జనసేన తొలి రాజ్యసభ ఎంపీగా లింగమనేని
జనసేనకు పార్టీ దేశంలో ఉన్న నాలుగు చట్ట సభలలో ప్రాతినిధ్యం దక్కుతోంది. దాంతో అధికారికంగా సంపూర్ణత్వం వచ్చినట్లు అయింది.
జనసేనకు పార్టీ దేశంలో ఉన్న నాలుగు చట్ట సభలలో ప్రాతినిధ్యం దక్కుతోంది. దాంతో అధికారికంగా సంపూర్ణత్వం వచ్చినట్లు అయింది. జనసేన తరఫున రాజ్యసభకు నామినేట్ అవుతున్న తొలి ఎంపీగా లింగమనేని రమేష్ నిలిచారు. ఆయనకు ఈ పదవిని అప్పగించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. 2015 నుంచి లింగమనేని జనసేనలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు అని జనసేన పార్టీ ప్రకటించింది. జనసేన కోరుకుంటున్న సామాజిక మార్పు సోషల్ ఇంజనీరింగ్ కి పార్టీ విధానాలకు నచ్చి లింగమనేని నాటి నుంచి గత పదకొండేళ్ళుగా పార్టీకి ఎంతో సేవ చేస్తూ వస్తున్నారు అని జనసేన ప్రకటించింది. అందుకే ఆయనను ఈ పదవికి ఎంపిక చేస్తున్నామని ప్రకటించింది.
గురుతర బాధ్యతగా :
ఇదిలా ఉంటే తనను రాజ్యసభకు ఎంపిక చేయడం పట్ల లింగమనేని రమేష్ స్పందించారు. తనకు అప్పగించింది పదవి కాదని గురుతర బాధ్యత అని ఆయన అన్నారు. దానిని అలాగే భావిస్తాను అని చెప్పారు. జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అంతే కాదు టీడీపీ కూటమి తరఫున తన అభ్యర్థిత్వానికి మద్దతు తెలిపిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి, ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రత్యేక ధన్యవాదాలు ఆయన చెప్పారు.
ప్రజల గొంతుకగా :
ఇదిలా ఉండగా జనసేన పక్షాన పవన్ కళ్యాణ్ తనకు అప్పగించింది పదవి కాదని, ఒక బలమైన బాధ్యత అప్పగించారని భావిస్తున్నానని లింగమనేని రమేష్ చెప్పారు. అందువల్ల ప్రజల ఆకాంక్షలకు తగ్గ విధంగా వ్యవహరిస్తానని, అంతే కాకుండా ఏపీ అభివృద్ధి కోసం కృషి చేస్తానని ఆయన చెప్పారు. ఏపీలోని సాధారణ పౌరుడి గొంతుకను రాజ్యసభలో వినిపించడమే తన లక్ష్యంగా కూడా ఆయన చెప్పారు. ఆ విధంగా తాను బాధ్యతాయుతంగా పని చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. అంతే కాదు పవన్ కళ్యాణ్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకొంటానని చెప్పారు.
ముందుగా ఊహించిందే :
ఇదిలా ఉంటే చాలా కాలంగా లింగమనేని రమేష్ కి జనసేన తరఫున రాజ్యసభ సభ్యత్వం దక్కుతుందని ప్రచారం సాగుతూ వచ్చింది. మొత్తం మీద చివరికి అదే నిజం అయింది. జనసేనలో మొదటి నుంచి లింగమనేని రమేష్ పనిచేస్తున్నారు అని ఆ పార్టీ పేర్కొంది. అలా మొదటి నుంచి పునాదిగా ఉన్న వారికి గౌరవించడం ద్వారా అధినేత పవన్ ఒక మంచి భరోసా ఇచ్చారని అంటున్నారు. దీంతో జనసేనకు పార్లమెంట్ లో ముగ్గురు ఎంపీలు ఉన్నట్లు అవుతుంది. లోక్ సభలో ఇప్పటికే జనసేనకు ఇద్దరు ఎంపీలు ఉన్న సంగతి విధితమే. వీరంతా కలిసి పార్లమెంట్ లో ప్రజా సమస్యలను ప్రస్తావించడం ద్వారా జనసేనను మరింతగా పటిష్టం చేస్తారు అని ఆ పార్టీ వర్గాలు ఆశిస్తున్నాయి.