మోడీ ప్రభుత్వ నిర్ణయంతో దేశానికి లాభమా? నష్టమా?

Update: 2020-11-18 13:30 GMT
ఇంట్లో ఈగల మోత, బయట పల్లకీల మోత లాగా ఉంది ఆర్‌సీఈపీ ఒప్పందం విషయంలో భారత్ తీసుకున్న నిర్ణయం అన్న సెటైర్లు పడుతున్నారు..  రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకానమిక్ పార్టనర్‌షిప్’ (ఆర్‌సీఈపీ) ఒప్పందం చర్చల ప్రక్రియ నుంచి గత ఏడాది నవంబర్‌లో భారత్ వైదొలిగింది. ఈ నిర్ణయం సరైందా, కాదా అన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది.

చైనా గణాంకాల ప్రకారం ఆ దేశం నుంచి భారత్‌కు వచ్చిన దిగుమతులు గత ఏడాది అక్టోబర్‌లో కన్నా ఈ ఏడాది అక్టోబర్‌లోనే ఎక్కువగా ఉన్నాయి. అంటే గత మే నెలలో భారత ప్రభుత్వం ప్రకటించిన ‘ఆత్మనిర్భర’ వ్యూహ ప్రభావం పెద్దగా లేదని అంటున్నారు. ఆత్మ నిర్భరత సాధించేందుకు... దేశీయ మార్కెట్‌ను రక్షించుకుని, మరింత బలోపేతం చేసుకునేందుకు భారత్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

చైనా నుంచి వచ్చే చవక వస్తువులు భారత్ మార్కెట్‌లో ఇబ్బడి ముబ్బడిగా లభిస్తే, దేశీయ కర్మాగారాలు, పరిశ్రమలు ఇబ్బందుల్లో పడతాయన్న భయం మోదీ ప్రభుత్వానికి ఉంది. ఆర్‌సీఈపీ చర్చల నుంచి వైదొలగాలని భారత్ తీసుకున్న నిర్ణయం అప్పుడు ఆ చర్చల్లో పాల్గొంటున్న మిగతా దేశాలను ఆశ్చర్యపరిచింది.

ప్రపంచంలోనే అతిపెద్ద వాణిజ్య ఒప్పందంగా దీన్ని వర్ణిస్తున్నారు. వాణిజ్యానికి అడ్డంకులుగా ఉన్న సుంకాలు, ఇతర అంక్షలను పరస్పరం తగ్గించుకోవడం ఈ ఒప్పందం ముఖ్య ఉద్దేశం.ప్రపంచ జనాభాలో దాదాపు 30 శాతం ఆర్‌సీఈపీ సభ్య దేశాల్లో ఉంటున్నారు. ప్రపంచ ఆర్థికవ్యవస్థలోనూ వీరికి దాదాపు 30 శాతం భాగాస్వామ్యం ఉంది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థికవ్యవస్థ చైనా.. మూడో అతిపెద్ద ఆర్థికవ్యవస్థ జపాన్‌ కూడా ఈ ఒప్పందంలో భాగమయ్యాయి. యురోపియన్ యూనియన్ కన్నా పెద్ద వాణిజ్య కూటమి ఇది.

ఆర్‌సీఈపీలో 10 ఆసియాన్ (ఆగ్నేయాసియా) దేశాలతో పాటు దక్షిణ కొరియా, చైనా, జపాన్, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ సభ్యులుగా ఉన్నాయి. బ్రూనై, ఇండోనేసియా, వియత్నాం, మయన్మార్, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయిలాండ్, మలేసియా, కంబోడియా, లావోస్... ఇవన్నీ ఆసియాన్ దేశాలు. ఆసియాన్ దేశాలతో భారత్‌కు కూడా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఉంది. చైనా, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్‌లతో మాత్రం లేదు.

