అదరని బెదరని ఖమేనీ...అగ్గి పిడుగు మాదిరి

ఖమేనీ అమెరికా కంట్లో నలుసుగా మారారు. తన పాలనలో ఆయన అగ్ర రాజ్యాన్ని వ్యతిరేకిస్తూనే దూకుడుగా వ్యవహరించారు.;

Update: 2026-03-01 07:11 GMT

ఆయన పేరు చెబితే ప్రత్యర్ధులు ఉలిక్కిపడతారు. ఆయన వ్యూహాలు అంతగా పదును తేరి ఉంటాయి. తాను శత్రువులు అనుకున్న వారికి ముచ్చెమటలు పట్టించి మూడు చెరువుల నీళ్ళు తాగించడం ఆయన విధానం. జడవని జంకని వైఖరి ఆయన నినాదం. అగ్ర రాజ్యమైనా ఆయన లెక్క చేయరు, ఎవరు ఎంతటి వారు అయినా ఆయన తన శక్తిని నమ్ముకుంటారు. అందుకే ఆయన తిరుగులేని నేతగా పశ్చిమాసియాలో దశాబ్దాల పాటు రాజ్యం చేశారు. నియంత అని అని ప్రత్యర్ధులు విమర్శించినా అది తమ ప్రాంతానికి మరీ ముఖ్యంగా తమ దేశానికి అవసరం అన్నది ఆయన గట్టి ఆలోచన. ఆయనే ఇరాన్ సుప్రీం లీడర్ అయతోల్లా అలీ ఖమేనీ. ఆయన మొత్తం రాజకీయ ప్రస్థానం అంతా కూడా సాహసంగానే సాగింది.

విప్లవ పంధాతోనే :

ఇక ఖమేనీ 1939లో ఒక నిరుపేద కుటుంబంలో పుట్టారు. అయితే ఆయన తాను అనుకున్న లక్ష్యాలను సాధించి ఇరాన్ కి సూపర్ లీడర్ గా ఎదిగారు. ఏకంగా నాలుగు దశాబ్దాల పాటు పశ్చిమాసియా ప్రాంతాన్ని శాసించారు. ఇజ్రాయెల్ కి అమెరికాకి కూడా తన దూకుడుతో ఎప్పటికపుడు చెక్ చెప్పాలని చూశారు. ఇక ఖమేనీ జీవితం మొత్తం విప్లవమే శ్వాసగా జీవించారు. అంతే కాదు నియంతగానే తాను అనుకున్నది చేసి చూపించారు.

కీలక మలుపు :

ఇక ఖమేనీ నాలుగు పదుల వయసులో ఇరాన్ లో జరిగిన ఇస్లామిక్ విప్లవంలో కీలక పాత్ర పోషించడం ద్వారా వెలుగులోకి వచ్చారు. అప్పటి ఇరాన్ ప్రభుత్వ అధినేత అయిన షా మహమ్మద్ రెజా పహ్లవీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీరోచితమైన పోరాటాలు చేశారు. ఈ క్రమంలో అనేక సార్లు జైలు పాలు అయి అక్కడ కారాగార వాసం అనుభవించారు. మొత్తానికి షా ప్రభుత్వం అంతమైంది. ఇరాన్ ఒక గణతంత్ర వ్యవస్థగా మారిన తరువాత ఖమేనీ ప్రాబల్యం కూడా రాజకీయంగా బలపడింది. అయితే ఆయనకు శతృవులు నాటి నుంచే మొదలయ్యారు

తొలిసారి హత్యాయత్నం :

ఇదిలా ఉంటే 1981 నుంచి 1989 దాకా ఇరాన్ దేశ అధ్యక్షుడిగా ఖమేనీ బాధ్యతలు నిర్వహినారు. ఆ సమయంలో 1981 లో ఆయన మీద హత్యా యత్నం జరిగింది. అయితే దానిని ఆయన తృటిలో తప్పించుకున్నారు. అయితే ఆ ఘటనలో ఆయన కుడి చేయికి గాయమై పక్షవాతం గా పరిణమించింది. ఆ బాధతోనే జీవితాంతం ఆయన పనిచేశారు. ఆ పక్షవాతాన్ని అపరిమితమైన శక్తిగా మార్చుకున్నారు. దేశానికి సూపర్ లీడర్ గా ఎదిగారు. ఇక 1989 నుంచి ఆయనే ఇరాన్ సర్వసత్తాక నాయకత్వం వహిస్తూ మరణించేవరకూ అదే పదవిలో కొనసాగారు.

అమెరికా కంట్లో నలుసుగా :

ఖమేనీ అమెరికా కంట్లో నలుసుగా మారారు. తన పాలనలో ఆయన అగ్ర రాజ్యాన్ని వ్యతిరేకిస్తూనే దూకుడుగా వ్యవహరించారు. అలాగే ఇజ్రాయెల్ మీద కూడా ఆయన తన ఉక్కు పాదం మోపుతూ ఎత్తులు జిత్తులు అమలు చేశారు. ఇరాన్ ని ప్రాంతీయంగా బలోపేతం చేస్తూ ఇతర ప్రాంతాలలో కూడా తన శక్తిని కూడగట్టారు. అంతే కాదు అణ్వాయుధాలను తయారు చేసేందుకు ఇరాన్ ఉపక్రమించడం అతి పెద్ద సంచలనంగా ప్రపంచవ్యాప్తంగా మారింది.

నియంత అంటే ఆయన :

ఖమేనీ ఇరాన్ లో నియంతగా సరికొత్త చరిత్ర సృష్టించారు. నియంత అంటే ఆయనే అన్నంతగా నిర్వచనం చెప్పారు. సొంత దేశంలో ఏ చిన్న అసమ్మతి రేగినా నిర్దాక్షిణ్యంగా అణచివేయడంలో ఆయన తిరుగులేని అధికారాన్ని చూపించారు 2009లో వచ్చిన గ్రీన్ మూవ్మెంట్ పేరుతో నిరసనలను అలాగే 2019, 2022 లలో ప్రజల నుంచి వచ్చిన తీవ్ర నిరసనలు తిరుగుబాటుగా మారిన నేపథ్యంలో ఉక్కు పాదంతో అణచివేశారు అలా దేశ ప్రజలలో సైతం సింహ స్వప్నంగా నిలిచారు.

పెద్దన్నను లెక్కచేయలేదు :

ఇక అమెరికాతో అయితే ఢీ అంటే ఢీ అన్నట్లుగానే ఖమేనీ వ్యవహరించారు. అసలు ఖాతరు చేయలేదు, ఎంతో బలమైన అమెరికాతో సైతం పెట్టుకున్నారు. ఈ విషయంలో ఎంతో తెగువను చూపించారు. ఇక మధ్య ప్రాచ్యంలో కూడా ఇరాన్ ని ఒక ప్రబల శక్తిగా మార్చే క్రమంలో అమెరికా వ్యతిరేక శక్తులకు ఊతమిచ్చారు. మొత్తం మీద చూస్తే 86 ఏళ్ళ వయసులో ఖమేనీ అంతమయ్యారు. ఖమేనీ శకం అంతమైన తీరు పట్ల ఇరాన్ లో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ఆయన హయాంలో నియంత పోకడల పట్ల ఒక వర్గం అయితే విమర్శలు చేస్తూంటే ఆయన గట్టి నాయకుడని మరో వర్గం అంటోంది. దాంతో ఒక వైపు నిరసనలు మరో వైపు హర్షాలు వ్యక్తం కావడం ఇరాన్ లో ప్రస్తుతం ఉన్న పరిస్థితి.

Tags:    

Similar News