2036 నాటికి డబ్బుతో పనుండదు : AI- రోబోల రాక‌పై ఎలాన్ మస్క్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

టెస్లా & స్పేస్‌ఎక్స్ అధినేతి ఎలాన్ మస్క్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) - రోబోటిక్స్ సాంకేతిక‌త మ‌రో దశాబ్దంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మూలాల నుండి మార్చివేస్తాయని జోస్యం చెప్పారు.

Update: 2026-07-27 03:06 GMT

టెస్లా & స్పేస్‌ఎక్స్ అధినేతి ఎలాన్ మస్క్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) - రోబోటిక్స్ సాంకేతిక‌త మ‌రో దశాబ్దంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మూలాల నుండి మార్చివేస్తాయని జోస్యం చెప్పారు. `ది ఎకనామిస్ట్` ఎడిటర్-ఇన్-చీఫ్ జానీ మింటన్ బెడోస్‌తో జరిగిన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన ``2036 నాటికి డబ్బుతో పనుండదు`` అని సంచలన వ్యాఖ్యలు చేశారు. మనుషులు వినియోగించే దానికంటే ఎక్కువ వస్తువులు, సేవలను ఏఐ - రోబోలు అత్యంత సమృద్ధిగా అందుబాటులోకి తెచ్చినప్పుడు... అసలు డబ్బు అవసరమే ఉండదని ఆయన తన సిద్ధాంతాన్ని వివరించారు.

అయితే ఈ విప్లవాత్మక మార్పుల వల్ల ఉద్యోగాలు కోల్పోవడం... సంపద అసమానతలు పెరగడం.. రాజకీయ అస్థిరత ఏర్పడే ప్రమాదం ఉందంటూ ఇంటర్వ్యూయర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐ వల్ల ఉపాధి కోల్పోయే ప్రజలను ఆదుకోవడానికి ప్రభుత్వాలు సార్వత్రిక ప్రాథమిక ఆదాయం (యూనివ‌ర్శ‌ల్ బేసిక్ ఇన్‌క‌మ్) ఇవ్వాలా లేదా భారీగా పన్నులు విధించాలా అని ప్రశ్నించగా.. ``ట్రెజరీ నేరుగా ప్రజల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలి`` అని మస్క్ ప్రతిపాదించారు. ద్రవ్యోల్బణం పెరుగుతుందన్న హెచ్చరికలను తోసిపుచ్చుతూ.. వస్తువుల ఉత్పత్తి విపరీతంగా పెరిగినప్పుడు ద్రవ్యోల్బణం కాదని... ద్రవ్యసంకోచం మాత్రమే అసలు సవాలుగా మారుతుందని అంచనా వేశారు.

మరోవైపు.. ప్రస్తుతం భయంతో, ధ్రువీకరణతో ఉన్న రాజకీయ వాతావరణం నుండి మస్క్ చెప్తున్న ఈ `స్వర్గధామం` లాంటి స్థితికి చేరుకోవడం అంత సులభం కాదని బెడోస్ అభిప్రాయపడ్డారు. ఏఐ వల్ల ఉద్యోగాలు పోతాయనే భయం ప్రజల్లో పెరిగితే... అది రాజకీయ తిరుగుబాట్లకు.. ప్రభుత్వాల జాతీయకరణ విధానాలకు.. ఆర్థిక విధ్వంసానికి దారితీస్తుందని హెచ్చరించారు. ఈ రాజకీయ పరిణామాలపై బెడోస్ వ్యక్తం చేసిన సందేహాలు, మస్క్ భావిస్తున్న సాంకేతిక విప్లవం మధ్య ఉన్న వ్యత్యాసాన్ని అత్యంత స్ప‌ష్ఠంగా ఎత్తిచూపాయి.

స్వయంగా ఏఐ పరిశోధనల్లో ముందున్న మస్క్ కూడా ఈ సాంకేతికత భవిష్యత్తుపై నిరంతరం అయోమయానికి గురవుతున్నానని అంగీకరించారు. రోజులో లేదా ఒక్కో గంటలో ఏఐని తలుచుకుంటే నా భావోద్వేగాలు అత్యంత ఉత్సాహం నుండి తీవ్రమైన భయం వైపు మారుతుంటాయి! అని తన అంతర్మథనాన్ని బయటపెట్టారు. ఏఐ భ‌యాల గురించి ప్ర‌స్థావించిన మ‌స్క్.. ఈ సాంకేతిక‌త ఇప్ప‌టికే ఆప‌లేని స్థాయికి చేరుకుంద‌ని.. దీనివ‌ల్ల ప్ర‌మాదాల‌ను నివారించేందుకు మాన‌వాళి ప్ర‌య‌త్నించాల‌ని.. ఆపే ప్ర‌య‌త్నం చేయ‌డం కంటే దానిని అనుస‌రించ‌డ‌మే మేలైన మార్గ‌మ‌ని కూడా నివేదించారు.

ఏఐ తీసుకువచ్చే ప్రమాదాల కంటే సమాజానికి జరిగే ప్రయోజనాలే ఎక్కువగా ఉంటాయని విశ్వసిస్తున్న మస్క్.. మ‌రో ఐదేళ్లలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మానవాళి మొత్తం ఉమ్మడి తెలివితేటలను మించిపోతుందని... సూప‌ర్ ఇంటెలిజెంట్ AIని చూస్తామ‌ని సంచలనాత్మ‌క‌ అంచనాను వెలువ‌రించారు. ఈ క్రమంలో ఉత్పత్తుల నష్టాలను తగ్గించడంపైనే దృష్టి పెట్టాలని... విప్లవాత్మక మార్పులకు ప్రపంచం సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు.

Tags:    

Similar News