ఆర్‌సీఈపీ ఒప్పందం నుంచి వైదొలగాలన్న నిర్ణయం గురించి భారత ప్రభుత్వం అధికారికంగా ఇప్పటివరకూ ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదు.‘‘దేశీయ పరిశ్రమలు, రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఆర్‌సీఈపీ నుంచి వైదొలగాలన్న భారత్ నిర్ణయం మోదీ బలమైన నాయకత్వానికి నిదర్శనం’’ అని ప్రభుత్వ వర్గాలు వ్యాఖ్యానించినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ పేర్కొంది. అయితే, ఈ ఒప్పందం నుంచి వైదొలిగి భారత్ పొరపాటు చేసిందని దిల్లీలోని ఫోర్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌కు చెందిన డాక్టర్ ఫైసల్ అహ్మద్ అభిప్రాయపడ్డారు.

‘‘భారత్ తన డిమాండ్లను నెరవేర్చుకునేందుకు ఆర్‌సీఈపీ నుంచి ఇంకా సమయం తీసుకుని ఉంటే బాగుండేది. ఆర్‌సీఈపీ సభ్య దేశాలు బయటి దేశాల కన్నా తమలో తాము ఎక్కువ వ్యాపారం చేసుకుంటాయి. ఆసియాన్ దేశాలు, దక్షిణ కొరియా, జపాన్‌లతో భారత్‌కు వాణిజ్య ఒప్పందాలు ఉన్నాయి. చైనా, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్‌లతో లేవు. ఉదాహరణకు ఇప్పటివరకూ భారత్ నుంచి న్యూజీలాండ్ ఏదైనా దిగుమతి చేసుకుంటుందని అనుకున్నాం. ఒకవేళ ఆర్‌సీఈపీ సభ్య దేశాల్లో ఏదైనా దేశం నుంచి అదే వస్తువు లభిస్తే, న్యూజీలాండ్ ఆ దేశం నుంచే దిగుమతి చేసుకునేందుకు మొగ్గు చూపుతుంది. సుంకాలు తక్కువగా ఉంటాయి కాబట్టి వారికి వస్తువు కూడా చవగ్గా లభిస్తుంది. భారత్ ఎగుమతులపై దీని ప్రభావం నేరుగా ఉంటుంది’’ అని ఫైసల్ అన్నారు.
 
ఆర్‌సీఈపీపై సంతకం చేయకపోవడానికి ప్రధాని మోదీకి అనేక కారణాలున్నాయని, ఈ ఒప్పందంలో చేరడం గురించి భారత్ ఇప్పుడప్పుడే పునరాలోచిస్తుందని తాను అనుకోవడం లేదని ‘వియత్ థింక్ ట్యాంక్ లిమిటెడ్’ అనే మేధో మథన సంస్థ డైరెక్టర్ హోవాంగ్ హోప్ బీబీసీతో అన్నారు. ఒకవేళ ఆర్‌సీఈపీలో భారత్ చేరాలనుకుంటే, చైనా అడ్డు చెప్పదని చైనాలోని సిచువాన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్ అసోసియేట్ డీన్ ప్రొఫెసర్ హువాంగ్ యూంగ్సాంగ్ అన్నారు.

‘‘చైనా పట్ల భయాన్ని వదిలి, పోటీతత్వాన్ని పెంపొందించుకునే దిశగా ఆలోచిస్తే ఆర్‌సీఈపీలో చేరడం భారత్‌కు సులువు అవుతుంది. చైనా సహా ఆర్‌సీఈపీ సభ్య దేశాలన్నీ భారత్ ఒప్పందంలో భాగం కావాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశాయి. భారత్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి’’ అని ఆయన అన్నారు.

భారత్ తొందరపాటుగా ఏ నిర్ణయమూ తీసుకోదన్న అభిప్రాయమూ వినిపిస్తోంది. కరోనా మహమ్మారి అనంతరం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సరళి ఎలా ఉంటుందా అన్నది కూడా భారత్ గమనిస్తోంది.
Tags:    

Similar News