తోలు తీస్తా అంటే నాలుక కోస్తా...రేవంత్ ఉగ్ర రూపం
తనకు ఇంగ్లీష్ మాట్లాడటం రాదని హేళన చేస్తున్నారు అని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. పదే పదే తన మీద ఈ విధంగా విమర్శలు చేస్తున్నారు అని అన్నారు.;
అసలే ఫైర్ బ్రాండ్ ఆపైన హాట్ హాట్ ఇష్యూ దాంతో తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి శాసనసభలో జరిగిన చర్చలో మాట్లాడుతూ ప్రత్యర్థి పార్టీ బీఆర్ఎస్ మీద పరుష వ్యాఖ్యలే చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తోలు తీస్తానని అంటున్నారని అయితే తెలంగాణా రైతుల పట్ల కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలోని ప్రభుత్వం చిత్తశుద్ధిని ఎవరూ ప్రశ్నించలేరని అన్నారు. ఒకవేళ అలా ప్రశ్నించాలని చూసినా తోలు తీస్తా మని గర్జించినా వారి నాలుక కోస్తామని రేవంత్ రెడ్డి తన ఉగ్ర రూపమే అసెంబ్లీలో చూపించారు. అడ్డగోలుగా ఎవరు మాట్లాడినా నాలుక కోస్తామని రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణా ప్రయోజనాలను కాపాడే విషయంలో దేవుడి మీద ఆన ఎవరికీ ఏ విధమైన నష్టం అయితే కలుగనివ్వను అని ఆయన శాసన సభ సాక్షిగా గట్టిగానే చెప్పారు.
ఇంగ్లీష్ రాదని ఎగతాళి :
తనకు ఇంగ్లీష్ మాట్లాడటం రాదని హేళన చేస్తున్నారు అని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. పదే పదే తన మీద ఈ విధంగా విమర్శలు చేస్తున్నారు అని అన్నారు. అయితే చైనా జపాన్, జర్మనీ వాళ్ళకు ఇంగ్లీష్ వచ్చా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మెస్సీకి కూదా స్పానిష్ తప్ప ఇంగ్లీష్ ఏమీ రాదు కదా అని ఆయన ఉదహరించారు. ఆటగాడికి ఆట తెలిసి ఉండాలి, పాలకునికి పాలన మీద విషయ పరిజ్ఞానం ఉండాలని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. భాష అనేది ఉన్నది మాట్లాడుకోవడానికి అని ఆయన అన్నారు. జస్ట్ కమ్యూనికేట్ చేసుకోవడానికి ఉద్దేశించిన భాషను పట్టుకుని ఎగతాళి చేయడమేంటని బీఆర్ఎస్ నేతల మీద ఫైర్ అయ్యారు. భాష వల్ల జ్ఞానం ఏమీ రాదని ఆయన అన్నారు. ఇక అమెరికాలో బిచ్చం ఎత్తుకునేవాడికీ ఇంగ్లీష్ వస్తుందని అలాగే బాత్రూం కడుక్కునే వారికి కూడా ఇంగ్లీష్ బాగానే మాట్లాడడం చేతనవుతుందని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. వారిని తెచ్చి తెలుగు మాట్లాడమనండి చూద్దామని సవాల్ కూడా చేశారు. సభా సాక్షిగా తనకు ఇంగ్లీష్ రాదు అంటున్న బీఆర్ఎస్ నేతలకు రేవంత్ రెడ్డి అలా ఇచ్చి పడేశారు.
అతడు సినిమా కధ చెబుతూ :
అంతే కాదు మరో వైపు అతడు సినిమా కధను కూడా ఉదహరిస్తూ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేతల మీద విమర్శలు ఎక్కుపెట్టారు. ఆ సినిమాలో ఒక లీడర్ ని పై నుంచి ఎవడో కాలుస్తాడు, అలా ప్రతీ నేరం చేసే వాడికి ఒక ప్యాటర్న్ ఉంటుందని అందుకే విచారణకు వచ్చిన సీబీఐ అధికారి ఈ తరహా విధానంలో ఎవడు హత్య చేసి ఉంటాడు అన్నదే కూపీ లాగే ప్రయత్నం చేస్తాడని చెప్పారు. జైలులోని పాత క్రిమినల్స్ ని కూడా ఈ విషయంలో ఆరా తీస్తాడని ఆయన చెప్పారు. అలా జేబులు కొట్టేసేవాడికి చైన్లు దోచేసే వాడికి ప్రాజెక్టులు అంచనాలు పెంచేసి దోపిడీ చేసేవారికి కూడా ఒక విధానం ఉంటుందని కేసీఆర్ ని ఇండైరెక్ట్ గా విమర్శిస్తూ రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు సభలో చర్చనీయాంశం అయ్యాయి. మొత్తానికి బీఆర్ఎస్ సభలో లేకపోయినా వారికి ఇవ్వాల్సిన పంచ్ లు సెటైర్లు రిటార్టులు వార్నింగ్స్ అన్నీ కూడా గట్టిగానే సీఎం ఇచ్చేశారు అని అంటున్నారు.