ఢిల్లీలో ప్రత్యక్షమైన హనుమంతన్న.. ఒక్క ఛాన్స్ అంటూ హడావుడి!

సరిగ్గా ఇక్కడే మన హనుమంతన్న ఎంట్రీ ఇచ్చారు. ఆయన వాదన ఏంటంటే, తను పార్టీ కోసం ఏళ్లుగా నమ్మకంగా పనిచేస్తున్నానని, పదేళ్ల నుంచి తనకు ఎలాంటి పదవి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.;

Update: 2026-03-01 09:20 GMT

రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం కానీ.., కొందరు నాయకులు చేసే పనులు భలే వింతగా, ఆసక్తికరంగా ఉంటాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మోస్ట్ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ వీ హనుమంతరావు చేస్తున్న హడావుడి చూస్తుంటే అది నిజమనిస్తుంది. ‘ఒక్క ఛాన్స్ ఇస్తే ఏం పోతది.. పార్టీకి ఏం నష్టం వస్తది?’ అంటూ ఆయన నేరుగా ఢిల్లీ వేదికగా తన మనసులో మాట బయటపెట్టేశారు. అసలు విషయం ఏంటంటే, ప్రస్తుతం రాజ్యసభ సీట్లకు ఎన్నికలు జరుగుతున్న తరుణంలో, ఎవరికీ చెప్పాపెట్టకుండా ఆయన నేరుగా ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు.

అసలు ఏం జరుగుతోంది?

తెలంగాణ కోటాలో ఇప్పుడు రెండు రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్నాయి. మార్చి 5వ తేదీతో నామినేషన్ల గడువు ముగియనుంది. దీంతో సీటు ఆశిస్తున్న నాయకులు తమ ప్రయత్నాల్లో మునిగిపోయారు. ఒక సీటు అయితే దాదాపు ఖరారైపోయిందని టాక్ ఉంది. గతంలో ఉపరాష్ట్రపతి పదవికి పోటీ చేసిన మాజీ న్యాయమూర్తి సుదర్శన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి ఒక సీటు ఇస్తానని హామీ ఇచ్చారట, అది దాదాపు పక్కా అంటున్నారు. ఇక మిగిలిన రెండో సీటు కోసం పోటీ మామూలుగా లేదు. ప్రస్తుతం ఆ సీటులో ఉన్న జాతీయ నేత అభిషేక్ సింఘ్వీ మళ్లీ పోటీ చేస్తారా లేక స్థానిక నాయకులకు అవకాశం ఇస్తారా అన్నది సస్పెన్స్‌గా మారింది.

వీహెచ్ ఆవేదన

సరిగ్గా ఇక్కడే మన హనుమంతన్న ఎంట్రీ ఇచ్చారు. ఆయన వాదన ఏంటంటే, తను పార్టీ కోసం ఏళ్లుగా నమ్మకంగా పనిచేస్తున్నానని, పదేళ్ల నుంచి తనకు ఎలాంటి పదవి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘పార్టీ కోసం అన్నీ వదులుకున్నా.. నా మీద 16 కేసులు పెట్టారు’ అంటూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై కూడా విమర్శలు గుప్పించారు. తన మనసులో ఉన్న కోరికను ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డికి చెప్పానని, అయినా సరే ఎందుకైనా మంచిదని ఢిల్లీ పెద్దలను కలిసి తన గోడు వెళ్లబోసుకోవాలని అక్కడికి వెళ్లినట్లు తెలుస్తోంది.

పార్టీలో హనుమంతన్న చర్చ..

నిజానికి వీహెచ్ లాంటి సీనియర్ నేతలు ఇలా నేరుగా అధిష్టానాన్ని కలిసి అడగడం కాంగ్రెస్‌లో కొత్తేమి కాదు. కానీ, ఆయన టైమింగ్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఎవరికీ సమాచారం ఇవ్వకుండా సడన్‌గా ఢిల్లీలో వాలిపోవడంతో పార్టీ వర్గాల్లో చర్చ మొదలైంది. ఒక పక్క యువ నాయకత్వం దూసుకుపోతుంటే, మరోపక్క తనలాంటి సీనియర్లకు గుర్తింపు ఉండాలని కోరుకుంటున్నారు. ‘తేల్చుకునేందుకే వచ్చా’ అని ఆయన అంటున్న తీరు చూస్తుంటే, ఈసారి రాజ్యసభ సీటు విషయంలో ఆయన గట్టిగానే పట్టుబట్టేలా కనిపిస్తున్నారు.

రాజకీయాల్లో సీనియారిటీకి విలువ ఇవ్వాలా లేక సామాజిక సమీకరణాలు చూడాలా అన్నది ఎప్పుడూ చిక్కు ప్రశ్నే. హనుమంతరావు అడుగుతున్న ‘ఒక్క ఛాన్స్’ మాట అధిష్టానం వింటుందో లేదో చూడాలి. ఏదేమైనా, ఒక సీనియర్ నాయకుడు ఈ వయసులో కూడా అంత ఉత్సాహంగా ఢిల్లీ వెళ్లి తన హక్కు కోసం పోరాడడం చూస్తుంటే ఆయనకు పార్టీ మీద ఉన్న మక్కువ అర్థం అవుతోంది. మరి ఈ 'ఢిల్లీ యాత్ర' ఆయనకు రాజ్యసభ బెర్త్ ఖరారు చేస్తుందా లేదా అన్నది మరో రెండు మూడు రోజుల్లో తేలిపోనుంది.

Tags:    

Similar News