ఖమేనీ మరణం తర్వాత ఇరాన్‌ ప్రతీకారం: 27 అమెరికా స్థావరాలపై దాడులు

ఇరాక్‌లోని ఇర్బిల్‌ ఎయిర్‌పోర్టు.. బాగ్దాద్‌లోని గ్రీన్‌ జోన్‌ ప్రాంతాలపై దాడులు జరగడం, అక్కడి భద్రతా పరిస్థితులను మరింత అస్థిరంగా మార్చాయి.;

Update: 2026-03-01 09:22 GMT

ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతుల్లా అలీ ఖమేనీ మృతి నేపథ్యంలో పశ్చిమాసియాలో పరిస్థితులు ఒక్కసారిగా ఉద్రిక్తతలకు దారితీశాయి. ఈ ఘటనను తమ దేశ సార్వభౌమత్వంపై జరిగిన దాడిగా భావించిన ఇరాన్‌.. తీవ్ర ప్రతిస్పందనకు దిగింది. తాజాగా ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్స్‌ (ఐఆర్.జీసీ) ప్రకటించిన ప్రకారం.. పశ్చిమాసియాలోని 27 అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణులు, డ్రోన్లతో విస్తృత స్థాయిలో దాడులు జరిపినట్లు వెల్లడించింది. ఈ చర్యలు “ఆపరేషన్‌ ట్రూ ప్రామిస్‌” పేరుతో నిర్వహించబడుతున్నాయని పేర్కొనడం గమనార్హం.

ఈ దాడులు కేవలం సైనిక చర్యలుగా మాత్రమే కాకుండా.. వ్యూహాత్మకంగా పలు దేశాలకు హెచ్చరికలుగా భావించబడుతున్నాయి. ముఖ్యంగా ఇజ్రాయెల్‌లోని టెల్‌ నోప్‌ ఎయిర్‌ బేస్‌, హాకిర్యా వంటి కీలక సైనిక కేంద్రాలను లక్ష్యంగా చేసుకోవడం.. ఈ యుద్ధం కేవలం ప్రాంతీయంగా కాకుండా విస్తృత భౌగోళిక ప్రభావం చూపే అవకాశాన్ని సూచిస్తోంది. అంతేకాదు రక్షణ రంగానికి చెందిన పరిశ్రమలపై దాడులు జరగడం ద్వారా ఇరాన్‌ ప్రత్యర్థుల సామర్థ్యాన్ని దెబ్బతీయాలనే ఉద్దేశం స్పష్టమవుతోంది.

ఖతార్‌ రాజధాని దోహాలో వరుస పేలుళ్లు చోటుచేసుకోవడం.. గగనతలంలోనే క్షిపణులను అడ్డుకోవడానికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది. గల్ఫ్‌ దేశాల్లో గగనతలం మూసివేతకు కూడా ఇదే ప్రధాన కారణంగా నిలిచింది. యూఏఈలోని దుబాయ్‌లో జరిగిన పేలుళ్లు.. ముఖ్యంగా జబిల్‌ అలీ పోర్టులో అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడం.. అంతర్జాతీయ వాణిజ్యానికి కూడా పెద్ద ప్రమాదంగా మారింది. ఈ పోర్టు ప్రపంచంలోనే కీలక లాజిస్టిక్‌ హబ్‌గా ఉండటంతో అక్కడి పరిస్థితులు గ్లోబల్‌ సరఫరా వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

ఇరాక్‌లోని ఇర్బిల్‌ ఎయిర్‌పోర్టు.. బాగ్దాద్‌లోని గ్రీన్‌ జోన్‌ ప్రాంతాలపై దాడులు జరగడం, అక్కడి భద్రతా పరిస్థితులను మరింత అస్థిరంగా మార్చాయి. బహ్రెయిన్‌ వంటి దేశాలు తమ పౌరులను అప్రమత్తం చేయడం, సైరన్లు మోగిన వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించడం.. ఈ యుద్ధం విస్తృతంగా వ్యాపిస్తున్న సంకేతాలను ఇస్తోంది.

ఇక అమెరికా, ఇజ్రాయెల్‌ ప్రతిస్పందన ఎలా ఉండబోతోందన్నది కీలక అంశం. ఇరాన్‌ దాడులకు ప్రతిగా మరింత తీవ్ర చర్యలు తీసుకునే అవకాశం ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అలా జరిగితే ఇది పూర్తి స్థాయి ప్రాంతీయ యుద్ధంగా మారే ప్రమాదం ఉంది. ముఖ్యంగా గల్ఫ్‌ ప్రాంతం ప్రపంచ చమురు సరఫరాలో కీలక పాత్ర పోషిస్తుండటంతో ఈ సంక్షోభం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా తీవ్ర ప్రభావం చూపవచ్చు.

మొత్తంగా చూస్తే ఖమేనీ మరణంతో ప్రారంభమైన ఈ ఉద్రిక్తతలు ఇప్పుడు బహుళ దేశాలను ప్రభావితం చేసే యుద్ధ వాతావరణంగా మారుతున్నాయి. ఇరాన్‌ దాడులు, అమెరికా-ఇజ్రాయెల్‌ ప్రతిస్పందనలు, గల్ఫ్‌ దేశాల భద్రతా చర్యలు.. అన్నీ కలిసి పశ్చిమాసియాను అగ్నికుండంగా మార్చుతున్నాయి. ఈ పరిణామాలు ఎటు దారి తీస్తాయో ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది. సమీప భవిష్యత్తులో దౌత్య చర్చలు ప్రారంభమవుతాయా? లేక ఈ సంక్షోభం మరింత ముదురుతుందా? అనేది ఇప్పుడు కీలక ప్రశ్నగా మారింది.

Tags:    

Similar News