ఖమేని, కీలక ఇరాన్ నేతల హతం...ముగిసిన ఒక శకం. అసలు యుద్ధం ఎందుకొచ్చింది? ఇప్పుడు ఏం జరుగనుంది?
ఫిబ్రవరి 28, 2026 తెల్లవారుజామున టెహ్రాన్‌లోని ఖమేనీ నివాస సముదాయం 'లీడర్‌షిప్ హౌస్' లక్ష్యంగా 'ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ' జరిగింది.;
దశాబ్దాల పాటు పశ్చిమాసియా రాజకీయాలను శాసించిన ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ శకం ముగిసింది. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా నిర్వహించిన అత్యంత రహస్య దాడుల్లో ఖమేనీతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, కీలక సైనిక నేతలు మరణించినట్లు అధికారిక వర్గాలు ధృవీకరించాయి. ఈ పరిణామం అటు ఇస్లామిక్ దేశాల్లో ఆగ్రహాన్ని ఇటు అంతర్జాతీయ వేదికపై తీవ్ర ఉత్కంఠను రేపుతోంది.
ఆపరేషన్ ‘ఎపిక్ ఫ్యూరీ’.. పక్కా స్కెచ్‌తో అటాక్
ఫిబ్రవరి 28, 2026 తెల్లవారుజామున టెహ్రాన్‌లోని ఖమేనీ నివాస సముదాయం 'లీడర్‌షిప్ హౌస్' లక్ష్యంగా 'ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ' జరిగింది. అమెరికా నిఘా సంస్థ సీఐఏ, ఇజ్రాయెల్ సంస్థ మొస్సాద్‌లు అందించిన పక్కా సమాచారంతో ఈ దాడులు జరిగాయి.
ఖమేనీ తన కుటుంబ సభ్యులు, ఐఆర్‌జీసీ (ఐఆర్జీసీ) కీలక నేతలతో సమావేశమైన సమయంలో సుమారు 30 బంకర్ బస్టర్ భారీ బాంబులతో దాడి చేశారు. ఖమేనీ తప్పించుకోవడానికి ఉన్న అన్ని దారులను ముందుగానే మూసివేసి.. భూగర్భ బంకర్లను సైతం ఛేదించే అత్యాధునిక బాంబులను ప్రయోగించారు. ఈ దాడుల్లో ఖమేనీ కుమార్తె, అల్లుడు, కోడలు, మనవడు కూడా మరణించినట్లు ఇరాన్ మీడియా ధృవీకరించింది.
- అసలు ఇరాన్ పై యుద్ధానికి కారణమేంటి?
ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య ప్రస్తుతం నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలు.. యుద్ధ వాతావరణానికి దశాబ్దాల కాలంగా కొనసాగుతున్న రాజకీయ, మతపరమైన వ్యూహాత్మక కారణాలు ఉన్నాయి.
ఇరాన్ అణు కార్యక్రమం
అమెరికా– ఇజ్రాయెల్ యొక్క అతిపెద్ద భయం ఇరాన్ అణుబాంబు తయారు చేయడం... ఇరాన్ అణు ఆయుధాన్ని కలిగి ఉంటే, అది తమ ఉనికికే ప్రమాదమని ఇజ్రాయెల్ భావిస్తుంది. ఎందుకంటే ఇరాన్ నాయకులు అనేకసార్లు "ఇజ్రాయెల్‌ను మ్యాప్ నుండి తుడిచివేస్తాం" అని బహిరంగంగా ప్రకటించారు. ఇరాన్ అణు సామర్థ్యాన్ని అడ్డుకోవడానికి అమెరికా అనేక ఆర్థిక ఆంక్షలు విధించింది. 2015లో జరిగిన అణు ఒప్పందం నుండి డొనాల్డ్ ట్రంప్ తప్పుకోవడంతో ఈ విభేదాలు మరింత ముదిరాయి.
'ప్రాక్సీ' యుద్ధాలు
ఇరాన్ నేరుగా యుద్ధం చేయకుండా మధ్యప్రాచ్యంలోని వివిధ సాయుధ సమూహాలకు మద్దతు ఇస్తూ అమెరికా, ఇజ్రాయెల్ ప్రయోజనాలను దెబ్బతీస్తోంది. లెబనాన్ లోని హిజ్బుల్లా ఇజ్రాయెల్‌కు ఉత్తర సరిహద్దులో ఉన్న ఈ సంస్థకు ఇరాన్ ప్రధాన ఆర్థిక, ఆయుధ వనరులు సమకూరుస్తోంది. ఇక గాజాలో ఇజ్రాయెల్‌పై దాడులు చేసే హమాస్‌కు ఇరాన్ మద్దతు ఇస్తుంది.యెమెన్ లో హుతీలు ఎర్ర సముద్రంలో అంతర్జాతీయ నౌకలపై దాడులు చేస్తూ అమెరికా వాణిజ్యాన్ని దెబ్బతీస్తున్నారు.ఇక ఇరాక్ , సిరియా ఇక్కడ ఉన్న అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ మద్దతు ఉన్న గ్రూపులు తరచుగా దాడులు చేస్తున్నాయి..
