా, ర‌ష్యాతో పాటు ఇత‌ర దేశాల‌పై వాణిజ్య ఆంక్ష‌లు విధించాలి. అందుకే ట్రంప్ టారిఫ్ లు విధించారు. దీనికి జాతీయ‌వాదాన్ని జోడించారు. దీని కార‌ణంగా ఎగుమ‌తిదారులు, దిగుమ‌తిదారులు ఇద్ద‌రూ ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. టారిఫ్ లు త‌ప్పుడు నిర్ణ‌య‌మ‌ని అమెరికా సుప్రీం కోర్టు తీర్పును ఇచ్చింది. తాజాగా ట్రేడ్ కోర్టు దిగుమ‌తిదారుకుల టారిఫ్ ల డబ్బు తిరిగి చెల్లించాల‌ని ఆదేశాలిచ్చింది.

యుద్ధ నేప‌థ్యం కూడా డాల‌రే

అమెరికా- ఇరాన్ యుద్ధానికి కారణం ఇరాన్ న్యూక్లియ‌ర్ ప్రోగ్రామ్ అని ట్రంప్ చెబుతున్న‌ప్ప‌టికీ.. వాస్త‌వం మాత్రం చ‌మురు స‌ర‌ఫ‌రా పై నియంత్ర‌ణ కోస‌మేన‌ని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. డాల‌ర్ కు స‌వాల్ విసురుతున్న ర‌ష్యా, చైనాతో ఇరాన్ కీల‌క ఒప్పందాలు కుదుర్చుకుంది. వాణిజ్య సంబంధాలు కొన‌సాగిస్తోంది. ఆయిల్ నిల్వ‌లు అధికంగా ఉండి, చ‌మురు స‌ర‌ఫ‌రా వ్య‌వ‌స్థ‌లో కీల‌క‌మైన ఇరాన్.. చైనా, ర‌ష్యాతో అంట‌కాగితే అమెరికాకు ఇబ్బంద‌ని భావిస్తున్న ట్రంప్.. ఇరాన్ పై యుద్ధం ప్ర‌క‌టించార‌ని ప‌లువురు అంచ‌నా వేస్తున్నారు. ఇది కూడా డాల‌ర్ కు స‌వాల్ విసిరే ప్ర‌క్రియ‌. అందుకే ట్రంప్ వ్యూహాత్మ‌కంగా ఇరాన్ పై దాడికి తెగ‌బ‌డ్డారు. చ‌ర్చ‌ల ప్ర‌తిపాద‌న వ‌చ్చిన‌ప్పుడు .. వెనుజులా మోడ‌ల్ ను ట్రంప్ ప్ర‌తిపాదిస్తున్నార‌ని ఒక ప్ర‌చారం ఉంది. దీనిబ‌ట్టి ఇరాన్ పై యుద్ధం చ‌మురు స‌ర‌ఫ‌రా వ్య‌వ‌స్థ‌ల నియంత్ర‌ణ కోస‌మ‌ని అర్థం చేసుకోవ‌చ్చు. మాయ‌ల ఫ‌కీరు ప్రాణం చిల‌క‌లో ఉన్న‌ట్టు డాల‌ర్ ప్రాణం ఆయిల్ లో ఉంది. డాల‌ర్ వెనుక ఆయిల్ ఉంది. ఆయిల్ లేక‌పోతే డాల‌ర్ ప్ర‌పంచ దేశాల రిజ‌ర్వ్ క‌రెన్సీ కాదు. అమెరికాకు మాత్ర‌మే ప‌రిమిత‌య్యే పేప‌ర్ క‌రెన్సీ.

ఏమార్చే ప్ర‌య‌త్నం

అప్పుల ఊబిలో ఉన్న అమెరికాలో అంత‌ర్గ‌త స‌మ‌స్య‌లు రాకుండా.. టారిఫ్ లు, యుద్ధం పేరుతో ట్రంప్ ప్ర‌జ‌లను ఏమార్చే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. అమెరికాతో ఏ దేశంతో యుద్ధం చేసినా.. దేశ ప్ర‌జ‌ల‌కు న‌ష్టం త‌ప్ప లాభం జ‌ర‌గ‌లేదు. ఇప్పుడు కూడా లాభం లేద‌ని ట్రంప్ వ్య‌తిరేకులు వాదిస్తున్నారు.

Tags:    

Similar News