అసలు ‘పంచాయితి’ ఇపుడు మొదలవుతుందా ?

Update: 2021-01-26 04:31 GMT
అవును రాష్ట్రంలో అసలు పంచాయితి ఇపుడు మొదలైంది. సుప్రింకోర్టు ఆదేశాలతో పంచాయితి ఎన్నికల ప్రక్రియకు ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటున్నది. స్టేట్ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశాలను తూచా తప్పకుండా అమల్లో పెడుతున్నది. పంచాయితి రాజ్ శాఖ ప్రిన్సిపుల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, కమీషనర్ గిరిజాశంకర్ ను చాలా స్పీడుగా నిమ్మగడ్డ బదిలి చేసేశారు. అలాగే ఇద్దరు జిల్లాల కలెక్టర్లను, ఓ ఎస్పీని+డిఎస్పీతో పాటు నలుగురు ఇన్సెపెక్టర్లను కూడా బదిలీ చేసేశారు.

ఇక్కడ వరకు ఓకేనే కానీ సుప్రింకోర్టులో ప్రభుత్వ ఓటమిని చంద్రబాబునాయుడు, టీడీపీ బ్యాచ్ తమ ఘన విజయంగా చెప్పుకోవటమే ఆశ్చర్యంగా ఉంది. రేపు జరగబోయే పంచాయితీ ఎన్నికల్లో నూటికి నూరుశాతం పదవులను టీడీపీనే గెలుచుకోవలని చంద్రబాబు నుండి శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్ వరకు ఒకటే హంగామా చేసేస్తున్నారు. ఇక్కడ గమనించాల్సిందేమంటే పంచాయితి ఎన్నికలు పార్టీ రహితంగా జరుగుతాయి.

గెలిచిన వాళ్ళు ఏ పార్టీకి చెందిన వాళ్ళు అనేదాన్ని బట్టి ఏ పార్టీ ఖాతాలో ఎంతమంది సర్పంచులున్నారని అనుకోవాల్సిందే. అయితే లోకల్ బాడీ ఎన్నికలంటే సహజంగా అధికారపార్టీకి అనుకూలంగానే ఉంటాయన్న విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి ఇపుడు ప్రత్యేకించి పార్టీ అఫిలియేషన్ అన్నది లేకపోయినా గెలిచిన వాళ్ళంతా అధికారపార్టీకే జై కొడతారనటంలో సందేహం లేదు. ఇంతచిన్న విషయాన్ని  చంద్రబాబు, కూన లాంటి సీనియర్లు కూడా మరచిపోతే ఎలా ?

చంద్రబాబు చెప్పేదేమిటంటే పంచాయితి ఎన్నికల్లో ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలట జనాలు. అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలో జనాలకు నష్టం జరిగే పనులేవీ జగన్మోహన్ రెడ్డి చేయలేదు. పైగా ఏదో ఓ సంక్షేమ పథకంలో వీలైనంతమందిని లబ్దిదారులుండేట్లుగా చూసుకుంటున్నారు జగన్. కాబట్టి జనాల్లో ప్రభుత్వంపై పెద్దగా వ్యతిరేకత ఉండే అవకాశాలు తక్కువే. ఇంకా చంద్రబాబుపైనే జనాలకు మంటగా ఉంది.

పేదలకు ఇళ్ళు, ఇళ్ళ పట్టాలు ఇవ్వాలని జగన్ అనుకున్నా చంద్రబాబు అడ్డుపడ్డారని, ప్రభుత్వ స్కూళ్ళల్లో ఇంగ్లీషు మీడియం పెట్టనీయకుండా అడ్డుపడ్డాడని, వాలంటీర్ల వ్యవస్ధపై బురద చల్లుతున్నారని ఇలా అనేక కారణాలతో జనాలు చంద్రబాబుపైనే మండుతున్నారని వైసీపీ నేతలంటున్నారు. కరోనా వైరస్ కారణంగా ఎన్నికలు వాయిదా వేయించాలని జగన్ అనుకుంటే నిమ్మగడ్డ+చంద్రబాబు కుట్ర చేసి ఎన్నికలు జరిపిస్తున్నట్లు  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. కాబట్టి రేపటి పంచాయితి ఎన్నికల్లో జనాలు ఎవరికి బుద్ది చెబుతారో తేలిపోతుందని సజ్జల చెప్పారు.
Tags:    

Similar News