మోడీ చంద్రబాబు సరసన చేరిన నితీష్
బీహార్ రాజకీయాల్లో అతి కీలకమైన వ్యక్తిగా వ్యవస్థగా మారిన నితీష్ కుమార్ రాజకీయ ప్రస్తానం ఎంతో ప్రత్యేకమైనది, విలక్షమైనదిగా చెప్పాల్సి ఉంది.;
దేశంలో కీలకమైన రాజకీయ నాయకులలో నితీష్ కుమార్ ఒకరు. ఆయన బీహార్ కి వరసబెట్టి పదవసారి సీఎం గా ప్రమాణం చేసిన రికార్డుని సొంతం చేసుకున్నారు. దాదాపుగా పాతికేళ్ళుగా బీహార్ ని ఆయన పాలిస్తున్నారు. యాభై ఏళ్ళ రాజకీయ అనుభవం కలిగిన నితీష్ కుమార్ మార్చి 1 న పుట్టిన రోజుతో 75 ఏళ్ళు నిండి 76వ పడిలోకి అడుగుపెట్టారు. 1951 మార్చి 1న ఆయన పుట్టారు. బీహార్ రాజకీయాల్లో అతి కీలకమైన వ్యక్తిగా వ్యవస్థగా మారిన నితీష్ కుమార్ రాజకీయ ప్రస్తానం ఎంతో ప్రత్యేకమైనది, విలక్షమైనదిగా చెప్పాల్సి ఉంది.
అవినీతి మరక లేకుండా :
నితీష్ కుమార్ మొత్తం రాజకీయ జీవితంలో అవినీతి మరక ఎక్కడా లేదు. ఆయన అతి పెద్ద రాష్ట్రానికి సీఎం గా ఉన్నా ఏ రోజూ ఒక్క ఆరోపణ ఆయన మీద రాలేదు అంటే గ్రేట్ అని చెప్పాలి. అంతే కాదు బంధు మిత్రులను దగ్గరకు రానీయలేదు. తన ఏకైక కుమారుడుని సైతం రాజకీయాలకు దూరంగానే పెట్టారు. ఆయనది సాదా సీదా జీవితం. సొంతంగా డబ్బు కూడా సమకూర్చుకోలేదు. ప్రజా సేవలోనే నిరంతరం గడిపారు. ఆయన బీజేపీ అగ్ర నేత వాజ్ పేయ్ మెచ్చిన నాయకుడు. కేంద్రంలో వాజ్ పేయి ప్రభుత్వంలో రైల్వే మంత్రిత్వ శాఖని సమర్ధంగా నిర్వహించారు. తొలిసారి బీహార్ సీఎం గా ఆయనను ఎంపిక చేసి ప్రమాణం చేయించింది కూడా వాజ్ పేయి అని చెప్పాలి.
పెద్దమనిషిగానే :
ఇక నితీష్ కుమార్ మరో ప్రత్యేకత ఏంటి అంటే ఆయన తన రాజకీయ జీవితంలో రెండే రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక అయ్యారు. అదేంటి పాతికేళ్ళకు పైగా సీఎం కదా అనుకునేరు. కానీ ఆయన ఎమ్మెల్సీగానే నెగ్గి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చూస్తున్నారు. ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకుండా పెద్దల సభ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ బీహార్ వంటి రాష్ట్రాన్ని పాలిస్తున్న విలక్షణమైన నాయకుడిగా ఉన్నారు. దానికి ఆయన అనుచరులు చెప్పే కారణం ఆసక్తికరంగా ఉంటుంది. ఎమ్మెల్యే అయితే సొంత నియోజకవర్గానికి సమయం కేటాయించాలి. అభివృద్ధి పనులు చూడాలి. ముఖ్యమంత్రిగా బిజీగా ఉండడం వల్ల పూర్తి న్యాయం చేయలేమని భావించే ఆయన ఎమ్మెల్సీ పదవిని ఎంచుకున్నారు అని అంటున్నారు. అంతే కాదు ఎన్నికల వేళ కూడా తన సొంత నియోజకవర్గంలో పోటీ అంటే అక్కడ ఎక్కువ దృష్టి పెట్టాలి అలా కాకుండా ఉంటే అన్ని చోట్లా ప్రచారం చేయవచ్చు అన్నది కూడా ఉంది. నిధుల విషయంలో కూడా అందరికీ సమానంగా ఇచ్చే విధంగా చూసుకోవడం తనకంటూ సొంతంగా ఏదీ లేదని చాటి చెప్పడమే నితీష్ విలక్షమైన రాజకీయ తత్వం అంటారు. ఇది నిజంగా మిగిలిన వారికి కూడా స్పూర్తిదాయకంగా ఉంటుంది అని చెప్పాలి.
ముగ్గురూ ముగ్గురే :
ఇదిలా ఉంటే కేంద్రంలో ప్రధానిగా ఉన్న నరేంద్ర మోడీ గత ఏడాది సెప్టెంబర్ 17 కి 75 ఏళ్ళను పూర్తి చేసుకున్నారు. ఇక 2025 ఏప్రిల్ 20 నాటికి చంద్రబాబు కూడా 75 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు. నితీష్ ఈ ఇద్దరు నేతల కంటే కొంచెం చిన్న. ఇపుడు ఆయన కూడా వారి సరసన చేరారు. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వానికి మోడీ బాబు నితీన్ చాలా కీలకం అని వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్ డీయే ప్రభుత్వానికి బాబు నితీష్ ఎంపీల మద్దతు ఎంతో ముఖ్యమైనది. అలాగే ఏపీ బీహార్ రాష్ట్రాలలో అభివృద్ధికి కేంద్ర సాయం చాలా అవసరం. అంతే కాదు బీహార్ లో నితీష్ ఇమేజ్ బీజేపీకి అవసరం. అలాగే ఏపీలో బాబు విజన్ కమలం పార్టీకి అతి కీలకంగా ఉంది.ఇలా ముగ్గురు నేతలూ ఎవరికి వారుగా రాజకీయంగా దశాబ్దాలుగా రాణిస్తూ గెలుపునే తమ తమ తారక మంత్రంగా మార్చుకుంటూ ముందుకు సాగుతున్నారు. రాజకీయాల్లో ఏడున్నర పదులలో కూడా కొత్త మెరుపులు మెరిపించడం అంటే అది కొందరికే సాధ్యం. ప్రస్తుతం దేశ రాజకీయాలు చూస్తే మోడీ బాబు నితీష్ ఈ ముగ్గురూ ఏడున్న పదుల వయసులో ఉన్న యువకులుగా చెప్పాల్సి ఉంటుంది.