మోదీ స్థానంలో రాహుల్ ను కూర్చోబెడతా..! రేవంత్ హాట్ కామెంట్స్

ధాన్యం కొనుగోలు అంశంపై తెలంగాణ ప్రభుత్వం, బీజేపీ మధ్య ఆసక్తికర సంవాదం జరుగుతోంది.

Update: 2026-06-05 15:30 GMT

ధాన్యం కొనుగోలు అంశంపై తెలంగాణ ప్రభుత్వం, బీజేపీ మధ్య ఆసక్తికర సంవాదం జరుగుతోంది. ధాన్యం కొనుగోలు చేయలేని కాంగ్రెస్ ప్రభుత్వం పాలన చేతకాదని తప్పుకుంటే, రాష్ట్రపతి పాలన విధించి మొత్తం ఓడ్లు కొంటామని నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఎంపీ కామెంట్స్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. తమకు మాట్లాడటం చేతకాదని బీజేపీ నేతలు అనుకుంటున్నారని, తాము వారికన్నా ఎక్కువ మాట్లాడగలమని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ప్రధాని మోదీ గద్దె దిగిపోతే, ఆ స్థానంలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని కూర్చోబెట్టి ధాన్యం కొనుగోలు పూర్తి చేస్తామని ఘాటుగా సమాధానమిచ్చారు.

కేంద్రం ధాన్యం కొనుగోలు చేయకపోతే, బీజేపీ ఎంపీల ఇళ్ల ముందు ధాన్యం పోరబోస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరికలతో తెలంగాణ రాజకీయం హీటెక్కింది. సీఎం విమర్శలపై నిజామాబాద్ ఎంపీ అర్వింద్ స్పందిస్తూ పాలన చేతకాకపోతే తప్పుకోండి అంటూ సవాల్ విసిరారు. దీనిపై మీడియా అడిగిన ప్రశ్నకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అంతే దీటుగా సమాధానమిచ్చారు. తనను ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోమన్న బీజేపీ నేతల వ్యాఖ్యలకు కౌంటరుగా ‘మోదీనే దిగిపోమనండి. రాష్ట్రంలో ఉన్న ధాన్యం అంతా నేను కొనిపిస్తా..12 ఏళ్లు ఉన్న మోదీ ఏం వెలగబెట్టారో అర్వింద్, బండి సంజయ్ చెప్పాలి’ అంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

అంతేకాకుండా మాట్లాడేటప్పుడు కాస్త బుర్ర ఉపయోగించాలంటూ ఘాటుగా విమర్శలు గుప్పించారు. ప్రధాని మోదీ ప్రతి ఏడాది రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారని, 12 ఏళ్లలో 24 కోట్ల ఉద్యోగాలు ఇచ్చారా? అంటూ సీఎం రేవంత్ రెడ్డి నిలదీశారు. అంతేకాకుండా పేదవాళ్ల ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తామని అన్నారు ఎవరికైనా వేశారా? మోదీ ఇచ్చిన ఇలాంటి 50 హామీలు నేను చెప్పగలను అంటూ రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో 8 మంది బీజేపీ ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులు ఏం చేస్తున్నారో చెప్పాలని నిలదీశారు.

రాష్ట్రంలో 75 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తే, కేంద్ర ప్రభుత్వం కేవలం 50 మెట్రిక్ టన్నులు మాత్రమే తీసుకుంటోందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆరేడు వేల కోట్లను భరిస్తోందని, ధాన్యం కొనుగోలును తాము భారం అనుకోవడం లేదని, బాధ్యతగా భావిస్తున్నామని సీఎం అన్నారు. ఢిల్లీలో కూర్చుని కనీస మద్దతు ధర ప్రకటిస్తే సరిపోతుందా? అంటూ సీఎం ప్రశ్నించారు. ధాన్యం తప్ప మిగిలిన పంటల్లో ఒక్క గింజ కూడా కేంద్రం కొనుగోలు చేయలేదని సీఎం మండిపడ్డారు. బీజేపీ ఎంపీ చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి ఘాటు స్పందన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనిపై ఇరుపార్టీలు విమర్శలు, ప్రతివిమర్శలతో కాకపుట్టిస్తున్నాయని అంటున్నారు.

Tags:    

Similar News