ప్రాంతీయ ఆధిపత్యం
మధ్యప్రాచ్యంలోఎవరు బాస్? అనే పోరాటమే ఈ యుద్ధానికి మూలం. ఇరాన్‌లో 1979లో వచ్చిన ఇస్లామిక్ విప్లవం తర్వాత అక్కడ అమెరికా మద్దతు ఉన్న 'షా' పాలన అంతమైంది. అప్పటి నుండి ఇరాన్ అమెరికాను గ్రేట్ సైతాన్ అని, ఇజ్రాయెల్‌ను "లిటిల్ సైతాన్" అని పిలవడం ప్రారంభించింది. ఇరాన్ ఒక షీయా ముస్లిం దేశం. సౌదీ అరేబియా వంటి సున్నీ దేశాలతో ఇరాన్ ఆధిపత్య పోరు నడుస్తోంది. ఇజ్రాయెల్ , అమెరికా.. సౌదీకి మద్దతుగా ఉండటం ఇరాన్‌కు నచ్చదు.
ప్రస్తుతం యుద్ధం ఎందుకు తీవ్రమైంది?
ఇటీవల ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి ఇరాన్ తన అనుబంధ సంస్థలైన హిజ్బుల్లా, హుతీలు ద్వారా ఇజ్రాయెల్‌పై ఒత్తిడి పెంచింది. దీనికి ప్రతిచర్యగా ఇజ్రాయెల్, ఇరాన్ లోని కీలక నేతలను లక్ష్యంగా చేసుకుని హతమార్చింది.
"న్యాయం జరిగింది": డొనాల్డ్ ట్రంప్ ప్రకటన
ఈ ఆపరేషన్ విజయవంతం కావడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ.. "ఇరానీయులకు, అమెరికన్లకు, ప్రపంచానికి న్యాయం జరిగింది" అని పేర్కొన్నారు. ఇరాన్ ప్రజలు తమ దేశాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ఇది ఒక గొప్ప అవకాశమని ఆయన అభిప్రాయపడ్డారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కూడా ఖమేనీ ఇక లేరని స్పష్టం చేస్తూ పశ్చిమాసియాలో కొత్త మార్పు రాబోతుందని సంకేతాలిచ్చారు.
30 ఏళ్ల ఏకఛత్రాధిపత్యం.. ఆపై విషాదాంతం
1989లో అయతొల్లా ఖొమైనీ మరణం తర్వాత సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టిన అలీ ఖమేనీ.. దాదాపు 36 ఏళ్ల పాటు ఇరాన్‌ను తన గుప్పిట్లో ఉంచుకున్నారు. యంతృత్వ పాలనతో సైన్యం, న్యాయ వ్యవస్థ , మీడియాపై పూర్తి నియంత్రణ సాధించారు. నిరసనకారులను కఠినంగా అణచివేయడంలో ఆయనపేరుగాంచారు. అమెరికా-ఇజ్రాయెల్ వ్యతిరేకత చూపించారు. తన హయాంలో పశ్చిమ దేశాలతో నిరంతరం ఘర్షణ వైఖరిని అవలంబించారు. ఖమేనీ మరణంతో ఇప్పుడు ఇరాన్ 'అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్' కొత్త నేతను ఎన్నుకోవాల్సి ఉంది. ఆయన కుమారుడు మొజ్తబా పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
యుద్ధ మేఘాలు.. అంతర్జాతీయ ప్రభావం
ఖమేనీ మరణవార్తతో ఇరాన్ వ్యాప్తంగా ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇరాన్ స్టేట్ టీవీ ప్రజెంటర్ కన్నీటి పర్యంతమవుతూ 40 రోజుల సంతాప దినాలను ప్రకటించారు. మరోవైపు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కోర్ (ఐఆర్.జీసీ ) ప్రతీకారానికి సిద్ధమైంది. అమెరికా స్థావరాలు, ఇజ్రాయెల్ భూభాగాలపై భయంకరమైన దాడులు చేస్తామని ఇరాన్ ప్రకటించింది.
భారత్‌లో ఆందోళన
శ్రీనగర్ వంటి ప్రాంతాల్లో ఖమేనీ మద్దతుదారులు భారీ ర్యాలీలు నిర్వహించి అమెరికా, ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ఉద్రిక్తతల వల్ల ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు, బంగారం ధరలు అమాంతం పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
భవిష్యత్తులో ఏం జరగవచ్చు?
ఇది కేవలం రెండు దేశాల మధ్య కాకుండా లెబనాన్, సిరియా, యెమెన్ , ఇరాక్ దేశాలకు విస్తరించే ప్రమాదం ఉంది. ఇరాన్ ప్రపంచ చమురు సరఫరాలో కీలకమైన 'హోర్ముజ్ జలసంధి'ని మూసివేస్తే, ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ ధరలు ఆకాశాన్ని తాకుతాయి. ఇరాన్‌కు రష్యా , చైనా మద్దతు ఇచ్చే అవకాశం ఉండటంతో, ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీయవచ్చని నిపుణులు ఆందోళన చెందుతున్నారు.
ఈ దాడితో మధ్యప్రాచ్యంలో మూడో ప్రపంచ యుద్ధం మొదలైందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇరాన్ తన తదుపరి అడుగు ఎలా వేస్తుంది? అమెరికా తన రక్షణ కవచాన్ని ఎలా సిద్ధం చేసుకుంటుంది? అనేది ఇప్పుడు ప్రపంచం ముందున్న అతిపెద్ద ప్రశ్న.