జగన్ చూపిన దారిలో బీఆర్ఎస్!

ఇక సభకు హాజరు కాకుండా సభ జరిగే సమయంలో జగన్ మీడియాను పిలిచి మరీ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇస్తూ వస్తున్నారు.;

Update: 2026-01-03 23:30 GMT

నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అని ఒక సామెత ఉంది. అలా ఏపీ తెలంగాణాలోని రెండు ప్రతిపక్షాలు ఒకరిని చూసి మరొకరు అనుసరిస్తున్నారా లేక అనుకరిస్తున్నారా అన్నది అయితే తెలియడం లేదు కానీ రాజకీయంగా చూస్తే ఆసక్తిని పెంచుతున్నాయి అని చెప్పాల్సి ఉంది. ఏపీలో 2024 లో కొత్త అసెంబ్లీ ఏర్పాటు అయింది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత అసెంబ్లీ సమావేశాలు ఇప్పటికి అనేక సార్లు జరిగాయి కానీ జగన్ ఆయన ఎమ్మెల్యేలు మాత్రం సభకు హాజరు కాలేదు, విపక్ష హోదా ఇస్తేనే సభకు వస్తామని మెలికి పట్టి సభకు దూరం పాటిస్తున్నారు. బడ్జెట్ సెషన్ సందర్భంలో మాత్రమే సభకు జగన్ ఆయన ఎమ్మెల్యేలు హాజరవుతున్నాయి.

మీడియా మీట్ :

ఇక సభకు హాజరు కాకుండా సభ జరిగే సమయంలో జగన్ మీడియాను పిలిచి మరీ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇస్తూ వస్తున్నారు. ప్రభుత్వం తీసుకుని వచ్చిన బిల్లుల విషయంలోనూ అలాగే తమ మీద చేసిన విమర్శల విషయంలోనూ ఆయన ఈ ప్రజంటేషన్ ద్వారా వైసీపీ విధానం ఏమిటో చెబుతున్నారు. అలాగే పాలక పక్షాన్ని కూడా విమర్శిస్తున్నారు. అసెంబ్లీ జరిగే సమయంలో మీడియా మీటింగ్ ద్వారా మాట్లాడుతూ జగన్ కొత్త రకం పొలిటికల్ ట్రెండ్ ని అయితే క్రియేట్ చేశారు. దీని మీద ఎన్ని విమర్శలు వచ్చినా ఆయన అయితే అదే పంధాను అనుసరిస్తున్నారు. సభకు రావాలని కదా ప్రజలు ఎన్నుకున్నది అని తోటి విపక్షాలు ప్రశ్నించినా అలాగే సభకు రాకపోతే సభ్యత్వాలు రద్దు చేస్తామని కూటమి పెద్దలు హెచ్చరించినా వైసీపీ ఇదే స్టాండ్ మీద ఉంది.

బీఆర్ఎస్ సైతం :

ఇక బీఆర్ ఎస్ కూడా ఇదే రూట్ లో ఉందా అన్న డౌట్ వస్తోంది అంటున్నారు. సభలో మాట్లాడేందుకు మైక్ ఇవ్వడం లేదని స్పీకర్ పక్షపాత వైఖరితో వ్యవహరిస్తున్నరని బీఆర్ఎస్ కి చెందిన మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అంటున్నారు. అలాంటపుడు సభకు వెళ్ళి ఉపయోగం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి తప్పులను ఎత్తి చూపేందుకు మైకు ఇవ్వడం లేదని సీఎం ని విమర్శిస్తే మైక్ ఇవ్వమని స్పీకర్ స్వయంగా చెప్పారని ఆయన గుర్తు చేశారు. ఉమ్మడి ఏపీలో ఉన్నపుడు కూడా అసెంబ్లీలో తమకు ఇలాంటి పరిస్థితి లేదని ఆయన అంటున్నారు. మొత్తం మీద అసెంబ్లీకి బీఆర్ఎస్ దూరంగా ఉండడమే కాదు తెలంగాణా భవన్ లోనే మీడియాను పిలిచి జల వివాదాల మీద పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వబోతోంది. దీనిని బట్టి చూస్తే మైక్ ఇవ్వరని ముందే ఊహించి వైసీపీ మొదటి నుంచే సభకు దూరంగా ఉంటే రెండేళ్ళ పాటు అసెంబ్లీకి వెళ్ళిన తరువాత ఇపుడు మైక్ తమకు ఇవ్వడం లేదని చెబుతూ బీఆర్ ఎస్ సభకు దూరంగా ఉండడం విశేషంగానే ఉంది అని అంటున్నారు.

మరి సభకు వెళ్ళకుండా విపక్షాలు మీడియా మీట్లతోనే గడిపితే ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేలకు ప్రజాస్వామ్యంలో విధులు, బాధ్యతలు గురించి కూడా చర్చ వస్తోంది. అయితే అసెంబ్లీ అంటే కేవలం అధికార పక్షంలో ఉంటేనే వెళ్లాలన్న ధోరణి మారాల్సిన అవసరం ఉందని మేధావులు సూచిస్తున్నారు. అలాగే మైక్ ఇవ్వడం లేదు అన్నది కాకుండా ప్రజా సమస్యల మీద పోరాడడానికి ఇంకా గట్టిగా చట్ట సభలనే వేదికగా చేసుకోవాలని కూడా కోరుతున్నారు.

Tags:    

Similar News