బస్ డ్రైవర్ నుంచి దేశాధ్యక్షుడి వరకు: నికోలస్ మదురో సంచలన ప్రయాణం!
1962లో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన మదురో తన యవ్వనంలో జీవనోపాధి కోసం కారకాస్ నగరంలో బస్ డ్రైవర్‌గా పనిచేశారు.;
వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అదుపులోకి తీసుకున్నామంటూ డొనాల్డ్ ట్రంప్ చేసిన ఒక్క ప్రకటన ప్రపంచ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది. అసలు ఎవరీ మదురో? ఒక సాధారణ కార్మిక నాయకుడి స్థాయి నుంచి అమెరికాకే సవాల్ విసిరే స్థాయికి ఆయన ఎలా ఎదిగారు? ఆయన అరుదైన రాజకీయ ప్రయాణంపై స్పెషల్ స్టోరీ..
అతడు ఒకప్పుడు వెనుజులా కారకాస్ నగర వీధుల్లో బస్సు స్టీరింగ్ పట్టి సామాన్యులను గమ్యస్థానాలకు చేర్చేవాడు. కానీ కాలక్రమేణా అదే చేతులతో ఒక దేశం స్టీరింగ్‌ను పట్టుకుని ప్రపంచ రాజకీయ చిత్రపటంలోనే అత్యంత వివాదాస్పద నాయకుడిగా ఎదిగాడు. బస్ డ్రైవర్‌గా ప్రస్థానం మొదలుపెట్టి అగ్రరాజ్యం అమెరికాతోనే ఢీకొంటున్న నికోలస్ మదురో ప్రస్థానం ఇప్పుడు మరోసారి ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది.
అంతర్జాతీయ రాజకీయ యవనికపై ప్రస్తుతం నికోలస్ మదురో గురించే చర్చ నడుస్తోంది. వెనిజులా అధ్యక్షుడిని అదుపులోకి తీసుకున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి... ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలతో వెనిజులా అధ్యక్షుడి ప్రస్థానం మరోసారి ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఒక సామాన్యుడు అసాధారణ శక్తిగా ఎదిగిన తీరు ఆశ్చర్యపరిచినప్పటికీ ఆయన పాలన చుట్టూ అల్లుకున్న వివాదాలు అంతే తీవ్రంగా ఉన్నాయి.
స్టీరింగ్ పట్టిన చేతులే.. దేశాన్ని నడిపించాయి
1962లో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన మదురో తన యవ్వనంలో జీవనోపాధి కోసం కారకాస్ నగరంలో బస్ డ్రైవర్‌గా పనిచేశారు. అయితే కేవలం డ్రైవింగ్‌కే పరిమితం కాకుండా కార్మిక సంఘం నాయకుడిగా ఎదిగారు. కార్మికుల సమస్యలపై ఆయన చేసిన పోరాటాలే ఆయనలోని నాయకత్వ లక్షణాలను బయటకు తీశాయి.
హ్యూగో చావెజ్ ఆశీస్సులతో రాజకీయ రంగప్రవేశం
వెనిజులా దిగ్గజ నాయకుడు హ్యూగో చావెజ్ తో ఏర్పడిన పరిచయం మదురో జీవితాన్ని మలుపు తిప్పింది. చావెజ్ జైలులో ఉన్న సమయంలో ఆయనకు అండగా నిలవడంతో మదురో ‘అత్యంత నమ్మకస్తుడైన శిష్యుడిగా’ పేరు తెచ్చుకున్నారు.చావెజ్ హయాంలో విదేశాంగ మంత్రిగా పనిచేశారు. చావెజ్ మరణానికి ముందు తన రాజకీయ వారసుడిగా మదురోనే ప్రకటించడం విశేషం.
అధికారం చేపట్టిన తర్వాత ఎదురైన సవాళ్లు
2013లో చావెజ్ మరణం తర్వాత అధ్యక్ష పీఠాన్ని అధిష్టించిన మదురోకు పూలబాట కంటే ముళ్లబాటే ఎక్కువగా ఎదురైంది. ఆయన పాలనలో వెనిజులా ఎన్నో సమస్యలు ఎదుర్కొంది. ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వలు ఉన్న దేశం అయినప్పటికీ తప్పుడు నిర్ణయాల వల్ల వెనిజులా ద్రవ్యోల్బణం కోరల్లో చిక్కుకుంది. దేశంలో కనీస అవసరాలు తీరక లక్షలాది మంది ప్రజలు పొరుగు దేశాలకు వలస వెళ్ళారు. మానవ హక్కుల ఉల్లంఘన ఆరోపణలతో అమెరికా సహా అనేక దేశాలు వెనిజులాపై కఠినమైన ఆర్థిక ఆంక్షలు విధించాయి.
మదురో ఎన్నికలు పారదర్శకంగా జరగలేదని ప్రతిపక్షాలు ఇప్పటికీ ఆరోపిస్తూనే ఉన్నాయి. ఆయనను గద్దె దించాలని అమెరికా వంటి దేశాలు ప్రయత్నించినప్పటికీ సైన్యంపై పట్టు ఉండటంతో ఆయన ఇన్నేళ్లుగా తన అధికారాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. తాజాగా ట్రంప్ ఏకంగా వెనుజులాపై యుద్ధం చేసి మధురోను గద్దెదించేశాడు. అదుపులోకి తీసుకున్నట్టు ప్రకటించి సంచలనం రేపారు.
నికోలస్ మదురో కథ ఒక స్ఫూర్తిదాయకమైన ఎదుగుదలగా ప్రారంభమై నేడు ప్రపంచంలోనే అత్యంత వివాదాస్పద రాజకీయ అధ్యాయంగా నిలిచింది. ఒక బస్ డ్రైవర్‌గా జీవితం మొదలుపెట్టి అగ్రరాజ్యం అమెరికాని సైతం ఢీకొనే స్థాయికి చేరడం మదురో ప్రత్యేకత.